కిర్లంపూడిని అలా క‌మ్మేశార‌ట‌

Update: 2017-07-23 08:03 GMT
ఎన్నిక‌లు వ‌స్తున్నాయంటే చాలు.. ఓటు బ్యాంకు రాజ‌కీయాలు ఎంత‌లా మొద‌ల‌వుతాయో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఓట్లు వేయించుకునేందుకు ఎంత‌టి హామీలు అయినా వెనుకా ముందు చూసుకోకుండా ఇవ్వ‌టం.. తీరా ఇచ్చిన త‌ర్వాత వాటిని అమ‌లు చేయ‌కుండా బ‌ద్నాం కావ‌టం పాల‌కుల‌కు అల‌వాటే.

స‌రిగ్గా అలాంటి తీరునే ప్ర‌ద‌ర్శిస్తుంటారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా గెలుపు మాత్ర‌మే ల‌క్ష్యమ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించి.. నోటికి వ‌చ్చిన హామీల్ని ఇచ్చేసిన చంద్ర‌బాబు.. ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన త‌ర్వాత తానిచ్చిన హామీల్లో ఎన్నింటిని నెర‌వేర్చార‌న్న‌ది తెలిసిందే.

కాపు ఓటుబ్యాంకును ఆక‌ర్షించేందుకు వీలుగా కాపులను బీసీ జాబితాలో చేరుస్తామ‌ని చెప్పిన చంద్ర‌బాబు.. తానిచ్చిన హామీని నెర‌వేర్చే విష‌యంలో ఎన్ని త‌డ‌బాట్ల‌కు గురి అవుతున్నారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. కాపుల్ని బీసీల్లోకి చేర్చ‌టం అంటే అదేమంత చిన్న విష‌యం కాదు. ఆ విష‌యంపై అవ‌గాహ‌న ఉన్న‌ప్ప‌టికీ.. ఎన్నిక‌ల్లో గెలుపు మాత్ర‌మే ముఖ్య‌మ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన చంద్ర‌బాబు.. కాపుల్ని బీసీల్లోకి చేరుస్తామంటూ హామీ ఇచ్చారు.

అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు దాటినా.. ఇప్ప‌టివ‌ర‌కూ కాపుల రిజ‌ర్వేష‌న్ల అంశం ముందుకు వెళ్లింది లేదు.  నిజానికి బాబు చెప్పే వ‌ర‌కూ.. కాపులు ఎవ‌రూ త‌మ‌కు రిజ‌ర్వేష‌న్లు ఇవ్వ‌మ‌ని అడిగింది కూడా లేదు. అలా అని వారికి  రిజ‌ర్వేష‌న్ ఆకాంక్ష లేదా? అంటే ఉంద‌నే చెప్పాలి. కాకుంటే త‌మ భావోద్వేగాల్ని ఓట్ల రూపంలో దండుకునే నేత‌ల మీదున్న ఆగ్ర‌హంతో రిజ‌ర్వేష‌న్ హామీని న‌మ్మ‌టం మానేసి చాలా కాల‌మే అయ్యింది. అయితే.. ప‌దేళ్ల త‌ర్వాత అధికారం కోసం త‌పిస్తున్న బాబు.. తానిచ్చిన హామీల్ని ఎట్టి ప‌రిస్థితుల్లో అయినా అమ‌లు చేస్తానంటూ చెప్పిన మాట‌లు కొంత‌మేర న‌మ్మ‌కాన్ని క‌లిగించాయి.

అయితే.. ఎప్ప‌టి మాదిరే ఇచ్చే హామీల‌కు.. చేసే ప‌నుల‌కు ఏమాత్రం సంబంధం లేన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే  బాబు తీరుపై ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కాపుల రిజ‌ర్వేష‌న్ల కోసం ఉద్య‌మ గ‌ళాన్ని విప్పిన కాపునేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కార‌ణంగా ఏపీ స‌ర్కారు ప‌లుమార్లు డిఫెన్స్ లో ప‌డింది.

ఉద్య‌మ‌వేడిని త‌గ్గించేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు హామీలు ఇస్తూ వ‌చ్చిన చంద్ర‌బాబు మాట‌ల్ని ఇక‌పై న‌మ్మేది లేద‌ని తేల్చి చెబుతూ.. ఈ నెల 26 నుంచి ఛ‌లో అమ‌రావ‌తి పేరిట ముద్ర‌గ‌డ ఇచ్చిన పిలుపు ఏపీ స‌ర్కారుకు ఇప్పుడు ఇబ్బందిక‌రంగా మారింది. దీంతో ఆయ‌న పాద‌యాత్ర‌ను ఎలాగైనా అడ్డుకోవాలన్న త‌ప‌న ఏపీ స‌ర్కారులో క‌నిపిస్తోంది. పాద‌యాత్ర తేదీ ద‌గ్గ‌ర ప‌డే కొద్దీ.. పోలీసుల నిర్బంధం కిర్లంపుడిలో అంత‌కంత‌కూ పెరుగుతోంది.
4

కాపు ఉద్య‌మానికి కేంద్ర‌బిందువైన కిర్లంపుడి ప్ర‌స్తుతం ఖాకీల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. పోలీసుల దిగ్భందంతో ఎప్పుడేం జ‌రుగుతుందో అర్థం కాని ప‌రిస్థితి. ముద్ర‌గ‌డ పిలుపు నేప‌థ్యంలో గ‌డిచిన మూడు రోజులుగా కిర్లంపుడిలో  144 సెక్ష‌న్ అమ‌ల‌వుతోంది.

పెద్ద ఎత్తున చెక్ పోస్టులు పెట్టి.. వాహ‌నాల్ని పోలీసులు త‌నిఖీ చేస్తున్నారు. ముద్ర‌గ‌డ నివాసం చుట్టూ భారీగా పోలీసులు మొహ‌రించారు. బ‌య‌ట వ్య‌క్తులు ఎవ‌రూ ముద్ర‌గ‌డ ఇంట్లోకి వెళ్ల‌కుండా అడ్డుకుంటున్నారు. పాద‌యాత్ర‌కు కాపు నేత‌లు రాకుండా ఉండేలా ముంద‌స్తుగా బైండోవ‌ర్ కేసులు న‌మోదు చేస్తున్నారు. మొత్తంగా పాద‌యాత్ర‌ను అడ్డుకునేందుకు ఎన్ని ఆంక్ష‌లు.. మ‌రెన్ని ప‌రిమితులు విధించాలో అన్నింటిని ఏపీ స‌ర్కారు విధిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. పాద‌యాత్ర‌ను అడ్డుకోవ‌టానికి ఇన్ని నిర్బంధాలు అవ‌స‌ర‌మా? అని కాపు నేత‌లు మండిప‌డుతున్నారు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో పాద‌యాత్ర తేదీ కంటే ముందే కిర్లంపుడి వేడెక్కింది.
Tags:    

Similar News