అతి చిన్న వయస్సులోనే హార్ట్ ఎటాక్..కారణాలేంటి?

Update: 2021-09-03 15:30 GMT
హార్ట్ ఎటాక్ అంటే ఒకప్పుడు పెద్దగా ఎవరికీ తెలియదు. ఏ 60 , 65 ఏళ్లు పై బడిన వారికి వచ్చేది. కానీ, ప్రస్తుతం నిండా ముప్పై ఏళ్లు కూడా నిండని వారికి సైతం హార్ట్ ఎటాక్ వస్తుంది. ఒకప్పుడు గుండె జబ్బులు, డయాబెటీస్ వంటి రోగాలు వయస్సు పైబడిన తర్వాతే కనిపించేవి. కానీ ఈ రోజుల్లో.. అరవైలో వచ్చే వ్యాధులు ఇరవైలోనే దాడి చేస్తున్నాయి. నిండు నూరేళ్లు జీవించాల్సిన మనిషి, మధ్యలోనే ప్రాణాలు వదిలేస్తున్నాడు. ముఖ్యంగా మన దేశంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. చిన్న వయస్సులోనే గుండెపోటుతో ఎంతోమంది మరణిస్తున్నారు. ఇటీవల జరిపిన పలు అధ్యయనాల్లో మరెన్నో భయానక వాస్తవాలు బయటపడ్డాయి. ఇండియాలో చాలామంది 30 నుంచి 50 ఏళ్ల లోపు వయస్సులోనే తీవ్రమైన గుండె నొప్పితో మరణిస్తున్నారని వెల్లడైంది.

ప్రముఖ టీవీ నటుడు, బిగ్ బాస్ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా హఠాన్మరణం అందరినీ కలవరపాటుకు గురిచేస్తోంది. ఆయన వయస్సు నలబై ఏళ్లే. ఇంత చిన్న వయసులో గుండెపోటుతో చనిపోవటమే ఈ కలవరానికి కారణం. దీనిని ముంబైలోని కూపర్ ఆసుపత్రి ధృవీకరించింది. అయితే చిన్న వయస్సులోనే ఇలా ఎందుకు జరుగుతుంది అంటే..దీనికి డాక్టర్లు ఏమంటున్నారంటే, మారిన లైఫ్‌ స్టయిలే కారణమన్న సమాధానం వస్తోంది. మరీ ముఖ్యంగా యువతలో స్మోకింగ్‌ అలవాటు ఎక్కువగా ఉండటం. వృత్తిపరమైన అధిక మానసిక వత్తిడి. శారీరక శ్రమ తగ్గిపోవటం. ఇదే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

ఇటీవల జరిపిన ఓ పరిశోధన ప్రకారం.. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే దక్షిణాసియా దేశాల ప్రజల్లోనే గుండె సమస్యలతో బాధపడేవారి సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువ ఉన్నట్లు తేలింది. ఇందుకు జీన్స్ మాత్రమే కాదు. మారుతున్న జీవన శైలి కూడా కారణమని పరిశోధకులు తేల్చి చెప్పారు. నాగరికత పెరిగే కొద్ది ప్రజల లైఫ్‌ స్టైల్ కూడా మారుతోంది. ఫలితంగా ప్రజల ఆరోగ్యం క్రమేనా క్షీణిస్తోంది. 2030 నాటికి ఇండియాలో 80 మిలియన్ మంది డయాబెటీస్‌ తో బాధపడుతుంటారని అంచనా. ధిక బరువులేని వ్యక్తుల్లో కూడా టైప్-2 డయాబెటీస్ ఏర్పడుతోంది. రక్తపోటు, ఊబకాయం సమస్యల వల్ల ఆరోగ్యం క్షీణిస్తోంది. ఉప్పు, కొవ్వులు, చక్కెర అధికంగా ఉండే ఆహారాన్ని అతిగా తీసుకోవడం కూడా ఒక కారణం. వీటి వల్ల శరీరంలో చెడు కొవ్వులు బాగా పెరిగిపోతాయి. దీంతో హైపర్ టెన్షన్ పెరిగి గుండెపై ఒత్తిడి పెరుగుతుంది.

ఒకప్పుడు గుండెపోటు 60 ఏళ్లు దాటితేనే వస్తుందని అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు 40 ఏళ్లు అనేది హార్ట్‌ ఎటాక్‌ కు కామన్‌ ఏజ్‌గ్రూప్‌ గా మారింది. అలా చనిపోతునన వారిలో దాదాపు 20 శాతం మంది 40 , అంతకంటే తక్కువ వయస్సు వారే. మరోవైపు, గుండె పోటుతో మ‌ర‌ణించే వారిలో 25 శాతం మంది 35 ఏండ్ల లోపు వారేన‌ని కార్డియాల‌జీ సొసైటీ ఆఫ్ ఇండియా స‌ర్వే లో బయటపడింది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే భారతీయ యువత కంటే.. పట్టణాల్లో నివసించే యువతకే ఎక్కువ ముప్పు పొంచి ఉంది. సరైన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం, నిద్రకు దూరం కావడం ఇందుకు ప్రధాన కారణాలు. కొందరు అర్ధరాత్రిళ్లు కూడా నిద్రమానుకుని మొబైళ్లు, టీవీలు, ఓటీటీలు చూస్తుంటారు. ఆ అలవాటు వల్ల వారు తెలియకుండా తమ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. ఒత్తిడి, డిప్రషన్ కూడా పెరుగుతుంది. ఫలితంగా డయాబెటీస్, ఊబకాయం వంటి సమస్యలు ఏర్పడతాయి. అవి క్రమేనా గుండె జబ్బులకు దారి తీస్తాయట.

దూమపానం, మద్యపానం గుండెను మరింత బలహీనం చేస్తాయి. నేటి యువత చిన్న వయస్సులోనే స్మోకింగ్, డ్రింకింగ్‌‌కు అలవాటు పడుతున్నారు. సిగరెట్లు, బీడీల్లో ఉండే కార్బన్ మోనాక్సైడ్ మన రక్తంలోని ఆక్సిజన్ శాతాన్ని తగ్గించేస్తుంది. దాని వల్ల శరీరంలోని అవయవాలు పాడవుతాయి. ముఖ్యంగా గుండెకు చాలా హానికరం.మీ గుండె ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఆరోగ్యానికి హాని చేసే ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. వ్యాయామం చేయడం వల్ల గుండె జబ్బులకు కారణమయ్యే అంతర్గత పరిస్థితులను చక్కదిద్దవచ్చు. మీ కుటుంబంలో ఎవరికైనా ఊబకాయం, గుండె జబ్బు సమస్యలు ఉన్నట్లయితే మీరు తప్పకుండా ముందస్తు స్క్రీనింగ్ చేయించుకోవాలి .


Tags:    

Similar News