ఆయన అడుగు ముందుకు పడేనా?

Update: 2015-09-05 07:57 GMT
తనకు ఎదురే లేనట్లుగా దూసుకెళుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు షాక్ ఇచ్చే అవకాశం కోసం తెలంగాణలోని రాజకీయ పక్షాలన్నీ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాయి. రోజురోజుకి బలపడిపోతున్న కేసీఆర్ ను ఎదుర్కోవటం అంత సులభమైన విషయం కాదని తెలుసుకున్న వారు.. ఇప్పుడు ఆయన్ని ఏదోలా దెబ్బ తీయాలని తపిస్తున్నారు.

ఇందులో భాగంగా త్వరలో జరిగే అవకాశం ఉన్న వరంగల్ ఎంపీ ఉప ఎన్నికను ఒక అవకాశంగా తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా రాజకీయ పార్టీలు ఎవరికి వారు.. తమ తమ వ్యూహాలకు పదును పెడుతుంటే.. వామపక్షాలు అనూహ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలకభూమి పోషించిన అతి కొద్దిమందిలో ఒకరైన ప్రజా గాయకుడు గద్దర్ ను చట్టసభకు పంపాలన్న ఆలోచన చేశారు.

ఎన్నోఏళ్లుగా ప్రజా ఉద్యమాల్లో ఉన్నా.. ఎన్నడూ చట్టసభలకు వెళ్లని ఆయన్ను.. వరంగల్ ఉప ఎన్నికకు.. వామపక్షాల అభ్యర్థిగా బరిలోకి దించితే.. పోటీ రసకందాయంలో పడటమే కాదు.. అధికారపక్షానికి షాక్ ఇవ్వటానికి అవకాశాలున్నాయన్న మాట వినిపిస్తోంది. ఈ ప్రపోజల్ ను గద్దర్ వద్దకు తీసుకెళ్లిన వామపక్ష వాదులకు మొదట నిరాశ ఎదురైనా.. ఒకటికి రెండుసార్లు ప్రయత్నించిన తర్వాత.. గద్దర్ మెత్తపడినట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనుసరిస్తున్న వైఖరికి ప్రశ్నించేందుకు ఒక ఉద్యమ గొంతు కావాలని.. అది గద్దర్ లో మెండుగా ఉందని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

సుదీర్ఘ ఉద్యమ నేపథ్యం ఉన్న గద్దర్ కాని వరంగల్ ఉప ఎన్నిక బరిలో నిలిస్తే.. తెలంగాణలో కొడిగడుతున్న వామపక్షాల బలం ఒక్కసారిగా పెరగటం ఖాయమన్న భావనను వామపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. అందుకే.. గద్దర్ ను బరిలోకి దించే విషయంలో వెనక్కి తగ్గకూడదని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఖర్చు దగ్గర నుంచి మిగిలిన ఏ విషయంలోనూ.. సమకాలీన రాజకీయ పార్టీలు అనుసరించే అన్ని విధానాల్ని అనుసరించి.. వరంగల్ సీటును చేజిక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్ లో గద్దర్ ఓకే చెప్పటం అత్యంత కీలకం కావటంతో.. ఆయన్ను ఒప్పించే బాధ్యతను వామపక్షాలకు చెందిన ఇద్దరు ప్రముఖ నేతలు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే పలుమార్లు గద్దర్ తో చర్చించిన వారు.. ఆయన్ను ప్రాధమికంగా ఒప్పించినట్లుగా చెబుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుందో అంచనా లేని నేపథ్యంలో.. అప్పటివరకూ గ్రౌండ్ వర్క్ చేసుకోవాలన్న ఆలోచనలో వామపక్షాలు ఉన్నట్లు చెబుతున్నాయి. పోటీకి ఇప్పుడు మెత్తబడిన గద్దర్.. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే నాటికి గట్టి పడితే పరిస్థితేంటన్నది ఇప్పుడు అందరి మనసుల్ని వేధిస్తున్న ప్రశ్న.  దీనికి సరైన సమాధానం.. గద్దర్ మాత్రమే చెప్పగలరు.
Tags:    

Similar News