విశాఖ ఉక్కు కోసం పెరుగుతున్న ఆందోళనలు.. భూమి అమ్మకాల దిశగా కేంద్రం

Update: 2021-03-05 13:30 GMT
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు నినాదాన్ని ఏపీ ప్రజలంతా ఎలుగెత్తి చాటుతున్నా.. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవటానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసే విషయంలో రాష్ట్ర అధికార.. విపక్షాలతో పాటు రాష్ట్ర ప్రజలంతా ఒకే మాట మీద ఉన్నా.. కేంద్రం మాత్రం అందుకు భిన్నంగా అమ్మకానికి సిద్ధంగా ఉన్నానన్న విషయాన్ని చెప్పేస్తూ ఉంది. తాజాగా పరిశ్రమకు చెందిన నగరం నడిబొడ్డున ఉన్న మద్దిలపాలెం.. అత్యంత ఖరీదైన ప్రాంతంగా చెప్పే సీతమ్మధారకు దగ్గరగా ఉన్న 22.19 ఎకరాల భూమిని అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

దశాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో ఉక్కు కర్మాగారం ఉద్యోగుల కోసం 830 క్వార్టర్లు నిర్మించారు. అవి పూర్తిగా శిథిలమయ్యాయి. 130 క్వార్టర్లకు రిపేర్లు చేసుకొని కొందరు ఉంటున్నారు. ఈ భూమిలో కమర్షియల్.. రెసిడెన్షియల్ ప్రాజెక్టుల్నితీసుకొచ్చి అమ్మాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో గజం లక్ష రూపాయిల వరకు పలుకుతోంది. ఈ లెక్కన చూస్తే.. ఈ భూమి విలువ ఏకంగా రూ.1540 కోట్లుగా అంచనా వేస్తున్నారు.

పరిశ్రమను ప్రైవేటుపరం చేయాలనుకుంటున్న వేళ.. ఈ భూముల్లో నిర్మాణాల్ని పూర్తి చేసి లాభదాయకంగా మార్చాలన్న ఆలోచన ఎవరికి మేలు చేయాలన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ఈ డీల్ వివరాల్ని ఉక్కు పరిశ్రమ అధికారులు రహస్యంగా ఉంచటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్ఐఎన్ఎల్ తో తాము చేసుకున్న ఒప్పందాన్ని ఎన్ బీసీసీ బయటపెట్టటంతో.. ఖరీదైన 22.19 ఎకరాల్ని వేరే సంస్థకు అప్పజెప్పబోతున్న విషయంపై స్పష్టత వచ్చింది. చూస్తుంటే.. ప్రజల ఆందోళనతో సంబంధం లేకుండా తాము చేయాలనుకునేలా చేయటమే ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్లు కనిపిస్తోంది.




Tags:    

Similar News