యూపీకి మించిన సీన్ తమిళనాడులో.. పట్టుకోవటానికి వెళితే బాంబులేశాడు!

Update: 2020-08-19 05:30 GMT
ఆ మధ్యన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన యూపీ డాన్ ఉదంతం తెలిసిందే. అతడ్ని అదుపులోకి తీసుకెళ్లటానికి వెళితే.. పోలీసులపై కాల్పులు జరపటం.. ఈ ఉదంతంలో పెద్ద ఎత్తున పోలీసులు మరణించటం తెలిసిందే. అనంతరం అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తప్పించుకునే ప్రయత్నంగా చేయగా ఎన్ కౌంటర్ చేయటం గుర్తుండే ఉంటుంది. తనను అదుపులోకి తీసుకోవటానికి వచ్చిన పోలీసులపై కాల్పులు జరిపిన ఉదంతాన్ని మర్చిపోక ముందే.. తమిళనాడులో అంతకు మించినట్లుగా మరో ఉదంతం చోటు చేసుకుంది.

తమిళనాడుకు చెందిన దురైముత్తు అనే వ్యక్తి జంట హత్యల కేసులో నిందితుడు. తూత్తుకూడి జిల్లా మణకరైలో ఈ హత్యలు చోటు చేసుకున్నాయి. దీంతో.. నిందితుడ్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఐదుగురు సభ్యులతో కూడిన టీం ఒకటి అతడి కోసం గాలిస్తోంది. ఇదిలా ఉంటే.. నిందితుడు దురైముత్తును పోలీసులు గుర్తించారు.

అతడున్న ప్రాంతానికి సంబంధించిన సమాచారాన్ని పక్కాగా సేకరించిన పోలీసులు.. అతడ్ని అదుపులోకి తీసుకోవటానికి వెళ్లారు. పోలీసులు తనను పట్టుకునేందుకు వచ్చినట్లుగా గుర్తించిన దురైముత్తు..పోలీసులపై నాటుబాంబులతో దాడికి పాల్పడ్డాడు. అనుకోని రీతిలో చోటు చేసుకున్న ఈ పరిణామంలో సుబ్రమణ్యన్ అనే పోలీసులు మరణించారు. అంతేకాదు.. పోలీసులపై నాటుబాంబుల్ని ప్రయోగించిన..నిందితుదు దురైముత్తు కూడా మరణించటం గమనార్హం. ఏమైనా.. నిందితుల్ని పట్టుకునేందుకు వెళుతున్న పోలీసులపై దాడులకు తెగబడే ఉదంతాలు జరుగుతుండటం కాస్త ఆందోళన కలిగించే అంశంగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News