వైసీపీలో చక్రం తిప్పిన దిగ్గజ నేత సైలెంట్ మోడ్ లో ?

ఇక పరిణామాలను అన్నీ గమనిస్తున్న పెద్దిరెడ్డి మౌనమే నా భాష అంటున్నారు. లేటెస్ట్ గా ఆయన మావిగన్ కి తాము అనుకూలమని పార్టీ అంతా జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తుందని చెప్పారు.

Update: 2026-07-12 03:44 GMT

వైసీపీలో ఆయన దిగ్గజ నాయకుడు. ఆయనకు ఏకంగా ఒక జిల్లానే జగన్ రాసిచ్చారు అని ప్రత్యర్ధులు విమర్శలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తన హవా చాటుకుంటూ దశాబ్దాలుగా తన రాజకీయ బలాన్ని చాటుకుంటూ వస్తున్న ఆ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయనకి 2004లో వైఎస్సార్ కేబినెట్ లో మంత్రి పదవి దక్కింది. వైఎస్సార్ మరణాంతరం ఆయన వైసీపీలోకి వచ్చారు. జగన్ తోనే ఉంటూ వైసీపీని బలోపేతం చేశారు. 2014 నుంచి పార్టీని చిత్తూరు జిల్లాలో గెలిపిస్తూ వస్తున్నారు. 2019 నుంచి 2024 మధ్యలో అయిదేళ్ళ పాటు మంత్రిగా కీలక శాఖలను చూశారు. 2024లో కూటమి ప్రభంజనం ఎంతలా వీచినా పెద్దిరెడ్డి కుటుంబం గెలిచింది. ఆయన ఆయన తమ్ముడు ఎమ్మెల్యేలు అయితే కుమారుడు మిధున్ రెడ్డి రాజంపేట నుంచి ఎంపీగా హ్యాట్రిక్ విజయం దక్కించుకున్నారు. దటీజ్ పెద్దిరెడ్డి ఫ్యామిలీ అని చాటుకున్న తరువాత కూడా ఆయన సైలెంట్ గానే ఉంటూ వస్తున్నారు.

రెండేళ్ళు గడచినా :

ఏపీలో కూటమి ప్రభుత్వం పాలన రెండేళ్ళు పూర్తి అయింది. ఇక వైసీపీ యాక్టివ్ కావాల్సిన సందర్భం కూడా వచ్చింది. అయితే వైసీపీలో చెప్పుకోదగిన నేతలు మాత్రమే మీడియా ముందుకు వచ్చి గొంతు విప్పుతున్నారు. పెద్దిరెడ్డి మాత్రం మీడియా ముందుకు రావడం లేదు, వైసీపీకి మద్దతుగా నిలిచి కూటమి మీద గట్టి విమర్శలు చేయడం లేదు. ఇదే ఇపుడు చర్చగా ఉంది. పెద్దిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరూ ఒకే జిల్లాకు చెందిన వారు. ఇద్దరి మధ్య రాజకీయ వైరం ఉంది. దాంతో బాబు సీఎం గా ఉన్న సమయంలో అందునా కూటమి అపరిమితమైన మెజారిటీతో అధికారం దక్కించుకున్న క్రమంలో తామే టార్గెట్ అవుతామన్న సంగతి గుర్తెరిగి పెద్దిరెడ్డి వ్యూహాత్మకంగా ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు.

మిధున్ రెడ్డి అరెస్టుతో :

ఇక పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచి ఎంపీ మిధున్ రెడ్డి అరెస్ట్ అయి రాజమండ్రి జైలులో ఏకంగా నలభై రోజులకు పైగా గడిపారు. అది ఒక విధంగా పెద్దిరెడ్డి ఫ్యామిలీకి బిగ్ షాక్ తగిలింది. ఇక మంత్రిగా అప్పట్లో పనిచేసిన పెద్దిరెడ్డి మీద కూడా విమర్శలు చేస్తూ వచ్చిన కూటమి ప్రభుత్వం ఆయన మీద కూడా కేసులు పెడుతుందేమో అన్న చర్చ సాగింది. ఒక దశలో పెద్దిరెడ్డి టార్గెట్ అయ్యారన్న సూచనలు బలంగా వినిపించాయి. మొత్తానికి అయితే ప్రస్తుతానికి అది నెమ్మదించినా కూడా పెద్దిరెడ్డికి కూటమి పాలనలో ఇబ్బందులు పొంచి ఉన్నాయనే అంటున్నారు.

మౌన ముద్రలోనే :

ఇక పరిణామాలను అన్నీ గమనిస్తున్న పెద్దిరెడ్డి మౌనమే నా భాష అంటున్నారు. లేటెస్ట్ గా ఆయన మావిగన్ కి తాము అనుకూలమని పార్టీ అంతా జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తుందని చెప్పారు. అది పార్టీ పరమైన నిర్ణయం దాని మీద ఆయన మాట్లాడారు, అంతకు మించి కూటమి మీద విమర్శలు అయితే చేయలేదని గుర్తు చేస్తున్నారు. ఇక వైసీపీలో చూస్తే మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ, అలాగే ధర్మాన ప్రసాదరావు వంటి వారు మాట్లాడుతూ విమర్శలు చేస్తున్నా పెద్దిరెడ్డి నుంచి సౌండ్ లేకపోవడం వ్యూహాత్మకమా అని అంటున్నారు.

అధినాయకతంతోనే ఉంటూ :

అయితే పెద్దిరెడ్డి అధినాయకత్వాని దగ్గరగానే ఉంటున్నారు అని ప్రచారం సాగుతోంది. ఆయన బెంగళూరు వెళ్తున్నారు కానీ తాడేపల్లి రావడం లేదని అంటున్నారు. అక్కడే జగన్ తో ఆయన మాట్లాడుతున్నారని వర్తమాన రాజకీయాల మీద ఆయన చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. ఇక ఎన్నికలకు ఏడాది సమయంలోనే ఆయన తన నోరు విప్పుతారు అని అపుడే యాక్టివ్ మోడ్ లోకి వస్తారు అని అంటున్నారు. ఈ లోగా సౌండ్ పెంచితే ఎందుకొచ్చిన తంటా అన్న ముందస్తు జాగ్రత్తలోనే ఆయన ఉన్నారని అంటున్నారు. మొత్తం మీద బలమైన నేత కీలకంగా గతంలో వ్యవహరించిన పెద్దిరెడ్డి లాంటి వారు సైలెంట్ గా ఉండడం మాత్రం పార్టీకి కొంత ఇబ్బందిగానే ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News