చెన్నైని వరుణుడు పగబట్టాడా?

Update: 2015-12-01 16:22 GMT
గత రెండు వారాలుగా పరిస్థితి చూస్తుంటే.. ఈ మాట అనుకోవాల్సిందే. దేవుడు.. దెయ్యం లాంటి మాటల్ని పక్కన పెడితే.. వాన భూతం చెన్నై మహానగర ప్రజల్ని వణికిస్తోంది. ఆకాశానికి చిల్లులు పడినట్లుగా ఏకబిగిన కురుస్తున్న వానతో తమిళులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆ మధ్యన అల్పపీడనంతో దాదాపు వారం రోజుల పాటు వాన షాక్ తో విలవిలాడిన చెన్నై వాసులకు మరోసారి అలాంటి చేదు అనుభవం మొదలైంది. చెన్నైతోపాటు తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది.

తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా మంగళవారం ఉదయం నుంచి ఏకధాటిగా తమిళనాడులో వర్షాలు పడుతున్నాయి. నిజానికి ఈ అల్పపీడనం కారణంగా తమిళనాడులోని పలు ప్రాంతాలతోపాటు.. చిత్తూరు.. నెల్లూరు.. ప్రకాశం జిల్లాల్లో కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి. అయితే.. మిగిలిన అన్నీ చోట్లా పరిస్థితి ఒక ఎత్తు అయితే.. చెన్నైలో పరిస్థితి మహాదారుణంగా మారింది. వారం రోజుల పాటు కురిసిన మాయదారి వానతో చెన్నై మహానగరి అతలాకుతలమైతే తాజాగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెన్నై వీధుల్లో భారీగా వాననీరు నిలిచిపోయింది.

ఈ వాన నీరుతో పెద్ద ఎత్తున వాహనాలు కొట్టుకుపోయినట్లుగా చెబుతున్నారు. లోతట్లు ప్రాంతాలు చెరువుల మాదిరిగా మారిపోయాయి. చెన్నైలోని పలు ప్రాంతాల్లో ఆరు అడుగుల మేర నీరు నిలిచిపోయినట్లుగా చెబుతున్నారు. చాలామంది మేడ మీదనే ఉండిపోయే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఒకప్పుడు వాన జాడ కోసం పరితపించిన చెన్నై వాసులు ఇప్పుడు వానంటేనే వణికిపోయే పరిస్థితికి చేరుకున్నారు. వర్షం వారిని వెంటాడుతున్న తీరు చూస్తే.. భయపడాల్సిందే. కొన్నాళ్లు పాటు వాన తమ దరికి రాకూడదని చెన్నై వాసులు కోరుకోవటం చూస్తే.. వాన వారిని ఎంతగా వణికిస్తుందో తెలుస్తోంది. ఇక.. వాతావరణ శాఖ అధికారుల అంచనా ప్రకారం.. రానున్న 48 గంటలు మరింత వర్షం తప్పదని చెబుతున్నారు.
Tags:    

Similar News