నల్లారి వారు నలిగిపోతున్నారుగా !
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి ఏపీకి చిట్ట చివరి ముఖ్యమంత్రి. ఇది ఆయనకు రాజకీయ చరిత్రలో అనుకోకుండా దక్కిన ఒక రికార్డు.
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి ఏపీకి చిట్ట చివరి ముఖ్యమంత్రి. ఇది ఆయనకు రాజకీయ చరిత్రలో అనుకోకుండా దక్కిన ఒక రికార్డు. అంతే కాదు మరో ప్రత్యేకత కూడా ఆయనకు ఉంది, మంత్రి కాకుండానే ముఖ్యమంత్రి అయిపోయారు. ఆయన ముందు ఎవరూ అలా కాలేదు కానీ ఆ తర్వాత మాత్రం ఏపీలో జగన్ తెలంగాణాలో రేవంత్ రెడ్డి ఆ విధంగానే అయ్యారు. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు నుంచి పలు సార్లు గెలిచి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మూలంగా మంత్రి కాలేకపోయారు. అయితే వైఎస్సార్ ఆయన మీద సాఫ్ట్ కార్నర్ తో ఉండడంతో స్పీకర్ గా చేశారు. వైఎస్సార్ మరణం తరువాత కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ స్థాయిలో తన పలుకుబడిని సాన్నిహిత్యాన్ని ఉపయోగించి అనూహ్యంగా ముఖ్యమంత్రి పీఠం అందుకున్నారు అని చెబుతారు.
జాక్ పాట్ సీఎం అంటూ :
ఇక కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయితే ఆయన ప్రత్యర్ధులు మాత్రం జాక్ పాట్ లా సీఎం పదవి తగిలింది అని సెటైర్లు పేల్చేవారు. మరి అదేమి సందర్భంలో అన్నారో తెలియదు కానీ 2014 మార్చిలో ఆయన తన పదవికి రాజీనామా చేసిన తరువాత పుష్కర కాలంగా రాజకీయంగా ఆయన మళ్ళీ ముందు వరసలోకి రాలేకపోయారు. అంతే కాదు కీలకమైన అధికార పదవులు ఆయనకు దక్కలేదు. జై సమైకాంధ్రా పార్టీని ఆయన స్థాపించి 2014 ఎన్నికల్లో తాను పోటీకి దిగకుండా తన వారిని దింపినా ఆ పార్టీకి ఎక్కడా డిపాజిట్లు దక్కలేదు. ఆ మీదట కొన్నాళ్ళకు కాంగ్రెస్ లో చేరిన ఆయన అందులో నుంచి కూడా బయటకు వచ్చేశారు. ఇక అటూ ఇటూ చూసి కమలం పార్టీ కండువా కప్పుకున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో తనలాంటి సీనియర్ కి మాజీ సీఎం కి తగిన హోదా గౌరవం దక్కుతుంది అని ఆయన భావించారు.
ఓటమితో మారిన లెక్క :
అయితే బీజేపీ కూడా ఉమ్మడి ఏపీకి సీఎం గా పనిచేసిన వారు బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతగా కిరణ్ ని చేరుకుని ఆశలు పెట్టుకుంది. 2024 ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా ఆయనకు రాజం పేట లోక్ సభ సీటు కేటాయించారు. అయితే వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి చేతిలో ఆయన ఓటమి పాలు అయ్యారు. ఆ ఒక్క ఓటమే ఆయన రాజకీయ దశను లెక్కను కూడా కూడా మార్చేసింది అని అంటున్నారు. ఆ ఎన్నికల్లో కనుక కిరణ్ కుమార్ రెడ్డి గెలిచి ఉంటే ఈపాటికి కేంద్రంలో కేబినెట్ ర్యాంక్ మంత్రిగా ఉండేవారు. కానీ జస్ట్ మిస్ అన్నట్లుగా తయారైంది. ఆ తరువాత ఏపీ నుంచి రెండు మూడు సందర్భాలలో ఖాళీ అయిన రాజ్యసభ సీట్లలో కిరణ్ కుమార్ రెడ్డి రేసులో ఉన్నట్లుగా వినిపిస్తూ వచ్చింది. అయితే చివరి నిముషంలో వేరే వారికి ఆ పదవులు దక్కాయి. ఇక తాజాగా జూన్ లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ నుంచి నాలుగు సీట్లు ఖాళీ అయితే అందులో మూడు టీడీపీ ఒకటి జనసేన గెలుచుకున్నాయి. బీజేపీకి ఒక్క సీటూ కేటాయించలేదు.
అడిగి ఉండాల్సిందింగా :
ఇక ఏపీ నుంచి నల్లారి వారిని రాజ్యసభకు తీసుకుని రావాలని బీజేపీ పెద్దలకు ఉంటే కనుక ఒక సీటు కూటమి నుంచి అడిగి తీసుకునేఅవరు అని అంటున్నారు. బీజేపీ పెద్దలు అడిగితే టీడీపీ కూడా ఇచ్చి ఉండేదని అంటున్నారు. కానీ ఆ విధంగా జరగలేదు అంటే కేంద్ర బీజేపీ పెద్దలు కిరణ్ కుమార్ రెడ్డి విషయంలో ఏమి ఆలోచిస్తున్నారు అన్నది ఒక చర్చగా ఉంది. అంతే కాదు కిరణ్ కుమార్ రెడ్డి రాజ్యసభకు వెళ్ళి ఆ విధంగా కేంద్ర మంత్రి కావాలని చూస్తున్నారు అని కూడా ప్రచారంలో ఉంది. అయితే బీజేపీ ఆలోచనలు వేరు అని అంటున్నారు.
పార్టీ పటిష్టత కోణంలో :
బీజేపీ పెద్దలు అయితే ఎవరిని అయినా చేర్చుకున్నా కూడా పనితీరుని గమనిస్తారు. పార్టీ పటిష్టత ఆధారంగానే పదవులు పంచుతారు అని అంటారు. కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కువ కాలం హైదరాబాద్ లోనే ఉంటారు అని కూడా ప్రచారంలో ఉంది. ఆయన సొంత నియోజకవర్గంలో కూడా పట్టు సడలుతోందని కూడా చెబుతూంటారు. దాంతో ఆయన విషయంలో బీజేపీ పెద్దలు అయితే సీనియర్ నాయకుడిగానే చూస్తూ వస్తున్నారు తప్పించి అధికార పదవులలో అయితే ప్రాధాన్యత ఇవ్వడం లేదని అంటున్నారు. ఇక కాంగ్రెస్ బీజేపీ వంటి జాతీయ పార్టీలలో ఉన్నా తన రాజకీయ జాతకం మారకపోవడం పట్ల కిరణ్ కుమార్ రెడ్డి కొంత అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. చూడాలి మరి జాతీయ కార్యవర్గంలో ఆయనకు కీలక స్థానం దక్కుతుందేమో అన్నది.