ఆన్ లైన్ లోన్ కు ప్రభుత్వ అధికారిణి బలి

Update: 2020-12-17 07:35 GMT
ఇప్పుడు ఫోన్ తెరిస్తే చాలు ఆన్ లైన్ లోన్ ఇస్తామంటూ పెద్ద ఎత్తున వివిధ కంపెనీలు, యాప్స్ వినియోగదారులను ఆకర్షిస్తుంటాయి. ఈజీగా మనీ దొరుకుతుందని అందరూ ఓకే కొడితే అవి వచ్చి అకౌంట్లో పడుతాయి. అవి తీసుకుంటే మీరు చిక్కుల్లో పడ్డట్టే.. ఎందుకంటే ఆ సొమ్ముపై భారీ వడ్డీ రేటు ఉంటుంది. అది చూస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది. చెల్లింపులు లేట్ చేస్తే డబుల్ త్రిబుల్ ఫైన్ వేస్తారు. మానసికంగా హింసిస్తారు. ఇలాంటివి చాలా మంది ఫేస్ చేసి ఉంటారు. స్నేహితుల నంబర్లు తీసుకొని డబ్బు తీసుకున్న వారి పరువును ఆన్ లైన్ లో తీసేస్తారు. ఈ ఒతిళ్లకు చాలామంది యువత ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది.

తాజాగా ఆన్ లైన్ అప్పులకు మరో యువతి బలైంది. ఆమె ఒక ప్రభుత్వ అధికారిణి కావడం గమనార్హం. డెడ్ లైన్ లోగా డబ్బు చెల్లించలేదన్న కారణంగా అప్పు ఇచ్చిన సంస్థ లోన్ తీసుకున్న యువతి పరువు తీసింది. దీంతో ఆ ప్రభుత్వ అధికారి ఆత్మహత్య చేసుకోవడం కలిచివేస్తోంది.

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాలపేటకు చెందిన కిర్ని భూపాణి కుమార్తె కుమార్తె మౌనిక (24) ఏఈవోగా రెండేళ్ల నుంచి పనిచేస్తున్నారు. వీరు కొన్నాళ్లుగా సిద్ధిపేటలో నివాసం ఉంటున్నారు. తండ్రి వ్యాపార ప్రయత్నాల్లో నష్టాలు రావడంతో కుటుంబ అవసరాల కోసం మౌనిక ‘స్నాప్ఇట్ లోన్’ అనే యాప్ నుంచి రెండు నెలల క్రితం రూ.3 లక్షల లోన్ తీసుకున్నారు. డెడ్ లైన్ లోగా తిరిగి చెల్లించలేకపోయారు. దీంతో యాప్ నిర్వాహకులు లోన్ డిఫాల్టర్ అంటూ ఆమె ఫోన్ లోని కాంటాక్టు నంబర్లన్నింటికి వాట్సాప్ మెసేజ్ లు పంపారు.

దీనికి తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక ఈనెల 14న ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.  చికిత్స పొందుతూ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో బుధవారం తెల్లవారుజామున మృతిచెందింది. ఆమె సోదరుడు భరత్ కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మొత్తానికి ఇలా ఆన్ లైన్ అప్పులకు ఓ యువ ప్రభుత్వ అధికారిణి బలి అయిపోవడం యువతకు హెచ్చరికగా మారింది.
Tags:    

Similar News