మీ ఇంటి నుంచి ఎవరు వస్తున్నారు హరికృష్ణ?

Update: 2016-05-28 06:24 GMT
సినిమాటిక్ డైలాగులకు కాలం చెల్లిందన్న విషయాన్ని కొందరు నేతలు ఇప్పటికి గుర్తించటం లేదు. తమ చుట్టూ జరుగుతున్న అంశాలపై కామ్ గా ఉంటూ.. ఉన్నట్లుండి ఒక్కసారిగా గొంతు సవరించుకొని గళం విప్పటం లాంటి పనుల్ని కొందరు నేతలు చేస్తుంటారు. తాజాగా దివంగత టీడీపీ అధినేత నందమూరి తారకరామారారావు పుత్రరత్నం.. చంద్రబాబు పెద్ద బావమరిది అయిన హరికృష్ణకు ఉన్నట్లుండి ఆగ్రహం వచ్చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా గురించి చెప్పిన వారంతా.. ఇప్పుడేం చేస్తున్నారంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రతిఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉందన్న హరికృష్ణ.. ఒక విలువైన మాటను చెప్పుకొచ్చారు. ఏపీ ప్రజలంతా కలిసి పోరాటం చేయాలని.. ప్రతి ఇంటి నుంచి ఒకరైనా బయటకు వచ్చి ఏపీకి ప్రత్యేక హోదా మీద సమరం చేయాలన్న పిలుపునిచ్చారు. తెలుగు వాడైన ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా కోసం శపధం చేయాలని కోరారు. అంతాబాగానే ఉంది కానీ.. గడిచిన రెండేళ్ల కాలంలో ప్రత్యేక హోదా గురించి పెద్దగా నోరు విప్పని హరికృష్ణకు ఉన్నట్లుండి ప్రత్యేక హోదా విషయం ఎందుకు గుర్తుకు వచ్చినట్లు అన్నది ఒక ప్రశ్న.

ఇదిలా ఉంటే.. ప్రత్యేక హోదా మీద పోరాటానికి ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒకరు చొప్పున అయినా రోడ్డు మీదకు రావాలని.. గళం విప్పాలని.. పోరాటం చేయాలని హరికృష్ణ చెబుతున్నారు. ఇంతకీ ఆయన ఫ్యామీలీ నుంచి ఎంతమంది బయటకు వస్తున్నారు? అలా బయటకు వచ్చేవారెవరూ? లాంటి ప్రశ్నలకు హరికృష్ణ సమాధానం చెబితే బాగుంటుందేమో..?
Tags:    

Similar News