సోషల్ మీడియాతో ఇక ఆషామాషీ కాదు...ఫుల్ ఫోకస్ అక్కడే !
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో సోషల్ మీడియా దుర్వినియోగంపై విస్తృత స్థాయిలో చర్చ జరిగిందని మంత్రి చెప్పారు.
చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. సోషల్ మీడియా కూడా ఉంది. అంతే వేరే ఆలోచన లేకుండా ఎవరో ఫ్రెండ్ తో మాట్లాడినట్లు లేదా ఆకతాయిగా వాదించినట్లు ఎలాంటి ఆధారాలు లేకుండా మూర్ఖంగా గొంతు పెంచినట్లుగా మేసేజెస్ పెడితే ఇక మీదట అలా అసలు కుదరదు. అంతే కాదు సోషల్ మీడియా ఉంది అని పెద్దల మీద ప్రభుత్వం మీద నోరు చేసుకుంటామని ఏమైనా అంటామని ఏదైనా చేస్తామని ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోతే మాత్రం చర్యలు తప్పవు. అవి కూడా ఒక పద్ధతి ప్రకారం ఉంటాయి. ఈ విషయాలను సోషల్ మీడియా యాక్టివిస్టులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మాత్రం చిక్కులు తప్పవని ప్రభుత్వం పెద్దలు అంటున్నారు.
ప్రత్యేక వ్యవస్థల ఏర్పాటు :
ఏపీలో సోషల్ మీడియా పేరుతో సాగుతున్న దుర్వినియోగాన్ని కట్టడి చేయడానికి కూటమి ప్రభుత్వం సీరియస్ గానే ఆలోచిస్తోంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీని మీదనే ప్రత్యేకంగా చర్చించారు. ఇక ఆ వివరాలను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి మీడియాకు తెలియజేశారు. అందులో చూస్తే కనుక సోషల్ మీడియా దుర్వినియోగాన్ని ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదని స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయి ప్రత్యేక వ్యవస్థల ఏర్పాటు చేయడంతో పాటు సోషల్ మీడియా దుర్వినియోగం చేసే వారి మీద సమగ్రమైన చట్టపరమైన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
విస్తృత స్థాయిలో చర్చ :
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో సోషల్ మీడియా దుర్వినియోగంపై విస్తృత స్థాయిలో చర్చ జరిగిందని మంత్రి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం సుస్థిర పాలనకు ఆర్థిక బలోపేతం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సమాజంలో ముఖ్యంగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం, వ్యక్తిత్వ హననం అసభ్యకర పోస్టులు ద్వేషపూరిత వ్యాఖ్యలు వంటి పరిణామాలు ప్రజాస్వామ్య విలువలకు ప్రభుత్వ వ్యవస్థలకు సామాజిక సామరస్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాకు అదే లోపం :
ఇక సాంప్రదాయ మీడియాకు చట్టపరమైన జవాబుదారీతనం నైతిక ప్రమాణాలు, బాధ్యతలు ఉన్నప్పటికీ, సోషల్ మీడియా వేదికల్లో వాటి లోపం కారణంగా నిరాధార ఆరోపణలు, దుష్ప్రచారం, వ్యక్తిగత దూషణలు, ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు విస్తృతంగా జరుగుతున్నాయని సమాచార మంత్రి పేర్కొన్నారు. ప్రజల ఆలోచనా విధానాన్ని, పరిపాలనా వ్యవస్థపై నమ్మకాన్ని ప్రభావితం చేసే స్థాయికి సోషల్ మీడియా దుర్వినియోగం చేరుకుందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని రాజకీయ విమర్శలు విధానాలపై ఉండాలి గానీ వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారాలు, వ్యక్తిత్వ హననంగా మారకూడదని మంత్రి స్పష్టం చేశారు.
కఠిన చర్యలు తప్పవు :
ఇక ఈ అంశంపై జరిగిన సమగ్ర సమీక్షా సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులతో విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. ముఖ్యంగా మహిళలు, బాలికలు, మైనర్లపై సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న అవమానకర ప్రచారం, అసభ్యకర పోస్టులు, వ్యక్తిత్వ హననంపై ప్రభుత్వం అత్యంత తీవ్రంగా స్పందిస్తోందని చెప్పారు. ప్రజాప్రతినిధులు, మంత్రులు, ప్రజా జీవితంలో ఉన్న ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దుష్ప్రచారంపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుత సమాచార సాంకేతిక చట్టాల్లో ఉన్న అవకాశాలు, లోపాలను పరిశీలించి, చట్టపరమైన అన్ని మార్గాలను వినియోగిస్తూ నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. అవసరమైతే నేరస్థులను చట్టపరంగా జైలుకు పంపే చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు.
డిజిటల్ ఫోరెన్సిక్ సాంకేతికత వినియోగం :
అదే విధంగా వ్యక్తిత్వ హననం, అసత్య ప్రచారం, దుష్ప్రచారం నిర్వహిస్తున్న సోషల్ మీడియా హ్యాండిళ్లను గుర్తించేందుకు అత్యాధునిక డిజిటల్ ఫోరెన్సిక్ సాంకేతికత వినియోగం, సోషల్ మీడియా నేరాలపై జిల్లా స్థాయి పోలీసు అధికారులు, ముఖ్యంగా ఎస్ హెచ్ ఓలకు ప్రత్యేక శిక్షణ, సైబర్ నేరాల దర్యాప్తు, న్యాయపరమైన వ్యవహారాల్లో నైపుణ్యం కలిగిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకంపై చర్యలు, అవసరమైతే సైబర్ నిపుణులను పోలీసు శాఖకు అనుసంధానించి ప్రభుత్వం అవసరమైన మద్దతు అందించడం జరుగుతుందన్నారు. అలాగే సోషల్ మీడియా దుర్వినియోగాన్ని సమర్థవంతంగా అరికట్టేందుకు దేశంలోని ఇతర రాష్ట్రాలు, ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు అమలు చేస్తున్న చట్టాలు, విధానాలు, నియంత్రణ వ్యవస్థలపై సమగ్ర అధ్యయనం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఆ అధ్యయన నివేదికను మంత్రివర్గం పరిశీలించి, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా అవసరమైన చట్టపరమైన, పరిపాలనా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
స్వేచ్చ పేరుతో అలా :
ఇక స్వేచ్ఛాయుత భావ వ్యక్తీకరణను ప్రభుత్వం గౌరవిస్తుందని, అయితే ఆ స్వేచ్ఛ పేరుతో అసత్య ప్రచారం, అశ్లీలత, మహిళల గౌరవాన్ని దెబ్బతీయడం, వ్యక్తిత్వ హననం, సామాజిక విద్వేషాన్ని రెచ్చగొట్టే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని మంత్రి స్పష్టం చేశారు.