విశాఖ యవతి రాధాగాయత్రి కేసులో కీలక పరిణామం.. పోలీసుల అదుపులో భర్త శ్రీచరణ్

ఉత్తరాఖండ్ లోని ముస్సోరీలో అనుమానాస్పదంగా మరణించిన విశాఖకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పారుపూడి రాధా గాయత్రి కేసు కీలక పరిణామం చోటుచేసుకుంది./

Update: 2026-07-11 15:16 GMT

ఉత్తరాఖండ్ లోని ముస్సోరీలో అనుమానాస్పదంగా మరణించిన విశాఖకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పారుపూడి రాధా గాయత్రి కేసు కీలక పరిణామం చోటుచేసుకుంది. రాధాగాయత్రి మరణానికి భర్త శ్రీచరణ్ సోమయాజులు కారణమంటూ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో ఉత్తరాఖండ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు మెజిస్ట్రీరియల్ దర్యాప్తు చేయాలని డెహ్రడూన్ కలెక్టర్ ఆదేశించారు. దీంతో రాధాగాయత్రి డెత్ మిస్టరీ వీడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

విశాఖకు చెందిన రాధాగాయత్రి గత నెల 14న ముస్సోరిలో ఒక హోంస్టేలో శవమై కనిపించింది. భర్త శ్రీచరణ్ తో కలిసి హనీమూన్ కోసం వెళ్లిన రాధాగాయత్రి విగతజీవిగా మారడంపై తల్లిదండ్రులు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. తమ కుమార్తెను అల్లుడే చంపేసి ఉంటాడని ఉత్తరాఖండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాధాగాయత్రిపై విష ప్రయోగం జరిగిందని వారు పోలీసులకు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు శ్రీచరణ్ ను అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశం అవుతోంది.

తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ముస్సోరి పోలీసులు శ్రీచరణ్‌పై హత్య (103(1) బీఎన్‌ఎస్) కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా ఉత్తరాఖండ్ పోలీసులు శ్రీచరణ్‌ను, అతని తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారని చెబుతున్నారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో మృతికి గల స్పష్టమైన కారణం తెలియకపోవడంతో, జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు మెజిస్టీరియల్ విచారణ కూడా కొనసాగుతోంది. కాగా, రాధాగాయత్రి మరణించిన తర్వాత తల్లిదండ్రులు రాకుండానే పోస్టుమార్టం పూర్తి చేయడంపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ జోక్యం చేసుకుని మెజిస్ట్రీరియల్ విచారణకు ఆదేశించడంతో కేసు చిక్కుముడి వీడుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు ఈ కేసులో తొలి నుంచి రాధాగాయత్రి తల్లిదండ్రులు అల్లుడు శ్రీచరణ్ పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి అయిన నాటి నుంచి అనుమానంతో వేధిస్తున్నాడని చెబుతున్నారు. రెండు రోజుల క్రితం ఉత్తరాఖండ్ వెళ్లిన రాధాగాయత్రి తల్లిదండ్రులు సుధాకర్, సత్యవతి ముస్సోరిలోని హోం స్టేను పరిశీలించారు. ఆ ప్రాంతం చాలా భయంకరంగా ఉందని, భద్రతా లోపాలు ఉన్నాయని ఆరోపించారు. అంతేకాకుండా తమ కుమార్తె మరణంపై విచారణ జరిపి న్యాయం చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ ను కలిసి కోరారు. ఈ నేపథ్యంలో పోలీసులు శ్రీచరణ్, ఆయన తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. దీంతో కేసులో పురోగతిపై ఆశలు చిగురిస్తున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News