భారత్ యుద్ధం చేస్తుందా...రక్షణ మంత్రి చెప్పింది ఇదే !
భారత్ మాత్రం యుద్ధం విషయంలో మాత్రం తనదైన దృఢ వైఖరిని కొనసాగిస్తూ వస్తోంది. అదే మాటను రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ మరోసారి గట్టిగా చెప్పారు.
భారత దేశానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. భారత్ తోటి దేశాలకు సహాయం చేస్తుంది, అదే సమయంలో అందరికీ మిత్రుడిగా ఉంటుంది. భారత్ మీదకు ఎవరైనా అకారణంగా వస్తే మాత్రం చూస్తూ ఊరుకోదు, చేతులు కట్టుకోదు, ఇదే భారత్ కొనసాగిస్తున్న విధానం. ఇదే భారత్ దౌత్య నీతి, ఇదే భారత్ విదేశాంగ విధానం. ఎన్నో దేశాలు యుద్ధ పిపాసతో మరో దేశం మీద పడి చేసినది ఏంటి అన్నది చూస్తే చివరికి వెనక్కి రావడమే. భారత్ మాత్రం యుద్ధం విషయంలో మాత్రం తనదైన దృఢ వైఖరిని కొనసాగిస్తూ వస్తోంది. అదే మాటను రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ మరోసారి గట్టిగా చెప్పారు.
యుద్ధమే లక్ష్యం కాదు :
భారత్ కి యుద్ధమే లక్ష్యం కాదు అని రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రపంచ శాంతి స్థిరత్వమే భారత్ విధానమని ఆయన పేర్కొన్నారు. ఇక గత ఏడాది పాక్ మీద ప్రయోగించిన ఆపరేషన్ సిందూర్ యుద్ధం కాదని ఆయన చెప్పుకొచ్చారు. ఇది భారత భద్రతకు ముప్పు వాటిల్లితే దేశం ఎలా స్పందిస్తుందో ప్రపంచానికి చూపించిన ఒక గట్టి చర్య అని రాజ్ నాధ్ సింగ్ వ్యాఖ్యానించారు. భారత్ వ్యతిరేక శక్తులకు అవసరమైన సమయంలో తగిన సమాధానమిస్తామని ఆయన చెప్పడం విశేషం.
సముద్ర సింహంగా :
ఇదిలా ఉంటే విశాఖ సముద్రంలో మహేంద్రగిరి యుద్ధ నౌక జల ప్రవేశం చేసింది. దానిని జాతికి అంకితం చేసిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ శతృదేశాల్ని భయకంపితుల్ని చేసేందుకు ఈ యుద్ధ నౌక సదా సిద్ధంగా ఉంటుందని చెప్పారు. ఇక భారత నౌకాదళంలో అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిగా పేర్కొన్నారు. మహేంద్ర గిరి యుద్ధనౌక ద్వారా దేశ భద్రత మరింత బలోపేతమైందని ఆయన చెప్పారు. మారుతున్న వ్యూహాత్మక పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని భారత నావికాదళం అప్రమత్తంగానే ఉందని కేంద్ర మంత్రి తెలియచేయడం విశేషం. భారత నౌకాదళ శక్తిని మరింత పెంచే కీలక అడుగుగా పేర్కొన్నారు. భారత సముద్ర భద్రతలో విశాఖ కీలక కేంద్రంగా ఎదిగిందని అన్నారు. దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా అత్యాధునిక సాంకేతికతపై దృష్టి సారించామని ఆయన చెప్పారు. ఐదో తరం ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ టెక్నాలజీతో పాటు అండర్ వాటర్ టార్పెడో వ్యవస్థల్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
ఏఐతోనే యుద్ధాలు :
భవిష్యత్తులో యుద్ధాలు అన్నీ ఏఐ తోనే జరుగుతాయని ఆయన అన్నారు. విజయం మాత్రం జాతీయ సంకల్పం బలమైన సైనిక సంపత్తి నిబద్ధత ఉన్న వారికే దక్కుతుందని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడ్వాన్స్‌డ్ షిప్ టెక్నాలజీ డ్రోన్ టెక్నాలజీ పూర్తి స్థాయి నిఘా వ్యవస్థలతో భారత సాయుధ దళాల్ని ఆధునికీకరిస్తున్నామని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. కొత్త సాంకేతికత యుద్ధ అవసరాలకే కాకుండా విపత్తుల సమయంలో ఇతర దేశాలకు సహాయం చేయడంలో కూడా ఉపయోగపడుతుందని ఆయన చెప్పుకొచారు.
సముద్ర ప్రాంతం కీలకం :
ఇక చూస్తే కనుక ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని కేంద్ర రక్షణ మంత్రి చెప్పారు. . మారిటైం విజన్-2030 అమలులో భాగంగా సముద్ర రంగ అభివృద్ధికి ప్రత్యేక మారిటైం డెవలప్‌మెంట్ ఫండ్ ఏర్పాటు చేశామని తెలిపారు. షిప్ బిల్డింగ్ రంగంలో ఎంఎసఎంఈలు, స్టార్టప్‌లకు మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నామని, భారత్‌ను ప్రపంచ స్థాయి షిప్ బిల్డింగ్, మారిటైం ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. ప్రపంచ స్థాయి మారిటైం ఎకో సిస్టం నిర్మాణం దిశగా కేంద్ర ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.