రిటైర్మెంట్ వయసు 70 ఏళ్లకు పెంపు..? ప్రభుత్వ పరిశీలనలో సంచలన ప్రతిపాదన!

800 ప్రొఫెసర్ పోస్టులకు కేవలం 200 ఖాళీలు ఉన్నట్లు మంత్రి గుర్తించారు. సూపర్ స్పెషాలిటీ విభాగంలో 159 మంది ఉండాల్సివుండగా 106 ఖాళీలు ఉన్నాయని చెబుతున్నారు.

Update: 2026-07-10 17:30 GMT

ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో ప్రొఫెసర్ల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచన చేస్తోందని చెబుతున్నారు. అనుభవం ఉన్న ప్రొఫెసర్లు లేకపోవడం వల్ల అందుబాటులో ఉన్న వారి సేవలు వినియోగించుకోవాలనే ఆలోచనతో రిటైర్మెంట్ వయసును పెంచాలని ప్రభుత్వం పరిశీలిస్తోందని ప్రచారం జరుగుతోంది. మంత్రి సత్యకుమార్ కూడా దీనిపై చూచాయగా సంకేతాలు ఇవ్వడంతో ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో రిటైర్మెంట్ వయసును 65 లేదా 70 ఏళ్లకు పెంచే అవకాశం ఉందని అంటున్నారు.

ప్రభుత్వ బోధనాసుపత్రుల ప్రొఫెసర్ల రిటైర్మెంట్ పెంపునకు చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు. వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్ల సంఖ్యను బట్టి పీజీ సీట్లను కేంద్రం మంజూరు చేస్తుందని చెబుతున్నారు. ఒక్కో ప్రొఫెసర్ కు మూడు పీజీ సీట్లు చొప్పున కేటాయిస్తున్నారని, ప్రైవేటు వైద్య కళాశాలలు ప్రొఫెసర్ల సంఖ్యను ఎక్కువగా చూపుతూ అధిక సీట్లు పొందుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. అదే సమయంలో ప్రస్తుతం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్లను 62 ఏళ్లకే రిటైర్మెంట్ ఇవ్వడంతో పీజీ సీట్లు భారీగా కోల్పోతున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ప్రైవేటు కళాశాలలు అనుసరిస్తున్నట్లే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనూ 70 ఏళ్లకు రిటైర్మెంట్ వయసు పెంచాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని మంత్రి సత్యాకుమార్ యాదవ్ వెల్లడించారు.

అదేసమయంలో రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండగా భారీగా ఖాళీలు ఉన్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. 800 ప్రొఫెసర్ పోస్టులకు కేవలం 200 ఖాళీలు ఉన్నట్లు మంత్రి గుర్తించారు. సూపర్ స్పెషాలిటీ విభాగంలో 159 మంది ఉండాల్సివుండగా 106 ఖాళీలు ఉన్నాయని చెబుతున్నారు. దీంతో విద్యాప్రమాణాలు దిగజారే అవకాశాలు ఉండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిని నివారించేందుకు ముందుగా రిటైర్మెంట్ వయసు పెంచితే త్వరలో ఏర్పడే ఖాళీలను నివారించవచ్చునని అధికారులు భావిస్తున్నారు.

అయితే ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసు పెంచాలనే నిర్ణయంపై ఎటువంటి రియాక్షన్ వస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో 60 ఏళ్లకే రిటైర్మెంట్ ఉండేదని, రాష్ట్ర విభజన అనంతరం రిటైర్మెంట్ ప్రయోజనాలు చెల్లించే ఆర్థిక పరిస్థితి లేక రిటైర్మెంట్ వయసును రెండు సార్లు పెంచారని చెబుతున్నారు. ఇప్పుడు వైద్య కళాశాలల్లో ప్రమాణాలు, పీజీ సీట్లు పేరుతో మరింత ఎక్కువగా రిటైర్మెంట్ వయసును పెంచడంపై అభ్యంతరాలు వ్యక్తమతున్నాయని అంటున్నారు. 70 ఏళ్ల వరకు అవిశ్రాంతంగా సేవలు అందించడం అంటే డాక్టర్ల ఆరోగ్యంపై ఒత్తిడి పెంచడమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రైవేటు కాలేజీలు అనుసరిస్తున్న విధానాలను ప్రభుత్వం కూడా పాటించాలని ఆలోచించడం కరెక్టు కాదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అవసరం అనుకుంటే కొత్త రిక్రూట్మెంట్ చేయాలని సూచిస్తున్నారు.

Tags:    

Similar News