గుడివాడ అను నేను...సూపర్ హిట్

Update: 2022-04-11 08:50 GMT
ఉత్తరాంధ్రా జిల్లాలలో కొత్తగా ఏర్పడిన అనకాపల్లి జిల్లా నుంచి మంత్రి అయిన గుడివాడ అమరనాధ్ యువకుడు. ఫైర్ బ్రాండ్. రాజకీయాల్లో దూకుడుకు పెట్టింది పేరు. గుక్క తిప్పుకోకుండా ప్రత్యర్ధి పార్టీలను మాటలతో చెడుగుడు ఆడించే చిచ్చరపిడుగు. గుడివాడ మొత్తానికి తన చిరకాల  డ్రీమ్ ని నెరవేర్చుకున్నారు. మినిస్టర్ అమరనాధ్ అయిపోయారు.

గుడివాడ అని నేను అంటూ ఆయన ప్రమాణం చేసే సీన్ చూడడానికి కళ్ళు కాయలు కాచేలా మూడేళ్ళుగా ఫ్యాన్స్తో పాటు అనుచరులు ఎదురుచూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది. గుడివాడ కుర్చీ ఎక్కేశారు. ఇక గుడివాడది రాజకీయ కుటుంబం. ఆయన మూడవ తరం వారసుడు. తాత గుడివాడ అప్పన్న 1979లో విశాఖ జిల్లాలో కొత్తగా ఏర్పాటు అయిన పెందుర్తి నియోజకవర్గం నుంచి తొలి ఎమ్మెల్యేగా గెలిచారు.  అలా గుడివాడ ఫ్యామిలీ ఇప్పటికి నాలుగు దశాబ్దాల క్రితం పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది.
 
ఆ తరువాత అమరనాధ్ తండ్రి గుడివాడ గురునాధరావు రాజకీయాల్లోకి వచ్చారు. 1989లో ఆయన ఫస్ట్ టైమ్ పెందుర్తి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. నాడు యువ ఎమ్మెల్యేగా గురునాధరావు విశాఖ జిల్లా రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. ఆయన 1992లో ఏర్పాటు అయిన నేదురుమల్లి జనార్ధనరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అలాగే అనకాపల్లి నుంచి ఎంపీగా పనిచేశారు.

ఇక గురునాధరావు మరణాంతరం కేవలం 21 ఏళ్ళకే రాజకీయాల్లోకి వచ్చిన అమరనాధ్ 2007లో జరిగిన జీవీఎంసీ ఎన్నికలలో  టీడీపీ తరఫున కార్పోరేటర్ గా గెలిచి నాడే అదుర్స్ అనిపించారు. ఇక 2011లో ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు. నాటి నుంచి వైసీపీలో ఒక్కో మెట్టుగా ఎదుగుతూ ఈ రోజు మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
Read more!

ఇక 2014 ఎన్నికల్లో ఆయన అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినా మంచి సంఖ్యలో ఓట్లు తెచ్చుకున్నారు. వైసీపీ తరఫున ఉమ్మడి విశాఖ నుంచి జిల్లా ప్రెసిడెంట్ గా సుదీర్ఘ కాలం పనిచేసి విపక్ష నేతగా నాటి టీడీపీ మీద పోరాడారు. గుడివాడను జగన్ మెచ్చారు.

అందుకే 2019 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి టికెట్ ఇచ్చారు. నాడు మాట ఇచ్చిన మేరకు మలి విడతలో ఏకంగా మంత్రిని చేశారు. తన తాత తండ్రి పేరు నిలబెడతానని, రాజకీయాల్లో తనదైన మార్క్ చూపిస్తాను అని అమరనాధ్ అంటున్నారు. అనకాపల్లి జిల్లాలో వైసీపీకి యువ బలంగా గుడివాడను ముందు పెట్టి కధ నడపడానికి వైసీపీ వ్యూహ రచన చేస్తోంది.
Tags:    

Similar News