గడప గడపకూ వెళ్లిన ఆ వైసీపీ ఎమ్మెల్యేకు గో బ్యాక్ నినాదాలు

Update: 2023-01-23 12:45 GMT
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం కారణంగా ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో చూస్తున్నదే. మంత్రులు మొదలు ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీల కిందా మీదా పడుతున్న పరిస్థితి. ప్రశ్నించే ప్రజలకు సమాధానాలు చెప్పలేక.. ఆ కారణంగా వచ్చే వ్యతిరేకతను తగ్గించుకునేందుకు పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. ఇంత చేసిన తర్వాత కూడా కార్యక్రమం రసాభాసాగా మారితే.. అధినేత చేత అక్షింతలు వేయించుకోవాల్సి రావటంతో వైసీపీ ప్రజాప్రతినిధులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు.

నిజానికి ఏ ముహుర్తంలో గడప గడపకూ మన ప్రభుత్వం ప్రోగ్రాంను సీఎంజగన్ డిసైడ్ చేశారో కానీ అప్పటి నుంచి ఏదో ఒక ఇబ్బందిని ఎదుర్కొంటూనే ఉన్నారు. సాధారణంగా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలతో మైలేజీ వస్తుంది.

గడప గడపకూ కార్యక్రమం అందుకు భిన్నం. ఈ ప్రోగ్రాం షురూ చేసినప్పటి నుంచి ఎదురైన ఇబ్బందులతో వైసీపీ నేతలకు తల బొప్పి కడుతున్న పరిస్థితి. అందుకు కొనసాగింపుగా తాజాగా అమరావతిలో వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది.

పెదకూరపాడు వైసీపీ ఎమ్మెల్యే నంబరూరు శంకరరావు చేపట్టిన గడప గడపకూ మన ప్రభుత్వ కార్యక్రమానికి విచిత్రమైన వ్యతిరేకత ఎదురైంది. అమరావతి ముస్లిం కాలనీలోకి వెళ్లిన ఎమ్మెల్యేకు .. చాలా ఇళ్లకు ''ఎమ్మెల్యే గో బ్యాక్'' అంటూ కరపత్రాల్ని ఇంటికి అంటించి ఉండటంతో ఆయన హతాశయులయ్యారు.

ఆ వెంటనే.. ఎమ్మెల్యే సూచనతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇళ్లకు అలాంటి కరపత్రాలు పెట్టటం సరికాదంటూ.. వాటిని తొలగించారు. ఇలాంటివి చేపడితే చర్యలు తీసుకుంటామని తేల్చేసిన పోలీసులు.. ఎమ్మెల్యే నంబూరుకు మరింత మంది పోలీసులతో భద్రతను పెంచారు.

ఇంతకూ ఇళ్లకు అంటించిన కరపత్రాల్లో.. ''మా కాలనీకి ఎందుకు వస్తున్నారు? ఎన్నికల ముందు ఇచ్చిన షాదీఖానా నిర్మించలేదు ఎందుకు? షాదీ తోఫా ఇవ్వనందుకు వస్తున్నారా? రోడ్లు వేయనందుకు వస్తున్నారా? కాలనీలో తట్ట కంకర పోయినందుకే వస్తున్నా? ఖబరస్థాన్ ను అడవి పాలు చేసినందుకు వస్తున్నారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఏర్పాటు చేసిన కరపత్రాలుచాలా ఇళ్లకు దర్శనమిచ్చాయి.

దీంతో.. ఈ కాలనీలో పోలీసులతో పెద్ద ఎత్తున కవాతును నిర్వహించి.. సదరు కరపత్రాల్ని తొలగించి.. భారీ బధ్రతా బలగాల్ని మొహరించిన కార్యక్రమాన్ని పూర్తి చేసి హమ్మయ్య అని బయటపడ్డారు. అనంతరం ఇళ్లకు పెట్టిన కరపత్రాలు అన్ని కూడా టీడీపీకి చెందిన వారు పెట్టారంటూ మండిపడ్డారు.నిజంగానే ఎమ్మెల్యే మీద అభిమానం ఉంటే.. టీడీపీ నేతలు కానీ కార్యకర్తలుకానీ ఇంటి గోడల మీద ఈ తరహా కరపత్రాల్ని అంటించే ధైర్యం చేస్తారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News