జగన్ పార్టీ ఆఫీస్ కు ఆయన భూమి ఇచ్చారా?

Update: 2017-02-21 17:05 GMT
ఏపీ రాజధాని అమరావతి సమీపంలో ఏపీ విపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని నిర్మిస్తున్నారా? అంటే అవునని చెబుతున్నారు. పెద్ద హడావుడి లేకుండా.. సైలెంట్ గా నిర్మాణం సాగుతున్నట్లుగా తెలుస్తోంది.  రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాల్లోని పార్టీ కార్యాలయాన్ని హైదరాబాద్ లోటస్ పాండ్ కేంద్రంగా సాగిస్తున్నారు. అయితే.. ఏపీ సర్కారు మొత్తం అమరావతికి వెళ్లిపోవటం.. బడ్జెట్ సమావేశాల్ని సైతం అమరావతిలోనే నిర్వహించనున్న నేపథ్యంలో.. పార్టీ కార్యాలయాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లుగా చెబుతున్నారు.

ఇందులో భాగంగా.. గత వారం గుట్టుచప్పుడు కాకుండా.. శంకుస్థాపన రాయి వేసినట్లుగా చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. జగన్ నిర్మిస్తున్న పార్టీ ప్రధాన కార్యాలయానికి.. సీనియర్ కాంగ్రెస్ నేత.. ప్రస్తుతం జగన్ పార్టీలో ఉన్న ఘట్టమనేని ఆదిశేషగిరి రావుకు చెందిన వ్యవసాయభూమిగా చెబుతున్నారు. తనకు చెందిన నాలుగు ఎకరాల స్థలంలో రెండుఎకరాల్నిపార్టీ ఆఫీసు కోసం ఆదిశేషగిరిరావు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

రెండు ఎకరాల్లో నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాన్ని భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా విస్తరించేందుకు వీలు కాదని.. అందుకే నాలుగు ఎకరాల్లో పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా.. దివంగత నేత వైఎస్ కు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించి ఆదిశేషగిరి రావు తాజాగా జగన్ పార్టీలో కొనసాగుతున్నారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ గా పార్టీ టికెట్ ఇస్తానన్న హామీని జగన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆదిశేషగిరి రావు సొంత సోదరుడైన సూపర్ స్టార్ కృష్ణ సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ లో కొనసాగటమే కాదు.. వ్యక్తిగతంగా దివంగత నేత వైఎస్ కు అత్యంత సన్నిహితుడిగా చెబుతున్నారు. 2019లో జగన్ కానీ ఆదిశేషగిరి రావు కుఎంపీ టికెట్ ఇస్తే.. మహేశ్ బాబు ఆయన తరఫున ప్రచారం చేస్తారా? అన్నది ప్రశ్న.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News