ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఆప‌రేష‌న్ స‌క్సెస్‌

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కుడి భుజానికి శ‌నివారం ఉద‌యం వైద్యులు ఆప‌రేష‌న్ చేశారు.

Update: 2026-07-11 15:20 GMT

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కుడి భుజానికి శ‌నివారం ఉద‌యం వైద్యులు ఆప‌రేష‌న్ చేశారు. ఈ ఆప‌రేష‌న్ స‌క్సెస్ అయింద‌ని.. ప్ర‌స్తుతం ఆయ‌న వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నార‌ని జ‌న‌సేన పార్టీ కార్యాల‌యం తెలిపింది. 2016లో తగిలిన గాయాలకు తోడు... పోరాట యాత్ర నుంచి గత ఎన్నికల ప్రచారం వరకూ పార్టీ శ్రేణులు, అభిమానులు చేతులుపట్టి లాగడంతో తీవ్రమైన రొటేటర్ కఫ్ కు గాయాలు అయ్యాయ‌ని పేర్కొంది.

ఈ నేప‌థ్యంలో గ‌త కొన్నాళ్లుగా ఇబ్బంది ప‌డుతున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఇటీవ‌ల ముంబైలోని కోకిలా బెన్ వైద్య శాల‌లో ప‌రీక్ష‌ల‌కు వెళ్లారు. ఆప‌రేష‌న్ అవ‌స‌ర‌మ‌ని వైద్యులు సూచించ‌డంతో శ‌నివారం ఉద‌యం ఆ మేర‌కు చికిత్స చేశార‌ని జ‌న‌సేన కార్యాల‌యం పేర్కొంది. రెండు భుజాలకు రొటేటర్ కఫ్ గాయాలు తీవ్రంగా ఉన్న‌ట్టు వైద్యులు చెప్పార‌ని తెలిపింది. అయితే.. రెండు భుజాల‌కు ఒకేసారి కాకుండా.. వేర్వేరుగా ఆప‌రేష‌న్ చేయాల‌ని సూచించ‌డంతో తొలుత కుడి భుజానికి ఆప‌రేష‌న్ నిర్వ‌హించార‌ని పేర్కొంది.

శుక్ర‌వారమే ఆసుప‌త్రికి..

శుక్ర‌వారమే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆసుప‌త్రిలో చేరారు. మ‌రోసారి ఇత‌ర టెస్టులు చేసిన అనంత‌రం.. ఆప‌రేష‌న్ కు అనుకూలంగా ఆరోగ్యం ఉన్న‌ద‌ని నిర్ధారించుకుని.. శ‌నివారం ఉద‌యం ఆప‌రేష‌న్‌ను విజ‌య‌వంతం గా పూర్తి చేసిన‌ట్టు తెలిపింది. మూడున్నర గంటల పాటు సాగిన ఆప‌రేష‌న్ అనంత‌రం.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని వైద్యులు పేర్కొన్న‌ట్టు కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న‌లో వివ‌రించింది.

కుడి భుజానికి జ‌రిగిన ఆప‌రేష‌న్ అనంత‌రం.. మ‌రో నెల రోజుల్లో రెండో భుజానికి కూడా ఆప‌రేష‌న్ చేయ‌నున్న‌ట్టు పార్టీ తెలిపింది. అభిమానులు, పార్టీ శ్రేణులు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆరోగ్యంగానే ఉన్నార‌ని పార్టీ తెలిపింది. త్వ‌ర‌లోనే ప‌రిపాలనా ప‌ర‌మైన విధుల‌కు హాజ‌రవుతార‌ని పేర్కొంది.

త్వ‌ర‌గా కోలుకోవాలి: చంద్ర‌బాబు

ప‌వ‌న్ కల్యాణ్ కుడి భుజానికి జ‌రిగిన ఆప‌రేష‌న్ విజ‌య‌వంతం కావ‌డం ప‌ట్ల సీఎం చంద్ర‌బాబు వైద్యుల కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ``నా మిత్రుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కుడిభుజానికి ఆప‌రేష‌న్ విజ‌యవంతంగా పూర్తి చేసిన వైద్యుల‌కు కృత‌జ్ఞ‌త‌లు. ప‌వ‌న్ క‌ల్యాణ్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆ భ‌గ‌వంతుడిని కోరుకుంటున్నా న‌ను. ఆయ‌న త్వ‌ర‌గా సాధార‌ణ ప్ర‌జాజీవితంలోకి రావాల‌ని ఆకాంక్షిస్తున్నా.`` అని సీఎం చంద్ర‌బాబు పేర్కొన్నారు.

Tags:    

Similar News