జగన్ కి చోటిస్తున్న బాబు...వ్యూహం కరెక్టేనా ?
రాజకీయాల్లో ఢక్కామెక్కీలు తిన్న వారు చంద్రబాబు. ఆయనకు వ్యూహాల గురించి ఎవరూ చెప్పాల్సిన పని లేదు.
రాజకీయాల్లో ఢక్కామెక్కీలు తిన్న వారు చంద్రబాబు. ఆయనకు వ్యూహాల గురించి ఎవరూ చెప్పాల్సిన పని లేదు. ఎన్నో యుద్ధాలను చూసిన వారు, అందులో ఆరితేరిన వారు. ఇక ఆయన వ్యూహాలలో అధిక శాతం సక్సెస్ నే చూశాయి. ఆయన తన రాజకీయ జీవితంలో ఎంతో మంది రాజకీయ ప్రత్యర్ధులతో పోరాడారు. అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో బాబు రాజకీయ పోరాటం మాత్రం సుదీర్ఘమైనది అని చెప్పాలి. కాంగ్రెస్ తో టీడీపీకి రాజకీయ సమరం ఉన్నపుడు అటు వైపు నాయకులు తరచూ మారుతూ ఉండేవారు. ఇక వైఎస్సార్ మాత్రమే ఎక్కువ కాలం బాబుతో నిలిచి పోరాడారు. అలాగే రెండు సార్లు సీఎం అయ్యారు. ఆయన తరువాత బాబు అంత సుదీర్ఘమైన పోరాటం మళ్ళీ జగన్ తోనే చేస్తూ వస్తున్నారు.
గతానికి భిన్నంగా :
ఇదిలా ఉంటే 2014 నుంచి చంద్రబాబుకి జగన్ కి మధ్య ఏపీ వేదికగా రాజకీయంగా భీకర సమరం సాగుతోంది. ఇది రాజకీయ ప్రత్యర్ధులను మించి అని కూడా చెప్పుకోవాలి. సాధారణంగా రాజకీయ నేతలు ప్రత్యర్ధులుగానే ఉంటారు. ఎక్కడైనా కనిపిస్తే చాలు మాట్లాడుకుంటారు. కానీ ఏపీ మాత్రం దానికి భిన్నం అని చెప్పాల్సి. చంద్రబాబు జగన్ ఇద్దరూ ఒకరికి ఒకరు ఎదురుపడరు. అసెంబ్లీలో మాత్రమే అది సాధ్యపడేది. కానీ 2024 తరువాత జగన్ అసెంబ్లీకి వెళ్ళడం లేదు. దాంతో అది కూడా లేకుండా పోయింది. దాంతో రాజకీయ పోరు ఇంకా ఎక్కువ అయిపోతోంది. కలిసి కూర్చుని అధికార విపక్షాలు ప్రజా సమస్యల మీద చర్చించుకుంటే వ్యక్తిగత ఫోకస్ తగ్గి జనరల్ ఇష్యూస్ కీలకం అవుతాయి. కానీ అది ఎక్కడా కనిపించడం లేదు.
అప్పటి కంటే ఎక్కువగా :
ఇక 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు సీఎం గా ఉన్నారు. జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆనాడు రెండు పార్టీల మధ్య రాజకీయ పోరు ఉంది కానీ మరీ ఇంతలా లేదని చెప్పవచ్చు. పైగా ఆనాడు జగన్ 67 మంది ఎమ్మెల్యేల బలంతో ఉన్నారు. తరచూ అసెంబ్లీకి వచ్చేవారు, ప్రజలలో కూడా తిరిగేవారు. కానీ ఆనాడు బాబు అవసరమైన సందర్భాలలో తప్పించి జగన్ మీద పెద్దగా విమర్శలు చేసినది లేదు. కానీ 2024లో చూస్తే వైసీపీ తన మొత్తం రాజకీయ జీవితంలో ఘోరమైన ఓటమిని అందుకుంది. కేవలం 11 సీట్లకే పరిమితం అయింది. ఇక జగన్ కూడా అసెంబ్లీకి రావడం లేదు, ప్రజలలో కూడా పెద్దగా తిరగడం లేదు. ఒక విధంగా ఏపీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాజకీయ తెర మీద పెద్దగా కనిపించడం లేదు అన్నది తెలిసిందే. అయితే జగన్ లేడన్న బాధ లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి మంత్రులు మిత్ర పక్ష నేతలు అంతా ఆయన మీద ప్రతీ రోజూ విమర్శలు చేస్తూ ఆయనను పొలిటికల్ గా లైం లైట్ లో ఉంచుతున్నారు అన్నది ఒక విశ్లేషణ.
ఇంతలా ఎందుకు మరి :
జగన్ ఏపీలో ఉండేది బహు తక్కువ అన్నది విమర్శలు ఉన్నాయి. ఆయన సభలలో ప్రసంగించినది కూడా లేదు, జనంతో తిరిగినది లేదు, కానీ చంద్రబాబు మాత్రం సభలో అయినా ప్రెస్ మీట్ లో అయినా పార్టీ వేదికల మీద అయినా జగన్ గురించే ఎక్కువగా మాట్లాడుతూండడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు. నిజానికి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు తమ ప్రసంగాలలో ప్రత్యర్ధులకు ఎక్కువగా చోటు కల్పించరు, అదొక రకం స్ట్రాటజీ. కానీ చంద్రబాబు మాత్రం సభ ఎక్కడ జరిగినా జగన్ గురించే తన ప్రసంగంలో సగానికి సగం కేటాయిస్తూండడం విశేషమే. అయితే ఇక్కడే బాబు వ్యూహం కూడా ఉంది. గొడ్డలి పార్టీ అని దాని నాయకుడు అని జగన్ గురించి అంటున్నారు తప్పించి ప్రత్యేకంగా పేరు పెట్టి మాట్లాడటం లేదు. అయితే ఆయన పరోక్షంగా విమర్శించినా జగన్ గురించే అన్నది జనాలకు అందరికీ తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇది సోషల్ మీడియా యుగం కాబట్టి.
జనాలలో ఆ భావన కోసమే :
గొడ్డలి పార్టీ విద్వంసకర నాయకుడు అని జగన్ గురించి జనంలో ఒక వ్యతిరేక భావన వ్యాప్తి చేయాలన్నదే బాబు మార్క్ పాలిట్రిక్స్ గా చెబుతున్నారు. ఆ పార్టీని ఆ నాయకుడిని మరోసారి ఎన్నుకోవద్దు అని ఆయన చెప్పాలనే ఉద్దేశ్యంతోనే ఈ విధంగా ఘాటుగా విమర్శిస్తున్నారు అని అంటున్నారు. అయితే రాజకీయాల్లో విమర్శల గురించి జనాలు సీరియస్ గా తీసుకోవడం పోయి రెండు దశాబ్దాలు దాటుతోంది అన్నది ఉంది. ఎందుకంటే ప్రజలు ఇపుడు స్మార్ట్ గా ఉన్నారు. వారు తమ గురించి తమ ప్రాంతం గురించి తమ అనుకూల పరిస్థితుల గురించి ఆలోచించుకునే పార్టీల వైపు మొగ్గు చూపుతూంటారు. ఒక ఏపీలో చూస్తే చిత్రమైన తీర్పులు జనాలు ఇస్తూంటారు. ఒకరికే రెండు సార్లు అధికారం ఇస్తే తమను పట్టించుకోరన్న భయమో సందేహమో తెలియదు కానీ తడవకు ఒకరిని మార్చి అధికారం అప్పచెప్పడం ద్వారా తమ తీర్పు పట్ల ఎల్లపుడు పాలకులు అప్రమత్తంగా ఉండాలనేది ఏపీ జనాల ఆలోచనగా చెబుతారు. అందువల్ల రాజకీయ విమర్శలు ఎక్కువగా చేస్తే అది మరో విధంగా పరిణమించే ప్రమాదం కూడా ఉంది అని అంటున్నారు. బలమైన నాయకుడు ప్రత్యర్థిగా ఉన్నారు కాబట్టే ఇలా చేస్తున్నారు అని కూడా జనంలోకి తెలియకుండా ఒక భావన పంపించేవారు కూడా అవుతారు అంటున్నారు. ఏది ఏమైనా బాబు ఈసారి అంటే 2024 తరువాత కొత్త స్ట్రాటజీతో ముందుకు సాగుతున్నారు. మరి ఇది కరెక్ట్ గా గురి కొడుతుందా లేదా అన్నది మూడేళ్ళ తరువాతనే తేలుతుంది.