బెంగాల్ లో అంతే.. ‘సర్’ లెక్కలకు వెళితే దారుణ అనుభవం
అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకున్న ఒక దారుణంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయ్యింది.;
అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకున్న ఒక దారుణంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయ్యింది. ‘సర్’ లెక్కల పరిశీలనకు వచ్చిన న్యాయాధికారులపై దాడి జరగటాన్ని సుప్రీం తీవ్రంగా పరిగణిస్తోంది. ఏడుగురు జ్యూడిషియల్ అధికారులను దారుణంగా ఘోరవ్ చేసినా అడ్డుకోవటంలో బెంగాల్ అధికార యంత్రాంగం ఘోరంగా వైఫల్యం చెందటంపై మండిపడింది. ఈ ఉదంతంపై సీబీఐతో కానీ ఎన్ఐఏతో కానీ విచారణ జరపాలని పేర్కొంది.
ఎన్నికలు జరుగుతున్న పశ్చిమబెంగాల్ లో కేంద్ర బలగాల్ని మరింతగా మొహరించాలని ఈసీకి సూచన చేసింది. సుప్రీంకోర్టు అథారిటీని సవాలు చేయటమే కాకుండా.. న్యాయాధికారులపై దాడి చేసిన వైనాన్ని సీరియస్ గా తీసుకుంది. సుప్రీం సూచన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఉదంతాన్ని ఎన్ఐఎన్ కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంతకూ అసలేం జరిగింది? అన్న వివరాలు చూస్తే.. ఇలా కూడా జరుగుతుందా అన్న సందేహం కలుగకమానదు. అదేసమయంలో ఏమైనా సరే.. బెంగాల్ లో ఇలాంటివి జరగటానికి నూటికి నూరుపాళ్లు ఆక్షేపణీయంగా చెప్పక తప్పదు.
‘సర్’ లెక్కల్లో భాగంగా ఏడుగురు జ్యుడీషియల్ అధికారులు మాల్దా జిల్లాలోని కాలియా చౌక్ ప్రాంతంలో బ్లాక్ డెవలప్ మెంట్ ఆఫీసులో పరిశీలన చేస్తున్నారు. ఇక్కడకు కొన్ని సంఘ వ్యతిరేకత శక్తులు వచ్చి ఘోరవ్ చేశాయి. ఇందులో ముగ్గురు మహిళా అధికారులు ఉన్నారు. వారితో వచ్చిన ఐదేళ్ల బాలుడు కూడా చిక్కుకుపోయాడు. వీరిని గంట కాదు రెండు గంటలు కాదు ఏకంగా తొమ్మిది గంటల పాటు అల్లరిమూక నిర్బంధించింది. ఈ తొమ్మిది గంటల పాటు తాగునీరు మాత్రమే కాదు ఆహారం లేకుండా ఉంచేవారు.
చివరకు పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. అల్లరిమూకపై లాఠీఛార్జి చేసి చెదరగొట్టి.. న్యాయాధికారుల్ని అల్లరిమూక నుంచి విడిపించారు. ఈ ఘటన జరిగినంతనే రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేసినా.. పట్టించుకోకపోవటం గమనార్హం. ఈ జరిగిన ఉదంతంపై కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూరతి సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. దీంతో సుమోటోగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేత్రత్వంలోని ధర్మాసనం పశ్చిమ బెంగాల్ అధికార యంత్రాంగాన్ని తీవ్రంగా అభిశంసించింది.
న్యాయాధికారుల్ని మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఘోరవ్ ప్రారంభమైనా.. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అప్పటి నుంచి రాత్రి 8.30 గంటల వరకు పలుమార్లుకంప్లైంట్ చేస్తూ వస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం గమనార్హం. దీంతో అప్పటికప్పుడు హోంశాఖ కార్యదర్శి.. డీజీపీలను రిజిస్ట్రార్ జనరల్ సంప్రదించి సమాచారం అందించటంతో వారు చర్యలు తీసుకుంటామని చెప్పారే కానీ.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం విశేషం.
దీంతో.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్వయంగా జోక్యం చేసుకొని హోంశాఖ కార్యదర్శి, డీజీపీలతో గ్రూప్ కాల్ మాట్లాడారు.ఆ తర్వాత వారిద్దరూ న్యాయమూర్తి ఇంటికి వచ్చారు. చివరకు అర్థరాత్రి తర్వాత న్యాయాధికారులు విడుదలయ్యారు. ఆ తర్వాత కూడా వారుప్రయాణిస్తున్న వాహనాలపై రాళ్లు.. కర్రలు.. ఇటుకలతో దాడి జరగటం గమనార్హం.
ఇంత జరుగుతున్నా.. రాత్రి పదకొండు వరకు జిల్లా కలెక్టర్ అక్కడకు వెళ్లకపోవటం చూస్తే.. పశ్చిమబెంగాల్ లో ఆటవిక రాజ్యం నడుస్తుందా? అన్న భావన కలుగక మానదు. మూకదాడిని సీరియస్ గా తీసుకున్న సుప్రీం.. తీవ్ర ఆగ్రహాంతో ఉంది. అదే సమయంలో బెంగాల్ వ్యవస్థలు ఎలా నిర్వీర్యమైపోయాయి? అన్న దానికి నిదర్శనంగా ఒక ఉదంతాన్ని ప్రస్తావిస్తున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేఖను పరిశీలించేందుకు కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అందుబాటులోకి రాకపోవటం చూస్తే.. బెంగాల్ లో ఎలాంటి రాజ్యం నడుస్తుందన్న సందేహం కలుగకమానదు.
ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందన చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. న్యాయాధికారులపై జరిగిన దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కుట్ర చేసినట్లుగా ఆరోపించిన మమత.. తన అధికారాలన్నీ లాగేసుకున్నారని.. బెంగాల్ ను అప్రతిష్ట పాల్జేశారన్న ఆమె.. ‘‘అధికారుల్లో ఏ ఏ ఒక్కరూ మాల్దా ఘటన గురించి నాకు చెప్పలేదు’ అంటూ మమత చేసిన వ్యాఖ్యలు వింటే నోటి వెంట మాట రాదంతే. ఒకవేళ.. సీఎం మమత చెప్పిందే నిజమని భావిద్దాం. అధికారులు చెప్పలేదు సరే..మరి స్థానిక నేతలు? పార్టీ క్యాడర్? మాటేమిటి? ఇలాంటి అసాధారణ ఘటనలు సీఎంకు తెలియకుండా ఉండటమా? అన్న సందేహం కలుగకమానదు. ఏమైనా.. తొమ్మిది గంటల పాటు న్యాయాధికారుల్ని బంధించిన వైనం స్వతంత్ర్య భారతంలో ఒక మాయని మచ్చలా మిగిలుతుందని మాత్రం చెప్పక తప్పదు.