కార్డ్ నుంచి కేటుగాళ్లు డబ్బు కొట్టేయకుండా అల్యూమినియం ఫాయిల్ ట్రిక్కు!
ఈ వినూత్న డిజిటల్ దొంగతనాన్ని సైబర్ పరిభాషలో `రిలే ఎటాక్` అని పిలుస్తారు. ఇందులో హ్యాకర్లు మీ కార్డ్ ఎన్‌క్రిప్షన్‌ను బ్రేక్ చేయరు.
ఈ రోజుల్లో షాపింగ్ మాల్స్ లేదా కాఫీ షాపుల్లో క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను స్వైప్ చేయకుండా.. పిన్ నంబర్ నొక్కకుండా కేవలం మెషీన్‌కు దగ్గరగా చూపించి పేమెంట్లు చేయడం సర్వసాధారణమైపోయింది. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్.ఎఫ్.సి) టెక్నాలజీతో పనిచేసే ఈ కాంటాక్ట్‌లెస్ కార్డ్‌లు కేవలం 4 సెంటీమీటర్ల పరిధిలోనే పనిచేస్తాయి కాబట్టి ఇవి సురక్షితమని మనమంతా భావిస్తాం. అయితే ఐర్లాండ్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ పరిశోధకుల తాజా అధ్యయనం ప్రకారం.. కేవలం రెండు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు - వై-ఫై కనెక్షన్ సాయంతో దొంగలు మీ జేబులోని కార్డ్ సిగ్నల్‌ను ఎక్కడో ఉన్న పేమెంట్ టెర్మినల్‌కు ఫార్వార్డ్ చేసి సులభంగా డబ్బులు కొట్టేయవచ్చని తేలింది.
ఈ వినూత్న డిజిటల్ దొంగతనాన్ని సైబర్ పరిభాషలో `రిలే ఎటాక్` అని పిలుస్తారు. ఇందులో హ్యాకర్లు మీ కార్డ్ ఎన్‌క్రిప్షన్‌ను బ్రేక్ చేయరు. కేవలం మీ నిజమైన కార్డ్‌కు ఎక్కడో ఉన్న నిజమైన పేమెంట్ టెర్మినల్‌కు మధ్య ఒక `అదృశ్య వంతెన`లా మారుతారు. ఉదాహరణకు రద్దీగా ఉండే మెట్రో లేదా బస్సులో ఒక నిందితుడు మోడిఫై చేసిన ఫోన్‌ను మీ జేబుకు దగ్గరగా ఉంచితే ఆ ఫోన్ మీ కార్డ్ సిగ్నల్‌ను వై-ఫై ద్వారా వేరే చోట ఉన్న మరో ఫోన్‌కు పంపుతుంది. ఆ రెండో ఫోన్‌ను ఒక పాయింట్-ఆఫ్-సేల్ (పీవోఎస్) మెషీన్‌కు తాకించడం ద్వారా కేవలం 1 నుండి 4 సెకన్లలో మీ ప్రమేయం లేకుండానే ట్రాన్సాక్షన్ పూర్తయిపోతుంది.
ఇలాంటి ఆధునిక మోసాల నుండి మన క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను కాపాడుకోవడానికి మన వంటగదిలో ఉండే సాధారణ `అల్యూమినియం ఫాయిల్` ఒక అద్భుతమైన ఆయుధంగా పనిచేస్తుందని పరిశోధకులు నిరూపించారు. అల్యూమినియం అనేది ఒక మంచి విద్యుత్ వాహక లోహం. మీ కార్డ్‌ను అల్యూమినియం ఫాయిల్‌తో చుట్టడం ద్వారా అది ఫిజిక్స్ నియమాల ప్రకారం `ఫెరడే కేజ్`గా మారుతుంది. ఇది బయటి నుండి వచ్చే ఎలాంటి రేడియో ఫ్రీక్వెన్సీ లేదా ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ లోపలికి వెళ్లకుండా... అలాగే లోపలి సిగ్నల్స్ బయటకు రాకుండా ఒక దుర్భేద్యమైన కవచంలా పూర్తిగా అడ్డుకుంటుంది.
ఈ ప్రయోగంలో మానవ వెంట్రుక మందం కంటే చాలా తక్కువగా ఉండే కేవలం 27 మైక్రాన్ల మందం గల అల్యూమినియం పొర కూడా కార్డ్ రేడియో సిగ్నల్‌ను విజయవంతంగా బ్లాక్ చేయగలదని పరిశోధకులు స్పష్టం చేశారు. అయితే ఈ ట్రిక్ సరిగ్గా పనిచేయాలంటే కార్డ్‌ను ఎలాంటి గ్యాప్స్ లేదా చినుకులు లేకుండా పూర్తిగా ఫాయిల్‌తో కవర్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రతీసారి పేమెంట్ చేసేటప్పుడు కార్డ్‌ను ఫాయిల్ పేపర్ నుండి విప్పడం కాస్త విసుగుతో కూడిన పనే. అందుకే మార్కెట్లో దొరికే ఆర్.ఎఫ్.ఐ.డి-బ్లాకింగ్ వాలెట్లు లేదా స్లీవ్స్ (ఆర్.ఎఫ్.ఐ.డి-బ్లాకింగ్ స్లీవ్స్) వాడటం మరింత ప్రాక్టికల్ మార్గం. ఇవి కూడా ఇదే ఫెరడే కేజ్ సూత్రంపైనే మన్నికైన రూపంలో పనిచేస్తాయి.
మరోవైపు ప్లాస్టిక్ కార్డ్‌లతో పోలిస్తే స్మార్ట్‌ఫోన్లలో వాడే యాపిల్ పే లేదా గూగుల్ పే వంటి డిజిటల్ వాలెట్లు ఇలాంటి రిలే ఎటాక్స్ బారిన పడే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే అవి మీ అసలు కార్డ్ నంబర్‌ను ట్రాన్స్‌మిట్ చేయవు. దానికి బదులుగా వన్-టైమ్ కోడ్‌ను క్రియేట్ చేస్తాయి. పైగా ఫోన్ ద్వారా పేమెంట్ అవ్వాలంటే ఫేస్ ఐడీ, ఫింగర్ ప్రింట్ లేదా పాస్‌కోడ్ లాక్ తీయాల్సి ఉంటుంది కాబట్టి ఇవి మరింత సురక్షితమైనవి. ఏదేమైనా రద్దీగా ఉండే ప్రదేశాలలో ప్రయాణించేటప్పుడు లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు మీ ముఖ్యమైన కాంటాక్ట్‌లెస్ కార్డ్‌ను అల్యూమినియం ఫాయిల్ లేదా ఆర్‌ఎఫ్‌ఐడి స్లీవ్‌లో ఉంచడం అతి జాగ్రత్త అనుకోవాల్సిన అవసరం లేదు. అది సైన్స్ ఆధారిత చౌకైన రక్షణ కవచం.