జమిలి ఖాయం... సీట్ల పెంపు కంఫర్మ్ ?
ఇక జమిలి ఎన్నికలు అంటే కొన్ని చోట్ల ఎన్నికలను వెనక్కి తీసుకెళ్ళాలి. కొన్ని చోట్ల ముందుకు తీసుకుని రావాలి.
దేశంలో 2029 ఎన్నికలు కొత్తగా ఉండబోతున్నాయా అంటే అవును అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జమిలి ఎన్నికలు ఖాయం అని అంటున్నారు. ఈ విషయం రాజకీయ వర్గాలలో చర్చగా ఉన్నా తాజాగా తెలంగాణా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దీనిని బలాన్ని ఇస్తున్నాయి. ఆయన ఖమ్మంలో జరిగిన సభలో మాట్లాడుతూ 2028లో ఎన్నికలు కాదు 2029లోనే తెలంగాణాలో ఎన్నికలు ఉంటాయని చెప్పారు. ఒక విధంగా ఇది సంచలన ప్రకటన గానే చూడాలి. అయితే ఇదే మాటను రేవంత్ రెడ్డి గతంలో కూడా అన్నారు. మరి ఆయన ఇంతలా గట్టిగా చెప్పగలుతున్నారు అంటే జమిలి ఎన్నికలకు దేశంలో సన్నాహాలు జరుగుతున్నట్లుగా జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ కి సమాచారం అందే ఉంటుందని భావిస్తున్నారు.
బీజేపీ వైఖరి సైతం :
జమిలి ఎన్నికలకు బీజేపీ కూడా తొందరపడుతోంది. దానికి ఆ పార్టీ అనుసరిస్తున్న వైఖరి కూడా కారణంగా ఉంది. లోక్ సభ సీట్లను 824 దాకా పెంచాలనుకోవడం, మహిళా బిల్లుని 2029 ఎన్నికల నుంచి వర్తింపచేయాలనుకోవడం ఈ విషయంలో పట్టుదలగా బీజేపీ రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదం కోసం చేస్తున్న ప్రయత్నాలు చూస్తే కనుక దేశంలో రాజకీయం 2029 నాటికి మారుతుందని అంటున్నారు. అంతే కాదు జమిలి ఎన్నికలకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ నాయకత్వంలో గతంలో వేసిన కమిటీ ఇచ్చిన సిఫార్సులు కేంద్రం వద్ద ఉన్నాయి. అనుకుంటే బీజేపీ దీని మీద కూడా పార్లమెంట్ లో బిల్లు పెడుతుందని అంటున్నారు. ఇపుడు బిల్లు పెట్టి ఆమోదిస్తే కనుక 2029 నాటికి కచ్చితంగా ఎన్నికలు జరుగుతాయని దానికి కావాల్సినంత సమయం ఉండాలంటే వర్షాకాల సమావేశాలోనే జమిలి ఎన్నికల బిల్లు ఆమోదిస్తారు అని అంటున్నారు.
ఈ రాష్ట్రాలు అన్నీ లిస్టులో :
ఇక జమిలి ఎన్నికలు అంటే కొన్ని చోట్ల ఎన్నికలను వెనక్కి తీసుకెళ్ళాలి. కొన్ని చోట్ల ముందుకు తీసుకుని రావాలి. రాజ్యాంగంలో ఉన్న ప్రకారం కనీసం ఏడాది లోపు ఉండే ఎన్నికలను ముందుకైన వెనక్కి అయినా జరుపుకోవచ్చు. ఈ లెక్క చూస్తే కనుక 2028 రెండవ అర్ధ భాగంలో జరిగే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను అలాగే 2030 తొలిభాగంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను కూడా 2029 జూన్ ఎన్నికలకు తీసుకుని వచ్చి జమిలి గా జరిపించవచ్చు అని అంటున్నారు. ప్రస్తుతం దేశంలో 28 రాష్ట్రాలు ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. దాంతో వీటిలో కనీసం సగానికి పైగా రాష్ట్రాలలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించినా జమిలి ఎన్నికలకు దేశం సిద్ధమై ఆ వైపుగా నడిపించినట్లే అవుతుంది.
జమిలి ఎన్నికల చట్రంలోకి :
ఆ తరువాత వరసలో మిగిలిన రాష్ట్రాలను తీసుకుని వస్తే మరో ఎన్నికల నాటికి మొత్తం దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన వాతావరణం ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అన్న బీజేపీ అజెండా అమలుకు 2029 నే కీలకంగా చేసుకుంటున్నారు అని అంటున్నారు. ఇలా చూస్తే కనుక ఈసారి వచ్చేవి జమిలి ఎన్నికలే అని చెప్పి తీరాల్సి ఉంది. అయితే ఈ జమిలి ఎన్నికల చట్రంలోకి వచ్చే రాష్ట్రాలు ఎన్ని ఏమిటి అన్నది అయితే చూడాల్సి ఉంది. దీని మీద కసరత్తు కూడా తీవ్ర స్థాయిలో జరుగుతోందని అంటున్నారు.