హై-స్పీడ్ రైల్ హబ్‌గా హైదరాబాద్.. రైల్వే మంత్రి అశ్వణీ వైష్ణవ్ కీలక ప్రకటన

బులెట్ రైలు ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే, ప్రయాణ సమయాలు ఊహించని విధంగా తగ్గిపోనున్నాయని చెబుతున్నారు.

Update: 2026-07-11 11:16 GMT

హైదరాబాద్‌ నగరాన్ని దేశంలోనే ఒక ప్రధాన హై-స్పీడ్ రైల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన ప్రకటన హాట్ టాపిక్ అవుతోంది. దేశవ్యాప్తంగా ఏడు బుల్లెట్ రైలు ప్రాజెక్టులను ప్రవేశపెడుతుండగా, ఇందులో ఏకంగా మూడు రూట్లు తెలంగాణకు దక్కడం విశేషంగా చెబుతున్నారు. ప్రధాని మోదీ ప్రత్యేక చొరవ, రాష్ట్ర రైల్వే అభివృద్ధిపై ఆయన చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ వల్లే బులెట్ రైలు ప్రాజెక్టులు రాష్ట్రానికి సాధ్యమయ్యాయని మంత్రి అశ్వనీ వైష్ణవ్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ దేశంలోనే అత్యంత కీలకమైన బుల్లెట్ రైల్ హబ్‌గా అవతరించబోతోందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

గంటలో విజయవాడ

బులెట్ రైలు ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే, ప్రయాణ సమయాలు ఊహించని విధంగా తగ్గిపోనున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులకు సుదూర ప్రయాణాలు ఎంతో సులభతరం కానున్నాయని అంటున్నారు. తాజా ప్రణాళికల ప్రకారం, బుల్లెట్ రైలుతో హైదరాబాద్ - విజయవాడ మధ్య ప్రయాణ సమయం కేవలం గంట 10 నిమిషాలు మాత్రమే ఉంటుందని అంటున్నారు. అదేవిధంగా, దేశంలోని ప్రధాన వాణిజ్య కేంద్రాలైన ముంబైకి 2 గంటల 20 నిమిషాల్లో, చెన్నై నగరానికి కేవలం 2 గంటల వ్యవధిలోనే చేరుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి రావడం వల్ల రవాణా వ్యవస్థలో వేగం పెరగడమే కాకుండా, పారిశ్రామికంగా, ఆర్థికంగా కూడా ఈ ప్రాంతం మరింత పురోగతి సాధిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

రైల్వే మౌలిక సదుపాయాల కల్పనలో ప్రస్తుత ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో వివరిస్తూ, మంత్రి అశ్విని వైష్ణవ్ గణాంకాలను గుర్తు చేశారు. గత యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బడ్జెట్‌లో కేవలం రూ. 800 కోట్లు మాత్రమే కేటాయించగా, ప్రస్తుత ప్రభుత్వం కేవలం తెలంగాణ రాష్ట్రానికే భారీగా రూ. 5,000 కోట్ల నిధులను కేటాయించిందని స్పష్టం చేశారు. ఈ నిధుల వరద వల్లే రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు అద్భుతమైన వేగంతో పరుగులు పెడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రాజకీయ విమర్శలకు తావులేకుండా, అభివృద్ధిని ప్రాతిపదికగా చేసుకుని ఈ భారీ ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్నామని మంత్రి వివరించారు.

మొత్తంగా, ఈ హై-స్పీడ్ రైలు ప్రాజెక్టులు దేశ రవాణా రంగ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోనున్నాయని అంటున్నారు. హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని సాగనున్న ఈ రైల్వే నెట్‌వర్క్, తెలంగాణ ఆర్థిక వృద్ధికి వెన్నెముకగా మారనుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణ వేగాన్ని పెంచడమే కాకుండా, ప్రజల కష్టాలను పూర్తిగా తొలగించి, నగరానికి నూతన గుర్తింపును తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను అమలు చేస్తోందని మంత్రి ప్రకటించారు.

Tags:    

Similar News