పాక్ లో హిందూవులపై దాడులు: యువతులను ఎత్తుకెళ్లి మతమార్పిడి

Update: 2020-06-25 02:30 GMT
ముస్లిం దేశంగా ఉన్న పాకిస్థాన్‌లో మైనార్టీలుగా హిందువులు ఉన్నారు. ఆ దేశంలో హిందూవులపై రోజురోజుకు ఆగడాలు పెరుగుతున్నాయి. హిందూ మతానికి చెందిన యువతులను కిడ్నాప్‌ చేసి వారిని బలవంతంగా ఇస్లాం మతంలోకి మారుస్తున్న ఘటనలు నిత్యం చోటుచేసుకుంటున్నాయి. మతం మార్చి అనంతరం ఆ యువతులను ముస్లిం యువకులకిచ్చి వివాహం చేస్తున్నారు. ఇది ఒక్క హిందూ మతమే కాదు పాక్‌లో మైనార్టీలుగా ఉన్న సిక్కు, క్రైస్తవులపై కూడా ఈ విధంగా దాడులు జరుగుతున్నాయి. తాజాగా.. మరో సంఘటన చోటు చేసుకుంది.

సింధ్ ప్రావిన్స్‌లోని జాకోబాబాద్‌లో జూన్ 18వ తేదీన రేషమన్‌ అనే ఓ హిందూ మైనర్‌ యువతిని యువకుడు వజీర్‌ హుస్సేన్‌ బలవంతంగా తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆ యువతిని ఇస్లాంలోకి మతం మార్చి.. వివాహం చేసుకున్నాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇలా ఆ దేశంలో మైనార్టీలపై దాడులు అధికమయ్యాయి.

తమ అమ్మాయిలు కిడ్నాప్‌ అయ్యారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఎంత మొత్తుకున్నప్పటికీ.. ఆ బాధిత కుటుంబీకులు పోలీస్ స్టేషన్‌ మెట్లు ఎక్కినప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది. ముఖ్యంగా సింధ్ ప్రావిన్స్‌లో ఈ సంఘటనలు అధికంగా జరుగుతున్నాయి.

అయితే ఈ సంఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండడంతో వారు ఆ యువతులను భయబ్రాంతులకు గురిచేస్తూ తప్పుడు ప్రకటనలు చేయిస్తున్నారు. తమ ఇష్టంతోనే మతం మారుతున్నామని.. వివాహం కూడా తమ ఇష్టంతోనే చేసుకుంటున్నామంటూ.. వారు చెప్పేలా చేస్తున్నారు. మైనర్ యువతులను కూడా మేజర్ అంటూ తప్పుడు పత్రాలను సృష్టిస్తున్న పరిస్థితులు ఆ దేశంలో ఉన్నాయి. ప్రతి ఏటా దాదాపు 1000 నుంచి 2000 మంది యువతులు, వివాహితలు ఈ విధంగా వారికి బలవుతున్నారు.
Tags:    

Similar News