లాటరీలో జాక్ పాట్ కొట్టాడు.. పోలీస్ స్టేషన్ కు పరుగులు తీశాడు

Update: 2023-03-18 09:57 GMT
అతడో కూలీ. లాటరీతో తన జీవితం మొత్తం మారిపోతుందన్న నమ్మకం. అందుకే.. తనకు వచ్చే కూలీ డబ్బులతో అప్పుడప్పుడు లాటరీలు కొంటుంటాడు. అయినా.. ఒక్కసారి కూడా అతడికి ఎలాంటి ప్రైజ్ వచ్చింది లేదు. అయినా నిరాశ చెందకుండా లాటరీ కొనే అతడికి.. తాజాగా జాక్ పాట్ తగిలింది. అతడు కొన్న లాటరీకి ఏకంగా రూ.75 లక్షల ప్రైజ్ మనీ వచ్చింది. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిన అతగాడు.. క్షణం ఆలోచించకుండా పోలీసు స్టేషన్ కు పరుగులు తీసిన వైనం ఆసక్తికరంగా మారింది. కేరళలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో ఇంతకూ అతగాడు పోలీస్ స్టేషన్ కు ఎందుకు పరుగులు తీశాడు? ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాల్సిందే.

పశ్చిమబెంగాల్ కు  చెందిన బాదేశ్ అనే వ్యక్తి ఉపాధి కోసం కేరళలోని ఏర్పాకులం వచ్చాడు. అక్కడ రోడ్డు విస్తరణ కార్యక్రమాలకు సంబంధించిన కూలీగా పని చేస్తున్నాడు. ఏళ్లకు ఏళ్లుగా కేరళలోనే పని చేస్తున్నాడు. తన పేదరికం పోవాలంటే లాటరీ తగలాల్సిందే అన్నది అతడి నమ్మకం. అందులో భాగంగా లాటరీ టికెట్లు కొనుగోలు చేసేవాడు. అయినా.. అతడికి ఎప్పుడూ లాటరీ తగిలింది లేదు. తాజాగా మాత్రం అతను కొన్న లాటరీకి జాక్ పాట్ గా రూ.75 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్న విషయాన్ని గుర్తించాడు.

 లాటరీ తగిలిందన్న ఆనందంతో ఉన్న అతగాడు.. ఆ వెంటనే పోలీసు స్టేషన్ వైపు పరుగులు తీసి.. పోలీసుల్ని ఆశ్రయించాడు. తనకు రూ.75 లక్షల లాటరీ తగిలిందని.. అయితే దాన్ని ఎలా మార్చుకోవాలో తనకు తెలీదని.. ప్రైజ్ మనీని  తీసుకున్న తర్వాత తన నుంచి ఎవరూ కొట్టేయకుండా భద్రత కల్పించాలని కోరాడు. అతడి పరిస్థితిని అర్థం చేసుకున్న మువట్టుపుఝూ పోలీసులు అతడి లాటరీని క్లెయిం చేసుకునేందుకు అవసరమైన పద్దతుల మీద అవగాహన కలిగించటంతో పాటు.. అతడికి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ప్రైజ్ మనీ కింద తనకు వచ్చే భారీ మొత్తంతో తన సొంతూరుకు వెళ్లిపోతానని.. తన ఇంటికి రిపేర్లు చేయించుకుంటానని వ్యవసాయం చేస్తానని చెబుతున్నాడు. తనకున్న వ్యవసాయ భూమిని మరింత విస్తరించుకొని పెద్ద ఎత్తున వ్యవసాయం చేయాలన్న ఆసక్తిని చెప్పుకొచ్చాడు.  అతడి ఆలోచనల గురించి తెలిసిన వారంతా అభినందిస్తున్నారు. అతడి తెలివిని మెచ్చుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News