లోకేశ్ @కొరియా : యువనేతకు సరికొత్త పేరు

ఇదే సమయంలో అంతర్జాతీయస్థాయి పారిశ్రామిక వేత్తలు అభినందనలు అందుకునేలా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జోరు చూపిస్తూ లోకేశ్ సత్తా చాటుకుంటున్నారు.

Update: 2026-07-11 08:09 GMT

పెట్టుబడుల కోసం దక్షిణకొరియాలో పర్యటిస్తున్న మంత్రి లోకేశ్ విదేశీ పారిశ్రామికవేత్తల ప్రశంసలు అందుకుంటున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు గత వారం రోజులుగా కొరియాలో వివిధ పట్టణాల్లో పర్యటిస్తూ పారిశ్రామికవేత్తలతో వరుసగా భేటీ అవుతున్న లోకేశ్ అక్కడికక్కడే తీసుకుంటున్న నిర్ణయాలు వారిని ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో లోకేశ్ వేగానికి ముగ్ధులై ఆయనను పొగుడుతూ ‘పల్లి పల్లి లోకేశ్’ అంటూ సరికొత్త పేరుతో పిలుస్తున్నారు. కొరియన్ భాషలో పల్లి పల్లి అంటే త్వర త్వరగా అనే అర్థమని చెబుతున్నారు. రాష్ట్రప్రభుత్వం తరఫున వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ పారిశ్రామిక పెట్టుబడులకు అనుగుణమైన వాతావరణం కల్పిస్తున్నారని లోకేశ్ ప్రశంసలు అందుకుంటున్నారు.

పల్లి పల్లి లోకేశ్ అంటూ కొరియన్ పారిశ్రామికవేత్తలు అంటుండటం హాట్ టాపిక్ అవుతోంది. ఇది మంత్రి లోకేశ్ ను గతంలో ట్రోల్స్ చేసిన వారికి మింగుడు పడని అంశంగా చెబుతున్నారు. లోకేశ్ రాజకీయాల్లోకి వచ్చిన నుంచి ప్రత్యర్థులు విమర్శలు గుప్పించడం, సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం, ఎన్నో రకాల పేర్లు పెట్టి ఎగతాళి చేయడం అందరికీ తెలిసిందే. కానీ, ఇప్పుడు సీన్ పూర్తిగా మారింది. యువగళం పాదయాత్రతో సమర్థవంతుడైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న లోకేశ్.. రెడ్ బుక్ తో ట్రోలర్లు, విమర్శలకు సింహస్వప్పంలా మారారు. ఇదే సమయంలో అంతర్జాతీయస్థాయి పారిశ్రామిక వేత్తలు అభినందనలు అందుకునేలా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జోరు చూపిస్తూ లోకేశ్ సత్తా చాటుకుంటున్నారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడంలో లోకేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తనదైన శైలిలో ప్రజెంటేషన్లు ఇస్తూ, పారిశ్రామికవేత్తల సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేస్తూ, పెట్టుబడులు పెట్టేలా వారిని ఒప్పించడంలో ఆయన సక్సెస్ అవుతున్నారు. ఈ క్రమంలోనే దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరుగుతున్న సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌లో భాగంగా ఆయన కొరియా పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. సమావేశం సందర్భంగా లోకేశ్ ఇచ్చిన ప్రజెంటేషన్, ఆయన అడిగిన ప్రశ్నలకు ఇస్తున్న సమాధానాలు, నిర్ణయాలు తీసుకుంటున్న వేగం చూసి కొరియా వ్యాపారవేత్తలు ఆశ్చర్యపోయారు. ఆయన పనితీరులోని చురుకుదనాన్ని మెచ్చుకుంటూ, ఆయన్ను 'పల్లి పల్లి లోకేశ్' అని సంబోధిస్తూ అభినందించడం వైరల్ అవుతోంది.

ఒకప్పుడు తనపై వచ్చిన విమర్శలను పట్టించుకోకుండా, నేడు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా లోకేశ్ సాగిస్తున్న ప్రస్థానం అందరినీ ఆకట్టుకుంటోంది. విదేశీ పారిశ్రామికవేత్తలే ఆయన పనితీరును గుర్తించి అభినందించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రత్యర్థుల విమర్శలు, ఎగతాళిని దాటి, తన పనితీరుతో ఒక కొత్త బ్రాండ్ ఇమేజ్‌ను సృష్టించుకోవడంలో లోకేశ్ సఫలీకృతం అవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, కొరియా పర్యటనలో భాగంగా లోకేశ్ రాష్ట్రానికి ఎలాంటి కొత్త పెట్టుబడులు తీసుకువస్తారోనని ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News