అపరిచిత దేశం, దిక్కుతోచని స్థితిలో తెలుగు కుటుంబం..! మంత్రి లోకేశ్ జోక్యంతో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్

నలుగురి పాస్‌పోర్టులు ఉన్న బ్యాగ్ అదృశ్యం కావడంతో, ఏమీ అర్థం కాని స్థితిలో మూడు రోజుల పాటు విమానాశ్రయ గదుల్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సివచ్చింది.

Update: 2026-07-11 08:08 GMT

విదేశీ ప్రయాణం అంటే ఎంతో ఉత్సాహం. మరెంతో ఉద్వేగం. విదేశీ ఉద్యోగంతో ఇక లైఫ్ అంతా హ్యాపీ అన్న మూడ్ లో ఉంటారు ఎవరైనా.. కానీ, అప్పుడూ ఊహించని ఉపద్రవం ఎదురైతే అంతా చీకటి. సరిగ్గా అదే పరిస్థితిని ఎదుర్కొంది ఒక తెలుగు కుటుంబం. హైదరాబాద్ నుండి చికాగో బయలుదేరిన ఆ కుటుంబం, హాంగ్‌కాంగ్ ఎయిర్ పోర్టులో అడుగుపెట్టగానే తమ సర్వస్వాన్ని కోల్పోయిన పరిస్థితిని ఎదుర్కొంది. నలుగురి పాస్‌పోర్టులు ఉన్న బ్యాగ్ అదృశ్యం కావడంతో, ఏమీ అర్థం కాని స్థితిలో మూడు రోజుల పాటు విమానాశ్రయ గదుల్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సివచ్చింది. చికాగో ప్రయాణానికి హంగ్ కాంగ్ విమానాశ్రయ అధికారులు అనుమతి నిరాకరించడంతో గమ్యం లేని ప్రయాణంలో వారు నరకం చూశారు. చివరికి గత్యంతరం లేని స్థితిలో మంత్రి లోకేశ్ ను ట్యాగ్ చేస్తూ ఎక్స్ లో చేసిన ట్వీట్ తో మొత్తం యంత్రాంగం కదిలింది. మూడు రోజుల నరకం నుంచి ఆ తెలుగు కుటుంబానికి విముక్తి కలిగింది.

బ్యాగ్ మాయమైన మరుక్షణం ఆ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. విదేశీ గడ్డ, తెలియని భాష, ఎటు వెళ్లాలో తెలియని అభద్రతాభావం. విమానాశ్రయం అధికారులు పాస్‌పోర్టులు లేవనే కారణంతో వారిని కదలకుండా కట్టడి చేయడంతో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్న భార్యభర్తలు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఈ విపత్కర పరిస్థితి నుంచి బయటపడటం ఎలా అని మూడు రోజుల పాటు అంతర్మథనం పొందారు. ఎయిర్‌పోర్ట్ కుర్చీలే మంచాలుగా, ఎయిర్ పోర్టు అనౌన్స్‌మెంట్ల శబ్దాలే జోలపాటలుగా, చిన్నారుల అమాయకపు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆ తల్లిదండ్రులు కుమిలిపోయారు. ఆ సమయంలో భార్యకు వచ్చిన ఆలోచన కథలో మలుపు తిప్పింది.

లోకేశ్‌కు ట్వీట్.. కదిలిన దౌత్య వ్యవస్థ

నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ తల్లి, తన చివరి ప్రయత్నంగా ఫోన్ తీసుకుంది. మంత్రి నారా లోకేశ్‌ను ట్యాగ్ చేస్తూ ఆపదలో ఉన్న విషయాన్ని వివరిస్తూ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ చేసిన మరుక్షణమే స్పందన మొదలైంది. మంత్రి లోకేశ్ వెంటనే స్పందించి, విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అక్కడి నుండి ఆదేశాలు వెళ్లడంతో హాంగ్‌కాంగ్‌లోని భారత రాయబార కార్యాలయం యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగింది. అధికారుల జోక్యంతో ఆ కుటుంబానికి ఎయిర్‌పోర్టు నుండి బయటకు వచ్చేందుకు అనుమతి లభించింది. తక్షణమే అత్యవసర పాస్‌పోర్టులు జారీ చేసి, వారు తమ గమ్యస్థానానికి వెళ్లేలా మార్గం సుగమం చేశారు. మూడు రోజుల ఆందోళన తర్వాత, తమకు లభించిన స్వేచ్ఛను చూసి ఆ కుటుంబం ఊపిరి పీల్చుకుంది.

థాంక్యూ ఇండియన్ గవర్నమెంట్

ఈ ఘటనపై ఆ తల్లి స్పందిస్తూ, ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వం చూపిన మానవీయ కోణం మర్చిపోలేనిది. ప్రభుత్వంపై మా నమ్మకం మరింత పెరిగింది" అని భావోద్వేగానికి లోనయ్యారు. ఆ చిన్నారుల అమాయకపు చిరునవ్వుతో చెప్పిన "థాంక్యూ ఇండియన్ గవర్నమెంట్" అన్న మాటలు.. ఒక సామాన్యుడి గొంతుకు ప్రభుత్వం ఎలా అండగా ఉంటుందో మరోసారి నిరూపించాయి. సోషల్ మీడియా వేదికగా జరిగిన ఈ ఘటన, ప్రభుత్వ యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తే ఏదైనా సాధ్యమేనని చాటిచెప్పింది. తమకు ఎదురైన అనుభవం, మంత్రి లోకేశ్ జోక్యంతో అత్యావసర పాస్ పోర్టులు పొందిన వైనాన్ని వివరిస్తూ బాధితులు విడుదల చేసిన వీడియో వైరల్ అవుతోంది. అంతేకాకుండా మంత్రి నారా లోకేశ్ స్పందనపైనా పెద్ద ఎత్తున చర్చ జరగుతోంది. గతంలో కూడా విదేశాల్లో ఆపదలో చిక్కుకున్న వారిని లోకేశ్ రక్షించిన తీరు మరోసారి విస్తృత చర్చకు దారితీస్తోంది.



Tags:    

Similar News