ఆస్ట్రేలియా వెళ్లే విద్యార్థులకు భారీ షాక్..
"అంతర్జాతీయ విద్యా వ్యవస్థ నాణ్యతను మరింత మెరుగుపరచడం, స్టూడెంట్ వీసా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం."
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని.. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో స్థిరపడాలని కలలు కంటున్న అంతర్జాతీయ విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది. అంతర్జాతీయ విద్యార్థుల స్టూడెంట్ వీసా దరఖాస్తు ఫీజును ఆస్ట్రేలియా ప్రభుత్వం మరోసారి భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. గత రెండేళ్ల కాలంలో ఇలా వీసా ఫీజులను పెంచడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
తాజా నిర్ణయం ప్రకారం.. ఇప్పటి వరకు 2,000 ఆస్ట్రేలియన్ డాలర్లుగా ఉన్న స్టూడెంట్ వీసా అప్లికేషన్ ఫీజును ఒక్కసారిగా 2,500 ఆస్ట్రేలియన్ డాలర్లుకు పెంచారు. అంటే విద్యార్థులు ఇప్పుడు నేరుగా 500 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ సడన్ నిర్ణయం విదేశీ విద్య కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులపై, ముఖ్యంగా భారతీయ విద్యార్థులపై తీవ్ర ఆర్థిక ప్రభావాన్ని చూపనుంది.
పెరిగిన ఆర్థిక భారం.. ఆందోళనలో మధ్యతరగతి కుటుంబాలు
ప్రతి సంవత్సరం భారతదేశం నుండి వేలాది మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాను ఎంచుకుంటారు. అయితే ఇప్పటికే అక్కడ చదువుకోవడానికి అయ్యే ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్నాయి. యూనివర్సిటీ ట్యూషన్ ఫీజులు కోర్సును బట్టి ఏటా లక్షలాది రూపాయలుంటాయి. సిడ్నీ, మెల్‌బోర్న్ వంటి నగరాల్లో ఇళ్ల అద్దెలు, రోజువారీ ఖర్చులు భారీగా పెరిగాయి. విదేశీ విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం తప్పనిసరిగా చెల్లించాల్సిన ఫీజు ఉంటుంది. ఇప్పటికే ఈ ఖర్చులతో సతమతమవుతున్న మధ్యతరగతి కుటుంబాలకు, తాజా వీసా ఫీజు పెంపు అదనపు భారంగా మారింది. ఈ నిర్ణయంతో చాలా మంది విద్యార్థులు తమ విద్యా ప్రణాళికలను, బడ్జెట్‌ను మళ్లీ సమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇంగ్లిష్ లాంగ్వేజ్ విద్యార్థులకు స్వల్ప ఊరట
వీసా ఫీజులు పెంచినప్పటికీ ఆస్ట్రేలియా ప్రభుత్వం కొంతమంది విద్యార్థులకు చిన్న ఉపశమనం కలిగించింది. విశ్వవిద్యాలయాల్లో ప్రధాన కోర్సుల్లో చేరడానికి ముందు ఇంగ్లిష్ లాంగ్వేజ్ కోర్సులు చదివే విద్యార్థులకు సాధారణ స్టూడెంట్ వీసా దరఖాస్తుదారులతో పోలిస్తే తక్కువ వీసా ఫీజు వర్తిస్తుందని వెల్లడించింది. దీనివల్ల లాంగ్వేజ్ కోర్సుల ద్వారా వెళ్లే వారికి కొంత ఆర్థిక ఉపశమనం లభించనుంది.
ప్రభుత్వం ఏమంటోంది?
"అంతర్జాతీయ విద్యా వ్యవస్థ నాణ్యతను మరింత మెరుగుపరచడం, స్టూడెంట్ వీసా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం."
అని ఆస్ట్రేలియా ప్రభుత్వ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే కేవలం ఫీజులు మాత్రమే పెంచామని, వీసా పొందేందుకు అవసరమైన అర్హత నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇకపై ఆ దేశానికి వెళ్లాలనుకునే విద్యార్థులు తమ ఆర్థిక ప్రణాళికలను మరింత జాగ్రత్తగా డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. కరెన్సీ మార్పిడి విలువలను కూడా పరిగణనలోకి తీసుకుంటే భారతీయ విద్యార్థులపై ఈ ప్రభావం గట్టిగానే ఉండబోతోంది. కాబట్టి విద్యార్థులు వీసా దరఖాస్తు చేసుకునే ముందే పెరిగిన ఫీజుల వివరాలను సరిచూసుకోవడం మంచిది.