గంటా.. పవన్ కు పెట్టావా మంట?

Update: 2021-02-22 13:30 GMT
తన మానాన తను పార్ట్ టైం పాలిటిక్స్ చేసుకుంటూ మధ్యలో సినిమాలు చేసుకుంటున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ను అనవసరంగా విశాఖ ఉక్కు ఉద్యమంలో ఇరికిస్తున్నారట టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు. తాజాగా గంటా చేసిన వ్యాఖ్యలు పవన్ ను ఇబ్బందులకు గురిచేశాయంటున్నారు.

కేంద్రం తీసుకున్న ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా పవన్ బరిలోకి దిగాలని గంటా శ్రీనివాసరావు చేసిన ప్రకటన కాక రేపుతోంది. బీజేపీని వదిలిపెట్టేసి పవన్ విడిగా ఆందోళనల్లోకి దిగాలని  గంటా గట్టిగా సూచించారు. పవన్ ను మాత్రమే గంటా బరిలోకి లాగటం లేదు. మొత్తం సినీ పరిశ్రమంతా స్పందించాలని కోరి గంటా తీవ్రంగా ఇబ్బంది పెట్టారు.

విశాఖ ఉక్కు ఉద్యమంలో భాగంగా అందరికంటే ముందు రాజీనామా అస్త్రాన్ని సంధించి అధికార, ప్రతిపక్షాలను.. ముఖ్యంగా బీజేపీ-జనసేనను గంటా ఇరుకునపెట్టారు. పవన్ కళ్యాణ్ ను సినీ పరిశ్రమను ఆందోళనల్లోకి లాగేందుకు ప్రయత్నించారు.

గంటా రాజీనామా చేయడంతో మిగతా నేతలపై ఒత్తిడి పెరుగుతోంది. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ వెళ్లిన పవన్ రిక్త హస్తాలతో హైదరాబాద్ వచ్చేశారు. ఆ తర్వాత కనీసం విశాఖ ఉక్కు పరిశ్రమపై మాట్లాడడం లేదు. ఇప్పుడు గంటా చేసిన వ్యాఖ్యలు పవన్ ను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
Tags:    

Similar News