గాలి జనార్ధన్ దూకుడు.. ఇరకాటంలో బీజేపీ..!

Update: 2023-01-29 06:00 GMT
మైనింగ్ వ్యాపారంలో కోట్లు గడించిన గాలి జనార్ధన్ రెడ్డి రాజకీయాల్లో కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్నారు. ఇటీవలి కాలంలో సీబీఐ కేసులు.. ఆస్తుల జప్తు తదితర కేసులతో ఆయన ఇబ్బందులు పడ్డారు. దీంతో దాదాపు దశాబ్దం పాటు క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలోనే ఆయనపై క్రమంగా కోర్టు చిక్కులు తొలగిపోతున్నాయి.

దీంతో ఆయన మళ్లీ రాజకీయాలపై ఫోకస్ పెడుతున్నారు. కర్ణాటకలో కళ్యాణ రాజ్య ప్రగతి పార్టీ (కేఆర్పీపీ)ని ప్రారంభించిన ఆయన రాజకీయంగా సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కర్ణాటకలో పర్యటిస్తున్న నేపథ్యంలోనే గాలి జనార్ధన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

తాను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని గాలి జనార్దన రెడ్డి వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 10 నాటికి అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరుఫున అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు. ఇటీవల తన ఆస్తులను జప్తు చేయడంపై ఆయన స్పందించారు. ఆస్తులు స్వాధీనం చేసుకోవడం ద్వారా తనను ఎవరూ బెదిరించలేరని స్పష్టం చేశారు.

కోర్టులు ఉన్నాయని.. నేడు ఒక్క రూపాయి స్వాధీనం చేసుకుంటే భవిష్యత్తులో అది పది రూపాయలు అవుతుందన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ధే అజెండాతో ప్రజల ముందుకు వెళ్లనున్నట్లు చెప్పారు. తమ మేనిఫెస్టోపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ పార్టీ నుంచి అభ్యర్థులు ఉన్నారని తెలిపారు.

మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఫిబ్రవరి 10లోగా ప్రకటిస్తానని చెప్పారు. త్వరలోనే రాయచూరులో మెగా ర్యాలీ చేస్తామని.. పది రోజుల్లో చాలా మంది నాయకులు తమ పార్టీలో చేరబోతున్నారని వెల్లడించారు. గాలి జనార్ధన్ రెడ్డి కొత్త పార్టీ వల్ల హైదరాబాద్-కర్ణాటక జిల్లాల్లో అధికార బీజేపీని ఎదురుగాలి తప్పదనే ప్రచారం జరుగుతోంది.

కాగా ఇటీవల గాలి జనార్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అవసరమైతే తాను సీఎం అవుతానంటూ బాంబు పేల్చారు. ఈ క్రమంలోనే ఆయన వీడియో నాడు వైరల్ గా మారింది. తాజాగా మరోసారి గాలి జనార్ధన్ తాను ఎవరికీ భయపడేది లేదంటూ వ్యాఖ్యానించడం చూస్తుంటే కర్ణాటకలో రాజకీయాలు కొత్త మలుపు తిరగడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News