మంత్రివర్గ నిర్ణయానికి గవర్నర్ నో చెప్పకూడదన్న మద్రాస్ హైకోర్టు
పలు రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వర్సెస్ గవర్నర్ మధ్య నడిచే పంచాయితీల గురించి తెలిసిందే;
పలు రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వర్సెస్ గవర్నర్ మధ్య నడిచే పంచాయితీల గురించి తెలిసిందే. ఇలాంటి పేచీలు ఉన్న రాష్ట్రాల్లో రాష్ట్ర మంత్రివర్గం తీసుకునే కొన్ని నిర్ణయాలకు గవర్నర్ నో చెప్పేయటం తెలిసిందే. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య పంచాయితీ మరింత ముదురుతుంది. తాజాగా ఇలాంటి విభేదం ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ నో చెప్పటంతో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాల్ని ఆపే అధికారం సాధ్యం కాదని స్పష్టం చేసిన మద్రాస్ హైకోర్టు.. రాజ్ భవన్ - సచివాలయం మధ్యఉన్న విభజన రేఖపై మరింత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.
అసలేం జరిగిందంటే.. అన్నామలై వర్సిటీకి చెందిన విద్యార్థి నావరసు హత్యకు గురైన కేసులో జాన్ డేవిడ్ కు జీవితఖైదు వేసింది కోర్టు. అయితే.. జాన్ డేవిడ్ ను ముందస్తుగా విడుదల చేయాలని కోరుతూ గవర్నర్ కు తమిళనాడు రాష్ట్ర మంత్రివర్గం సిఫార్సు చేసింది. అయితే.. ఈ నిర్ణయాన్ని గవర్నర్ నో చెప్పేశారు.
దీంతో.. ఈ నిర్ణయాన్ని సవాలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం.. జాన్ డేవిడ్ తరఫున మద్రాస్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్ రమేశ్.. జస్టిస్ లక్ష్మీనారాయన్ ధర్మాసనం భిన్నమైన తీర్పులను ఇచ్చింది. ఖైదీల శిక్ష తగ్గింపు.. ముందస్తు విడుదలలో మంత్రివర్గ నిర్ణయానికి గవర్నర్ కట్టుబడాలా? ఏయే సందర్భాల్లో గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరించటం కుదురుతుందనే విషయంపై త్రిసభ్య ధర్మాసనం విచారించాలని సిఫార్సు చేసింది.
ఈ నేపథ్యంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జగదీష్ చంద్ర, జస్టిస్ ఇళంతిరైయన్.. జస్టిస్ సుందర్ మోహన్ ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపింది. రాజ్యాంగం ప్రకారం మంత్రివర్గం సిఫార్సుల మేరకు గవర్నర్ పని చేయాలని పేర్కొంటూ.. ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పాలనాపరమైన కార్యకలాపాల్లో గవర్నర్ వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోకూడదన్న కోర్టు.. మంత్రి వర్గ సూచనలు.. సిఫార్సుల ప్రకారం వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా గతంలో సుప్రీంకోర్టు ఏడుగురున్యాయమూర్తుల ధర్మాసనం ధ్రువీకరించినట్లుగా పేర్కొన్నారు. ఈ వాదనలకు సంబంధించిన తీర్పును వాయిదా వేశారు. అదే సమయంలో మంత్రివర్గ నిర్ణయాన్ని ఏకపక్షంతో నో చెప్పే అధికారం గవర్నర్ కు లేదని స్పష్టం చేసింది. పాలనా పరమైన అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు రాజ్ భవన్ నో చెప్పకూడదన్న విషయంపై మరింత క్లారిటీ వచ్చిందని చెప్పాలి.