భార్యను బెదిరించి పెళ్లి..కొడుకు ఉంగరం మింగినా పట్టించుకోలేదు.. బాలిక కోసం అందరినీ బలి చేశాడు

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. రాజ్‌కుమార్ ప్రేమ పేరుతో సరిత అనే యువతిని తీవ్రంగా వేధించాడు.

Update: 2026-07-11 12:27 GMT

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో పాటు తన భార్యాపిల్లలను కలిపి మొత్తం ఆరుగురిని అమానుషంగా హతమార్చిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. నిందితుడు రాజ్‌కుమార్‌ గురించి విచారిస్తున్న కొద్దీ.. అతడి వికృత చేష్టలు, గతానికి సంబంధించిన విస్తుపోయే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రాజ్‌కుమార్ మొదటి నుంచి హింసాత్మక ప్రవృత్తి కలిగినవాడని, మహిళల పట్ల అత్యంత అసభ్యంగా ప్రవర్తించేవాడని పోలీసులు గుర్తించారు.

భార్యను బెదిరించి పెళ్లి.. నరకప్రాయంగా మార్చిన జీవితం

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. రాజ్‌కుమార్ ప్రేమ పేరుతో సరిత అనే యువతిని తీవ్రంగా వేధించాడు. ఆమె పెళ్లికి నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకుంటానంటూ బ్లాక్‌మెయిల్ చేసి బలవంతంగా ఒప్పించాడు. అయితే పెళ్లయిన తర్వాత ఆమె జీవితాన్ని నరకప్రాయం చేశాడు. భార్య అందంగా లేదని, శరీర సౌష్టవం బాగోలేదంటూ ప్రతిరోజూ శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. వీరికి ఇద్దరు కుమారులు జన్మించినప్పటికీ, రాజ్‌కుమార్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. బాధ్యతారాహిత్యంగా తిరుగుతూ మహిళల వెంటపడటం అలవాటుగా మార్చుకున్నాడు.

కొడుకు ప్రాణాలనూ పట్టించుకోని నిర్లక్ష్యం

ఇటీవల రాజ్‌కుమార్ చిన్న కొడుకు పొరపాటున ఒక ఉంగరాన్ని మింగాడు. ఆ బాలుడు ఊపిరాడక, తీవ్ర నొప్పితో విలవిలలాడుతున్నా రాజ్‌కుమార్ కనీసం ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి కూడా ఇష్టపడలేదు. కన్న కొడుకు ప్రాణాల మీదికి వచ్చినా చూపించిన ఈ నిర్లక్ష్యం అతడిలోని క్రూరత్వానికి అద్దం పడుతోందని స్థానికులు చెబుతున్నారు.

పోక్సో కేసు వేసిన బాలిక కుటుంబంపై కక్ష

హత్యకు గురైన బాలిక కుటుంబంతో రాజ్‌కుమార్ మొదట్లో స్నేహంగానే ఉండేవాడు. కానీ ఆ కుటుంబంలోని మైనర్ బాలికపై కన్నేసి అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు అతడిని హెచ్చరించి, తమ ఇంటికి రావద్దని గట్టిగా చెప్పారు. దీంతో వారిపై పగ పెంచుకున్న రాజ్‌కుమార్ మరింత బరితెగించాడు.

ఆ కుటుంబం ఇంట్లో రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను రహస్యంగా తన మొబైల్‌కు అనుసంధానం చేసుకుని, వారి కదలికలను నిరంతరం పర్యవేక్షించేవాడు. భయంతో ఆ బాలికను కాలేజీకి పంపడం కూడా మానేశారు. పరీక్షల సమయంలో కాలేజీకి వెళ్లిన బాలికను అడ్డుకుని చేయి పట్టుకుని లాగడం, చదువు మానేయాలని బెదిరించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై రాజ్‌కుమార్‌పై పోక్సో కేసు నమోదైంది.

జైలు నుంచి రాగానే పక్కా స్కెచ్.. పాత మరణాలపై అనుమానాలు

పోక్సో కేసులో జైలుకు వెళ్లిన రాజ్‌కుమార్, సుమారు 15 రోజుల క్రితమే బెయిల్‌పై గ్రామానికి తిరిగి వచ్చాడు. ఊరిలో అందరితో ప్రశాంతంగా ఉన్నట్లు నటిస్తూనే తనను జైలుకు పంపిన వారిపై లోలోపల ప్రతీకార జ్వాల రగిలించుకున్నాడు. ఈ క్రమంలోనే పక్కా ప్రణాళికతో భార్య, ఇద్దరు పిల్లలతో పాటు, సదరు బాలిక, ఆమె తల్లిదండ్రులను అత్యంత దారుణంగా నరికి చంపాడు.

మరో కోణంలో పోలీసుల దర్యాప్తు

గతంలో ఆ బాలిక తండ్రి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అప్పట్లో అది సహజ మరణమేనని అందరూ భావించారు. కానీ ఇప్పుడు రాజ్‌కుమార్ క్రూరత్వం బయటపడటంతో ఆ మరణం వెనుక కూడా అతడి హస్తం ఉందేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు ఆ పాత మరణంపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి విచారణ జరుపుతున్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా అన్ని కోణాల్లో పక్కా ఆధారాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News