సీఎం విజయ్ పై అభిమానం.. హెచ్ఎం సస్పెన్షన్.. దళపతి సర్కార్ షాకింగ్ డెసిషన్
ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో రాజకీయ కార్యక్రమాలను ప్రసారం చేయడంపై తమిళనాడు విద్యాశాఖ కఠినంగా వ్యవహరించింది
ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో రాజకీయ కార్యక్రమాలను ప్రసారం చేయడంపై తమిళనాడు విద్యాశాఖ కఠినంగా వ్యవహరించింది. కరూర్ జిల్లా, కృష్ణరాయపురంలోని పంచాయతీ యూనియన్ మిడిల్ స్కూల్ (గర్ల్స్) ప్రధానోపాధ్యాయురాలు ఎస్. మల్లికను విద్యాశాఖ సస్పెండ్ చేసింది. ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి దళపతి విజయ్ కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు గాను హెచ్ఎంపై సస్పెన్షన్ వేటు వేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. సీఎంపై అభిమానంతోనే హెచ్ఎం ఆ పనిచేసినా, విద్యాసంస్థల ప్రాంగణంలో రాజకీయ కార్యక్రమాలను ప్రసారం చేయడంపై సర్కారు కన్నెర్ర జేసింది. దీంతో తప్పు చేస్తే ఎవరైనా చర్యలు ఉంటాయని సంకేతాలు పంపినట్లు అయిందని వ్యాఖ్యానిస్తున్నారు.
ముఖ్యమంత్రి దళపతి విజయ్ శుక్రవారం కరూర్ జిల్లాలో పర్యటించారు. గత ఏడాది సెప్టెంబర్ 27న కరూర్ లో నిర్వహించిన టీవీకే ఎన్నికల ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ బాధితుల కుటుంబాలకు నష్టపరిహారంతోపాటు 32 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. నియామక పత్రాలను అందజేసేందుకు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ శుక్రవారం కరూర్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమాన్ని కృష్ణరాయపురంలోని ప్రభుత్వ పాఠశాలలోని స్మార్ట్ క్లాస్‌రూమ్ డిస్‌ప్లేలో విద్యార్థులకు హెచ్‌ఎం చూపించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం మొదలైంది.
పాఠశాల తరగతి గదుల్లో సీఎం కార్యక్రమాలు ప్రసారం చేయడంపై విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఈ ఘటనపై ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. నిబంధనల ఉల్లంఘనపై విచారణకు ఆదేశించింది. పాఠశాలల్లో ప్రభుత్వ పరమైన అధికారిక కార్యక్రమాలు తప్ప, ఎటువంటి రాజకీయ పార్టీల కార్యక్రమాలు, పుట్టినరోజు వేడుకలు లేదా ప్రైవేట్ సంస్థల కార్యకలాపాలను స్కూళ్లలో ప్రసారం చేయకూడదని సీఎం కార్యక్రమానికి ముందు రోజే విద్యాశాఖ ఒక సర్క్యులర్ జారీ చేసింది. కానీ, హెచ్ఎం మల్లిక మాత్రం ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి సీఎం హాజరైన కార్యక్రమాన్ని ప్రసారం చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
కాగా, ఈ ఘటనపై తమిళనాడు విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ పాఠశాలలో విద్యాబోధనకు మాత్రమే చేయాలని స్పష్టం చేశారు. విద్యాసంస్థల ఆవరణ రాజకీయాలకు తావులేదని తేల్చిచెప్పారు. హెచ్‌ఎం మల్లిక చర్య నిబంధనలకు విరుద్ధమని విచారణలో గుర్తించినందున ఆమెను తక్షణమే సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. మొత్తానికి ప్రభుత్వ సర్క్యులర్ పై అవగాహన లేకపోవడంతో హెచ్ఎం సస్పెండ్ కు గురయ్యారని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ చర్యతో పాఠశాలల ఆవరణలో రాజకీయాలపై ప్రభుత్వం గట్టి సందేశం ఇచ్చిందని అంటున్నారు