షాక్: అలా టార్చర్ పెడుతున్న మనమడ్ని చంపేసిన తాత

Update: 2020-09-07 06:50 GMT
వినేందుకు విచిత్రంగా ఉన్నప్పటికి ఇది నిజం. ఎక్కడైనా ముద్దుముద్దు కోరికలు కోరటం మనమడి హక్కుగా.. వాటిని తీర్చే బాధ్యతను మీదేసుకోవటం తాతా బాద్యతగా ఫీల్ కావటం చాలా చోట్ల చూస్తుంటాం. కానీ.. హద్దులు దాటితే.. ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో చెప్పే ఉదంతంగా దీన్ని చెప్పాలి. కరోనా నేపథ్యంలో హైదరాబాద్ వదిలేసి ఊరికి వచ్చిన మనమడి తీరుకు సదరు తాత విసిగిపోయాడు. అది.. ఎంతలా అంటే.. ‘సంగతి’ తేల్చేయాలన్నంతగా. దాని ఫలితమే మనమడ్ని దారుణంగా చంపేసిన తాత ఉదంతం తాజాగా ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.

ప్రకాశం జిల్లా బేస్తవారపేట మండలంలోని ఖాజీపురంలో మనమడ్ని తాత చంపేసిన వైనం సంచలనంగా మారింది. విన్నవారంతా ఉలిక్కిపడుతున్నారు. అయితే.. వ్యవహారం తెలిసిన వారు మాత్రం తాత పడుతున్న టార్చర్ ఎవరు పడినా.. అలానే చేస్తారేమో? అన్న వ్యాఖ్యలు వినిపించటం గమనార్హం. హైదరాబాద్ లోని ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు 21 ఏళ్ల రాఘవేంద్రరెడ్డి.

కరోనా నేపథ్యంలో చేస్తున్న ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి ఊరికి వచ్చేశాడు. తాగుడు అలవాటున్న అతగాడు.. గడిచిన కొన్ని నెలలుగా దానికి మరింత బానిసయ్యాడు. నిత్యం పూటుగా తాగటం.. ఇబ్బందికి గురి చేయటమే కాదు.. గొంతెమ్మ కోరికలు కోరుతూ చిరాకు పెట్టించేస్తున్నాడు. తనకు అర్జెంట్ గా కారు కావాలని తల్లిదండ్రుల్ని వేధిస్తున్నాడు. వారెంత చెప్పినా వినకుండా.. తాను పట్టిన పట్టును నెరవేర్చేందుకు తన కొడుకును.. కోడల్ని పెడుతున్న టార్చర్ కు రగిలిపోయాడు తాత.

అంతే.. నిద్రపోతున్న రాఘవేంద్రరెడ్డి తలపై రోకలిబండను బలంగా మోదాడు తాత పెద్దఓసూరురారెడ్డి. దీంతో అక్కడికక్కేడే మరణించాడు మనమడు. రోకలి బండతో చంపేసిన తాత ఉదంతం స్థానికంగా షాకింగ్ గా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. తాతను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags:    

Similar News