మా కష్టాన్ని మీ ఖాతాలో వేసుకుంటున్నారు: సీఎం రేవంత్‌పై కేంద్ర మంత్రి ఫైర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఎప్పుడూ సౌమ్యంగా ఉండే అశ్వినీ వైష్ణవ్.. తాజాగా మైదరాబాద్‌లో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ``మా కష్టాన్ని మీ ఖాతాలో వేసుకుంటున్నారు.`` అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేని వారే.. ఇలా పరుల కష్టాన్ని దోచుకుంటా రని విమర్శించారు.
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అశ్వినీ వైష్ణవ్.. బుల్లెట్ రైలు ప్రతిపాదనలు.. బోగీ తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బుల్లెట్ రైలు ప్రతిపాదనలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే చెందుతాయన్నారు. కానీ, కొందరు ఇదేదో తమ కష్టంతో వస్తున్న ప్రాజెక్టుగా చెప్పుకొంటున్నారని.. ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. అయితే.. ప్రజలు అంత అమాయకులని తాను భావించడం లేదని చెప్పారు.
రాష్ట్రంలో బుల్లెట్ ట్రైన్లు ఒకటి కాదు.. మూడు వస్తున్నాయని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-ముంబై, హైదరాబాద్ - చెన్నైల మధ్య బుల్లెట్ రైళ్లు ప్రయాణిస్తాయని తెలిపారు. వీటికి సంబంధించి నిధులు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ప్రతి విషయాన్నీ `కొందరు` రాజకీయ కోణంలోనే చూస్తున్నారని పరోక్షంగా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. కానీ, కేంద్ర ప్రభుత్వం ప్రజల కోణంలోనే ఆలోచన చేస్తోందన్నారు.
తెలంగాణకు ఏం తక్కువ చేశామని ఈ సందర్భంగా రైల్వే మంత్రి ప్రశ్నించారు. రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణకు ఇప్పటి వరకు 5 వేల కోట్ల రూపాయలను ఇచ్చామన్నారు. హైదరాబాద్ కేంద్రంగానే మూడు బుల్లెట్ రైళ్లు వస్తున్నాయన్నారు. ఏపీకి కేవలం 820 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించినట్టు తెలిపారు. అయినా.. కేంద్రం ఏమీ చేయడం లేదన్న ప్రచారం జరగడం శోచనీయమని వ్యాఖ్యానించారు. రైల్వే శాఖలో త్వరలోనే సంస్కరణలు రానున్నాయని తెలిపారు. రాష్ట్రానికి బుల్లెట్ రైళ్లు వస్తే.. వ్యాపార, వాణిజ్యాలతోపాటు పర్యాటక రంగం కూడా విస్తరిస్తుందని, తద్వారా రాష్ట్రానికే ఆదాయం పెరుగుతుందని చెప్పారు.