మిడ్ మానేరుకు గండి పడింది

Update: 2016-09-25 09:52 GMT
తెలంగాణలో కొద్దిరోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఇప్పటికే వర్షాల కారణంగా హైదరాబాద్ మహానగరం వరద నీటితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ వర్ష తీవ్రత ఎక్కువగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా కరీంనగర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న మిడ్ మానేరు ప్రాజెక్టుకు గండి పడింది. భారీగా వస్తున్న వరద నీటి కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

పలు గ్రామాల్లోకి వర్షపు నీరు భారీగా వస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు దిగువన ఉన్న గ్రామాల్లోని ప్రజల్ని ఖాళీ చేయిస్తున్నారు. భారీ మొత్తంలో వస్తున్న వర్షంతో డ్యాం మట్టికట్టకు గండి పడినట్లు తెలుస్తోంది. మిడ్ మానేరుకు పడిన గండి కారణంగా కరీంనగర్ – సిరిసిల్ల మధ్యన రాకపోకలు నిలిచిపోయాయి. తాజాగా చోటు చేసుకున్న పరిణామంతో మిడ్ మానేరు ప్రాజెక్టు దిగువ ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

మిడ్ మానేరులో ప్రమాదకర పరిస్థితి చోటుచేసుకోవటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు అక్క‌డికి చేరుకున్నాయి. ఇక.. మంత్రి హరీశ్ రావు సైతం గండి పడిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. గండి కారణంగా ప్రభావితమయ్యే ప్రాంతాల ప్రజలకు సహాయక చర్యలు అందించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కొదురుపాక - మున్వాడ - రుద్రవరం గ్రామాల్ని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పటికే కొన్ని గ్రామాల్లోకి వరద నీరు వచ్చినట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News