రెండేళ్ళు ఆగండి జగన్ వస్తాడు !

రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీలలో ఇళ్ళు పొందిన ప్రతీ లబ్దిదారుడూ భయపడాల్సిన పనే లేదని పేర్ని నాని అన్నారు.;

Update: 2026-04-28 17:31 GMT

వచ్చేది మళ్ళీ తామేనని వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. కళ్ళు మూసుకుంటే కాలం ఇట్టే గడిచిపోతుంది అని వైసీపీ అధినేత జగన్ పదే పదే అంటూంటారు. ఆ పార్టీ నాయకులు అదే మాట అంటున్నారు. రెండేళ్ళు ఆగితే మేమే మళ్లీ అధికారంలోకి వస్తామని మాజీ మంత్రి పేర్ని నాని గట్టిగా చెబుతున్నారు. బందర్ గడ్డ మీద నుంచే ఆయన ఈ విధంగా బిగ్ సౌండ్ చేస్తున్నారు. బందర్ లో వైసీపీకి నానికి రాజకీయ ప్రత్యర్ధిగా టీడీపీ మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు. ఆయనను ఉద్దేశించి పేర్ని నాని ఘాటుగా విమర్శలు చేశారు. అంతే కాదు జగన్ ప్రభుత్వమే వచ్చేది ఎవరూ ఏమీ చేయలేరంటూ హాట్ కామెంట్స్ చేశారు.

జగన్ లాక్ చేసి పడేశారు :

జగన్ తన ప్రభుత్వం హయాంలో 31 లక్షల ఇళ్ళ పట్టాలను ఇచ్చారని అంతే కాదు వాటికి రిజిస్ట్రేషన్లు కూడా చేయించి గట్టిగా లాక్ చేశారు అని పేర్ని నాని చెప్పారు. అందువల్ల జగన్ ఇచ్చిన ఇళ్ళ పట్టాలను ఎవరూ రద్దు చేయలేరని నాని ధీమాగా చెప్పారు. చంద్రబాబు లాంటి పాలకులు వస్తారనే జగన్ పేదల ఇళ్ళ పట్టాలను చాలా భద్రంగా చేసి మరీ వారి చేతిలో పెట్టారని నాని చెప్పుకొచ్చారు. ఇపుడు ఆ ఇళ్ల పట్టాల విషయంలో టీడీపీ నేతలు పేదలను భయపెడుతున్నారని నాని మండిపడ్డారు. అయితే జగనన్న కాలనీలో టీడీపీ వారు వచ్చి పేదల నుంచి ఇళ్ల స్థలాలను లాక్కోవడానికి చూస్తున్నారు అని నాని విమర్శించారు.

క్యాన్సిల్ ఎలా చేస్తారంటూ :

పేదలకు ఇచ్చిన ఇళ్ళ పట్టాలను ఎలా క్యాన్సిల్ చేస్తారు అని నాని ప్రశ్నించారు. అవి మీరు ఇచ్చిన ఇళ్ళ పట్టాల లేక మీ సొంత ఆస్తులా అని నిలదీశారు. ఇలా ఎవరైనా చేస్తారనే ముందు చూపుతో జగన్ పేదల ఇళ్ళ పట్టాలకు జగన్ తాళాలు వేసి పెట్టారని అన్నారు. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు వచ్చి మాట్లాడినా వారి మాటలను లెక్క చేయవద్దు అని పేర్ని నాని ఇళ్ళ పట్టాల లబ్దిదారులకు సూచించారు.

ప్రతీ పేదకీ న్యాయం :

రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీలలో ఇళ్ళు పొందిన ప్రతీ లబ్దిదారుడూ భయపడాల్సిన పనే లేదని పేర్ని నాని అన్నారు. మీ ఇంటి పట్టాతో సహా జియో ట్యాగింగ్ చేసి మరీ రిజిస్ట్రేషన్ చేసి పట్టా ఇచ్చారని పేర్ని నాని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎవరు తలచుకున్నా ఏమీ చేయలేదని అన్నారు. కోర్టులు చట్టాలు ఉన్నాయని రిజిస్ట్రేషన్ అయిన పట్టాలను క్యాన్సిల్ చేసే అధికారం ఎవరికీ లేదని పేర్ని నాని అన్నారు. మీ పట్టాలను అమ్ముకోవద్దు, మీ దగ్గరే అట్టే పెట్టుకుంటే జగన్ అధికారంలోకి వస్తారు, రేటు పెంచి మరీ ఇళ్ళ పట్టాలకు రుణాలు ఇస్తారని సొంత ఇళ్ళు కట్టుకోండి అని అన్నారు. జగన్ వచ్చి పేదవాడి సొంతింటి కలను నెరవేరుస్తారు అని పేర్ని నాని చెప్పారు. మొత్తానికి ఒక సెంటిమెంట్ ఇష్యూతో మీడియా ముందుకు వచ్చిన పేర్ని నాని కూటమి నేతల మీద హాట్ కామెంట్స్ చేశారు. అదే సమయంలో జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారంటూ వైసీపీని ఉత్సాహపరచేలా మాట్లాడారని అంటున్నారు.

Tags:    

Similar News