జగన్ కు చేరువ అవుతున్న గంటా శ్రీనివాస్

Update: 2021-02-07 08:45 GMT
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి  కేంద్రంలోని బీజేపీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీలో ఉద్యమం సాగుతోంది. దీనికి నిరసనగా ఏపీ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఏకంగా రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైంది. ఒక్కసారిగా రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించింది. రాజకీయాల్లో తాజా చర్చకు ఆయన కేంద్రబిందువయ్యారు.

మొన్నటిదాకా అసలు రాజకీయాల్లో సైలెంట్ గా ఉన్న గంటా శ్రీనివాసరావు ఇప్పుడు ఒక్క రాజీనామాతో ఏపీ రాజకీయాలకు కేంద్రబిందువు అయ్యారు. ఈ ఒక్క చర్యతో ఆయన అందరిచూపును తనవైపుకు తిప్పుకున్నాడు.

తాజాగా ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై ఏపీ సీఎం జగన్ స్పందించాడు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకుండా ఉండడానికి దాన్ని లాభాల్లోకి తీసుకురావడానికి అవసరమైన సలహాలు, సూచనలతో ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు.

 టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు తాజాగా సీఎం జగన్ రాసిన లేఖను స్వాగతించారు. జగన్ లేఖ రాయడాన్ని ఆహ్వానిస్తున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. జగన్ చేసిన సూచనలు విలువైనవిగా పేర్కొన్నారు. పరిష్కార మార్గాలను చూపించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీఎం జగన్ స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలవాలని  మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సూచించారు. తెలుగు ప్రజల మనోభావాలను వివరించాలని అన్నారు. ప్రధానిని ఒప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. అవసరమైతే అఖిలపక్షాన్ని కూడా తీసుకెళ్లి ఒత్తిడి తేవాలని కోరుతున్నట్లు తెలిపారు.
Tags:    

Similar News