తెలుగోడు..డీఆర్ డీవో చీఫ్ అయ్యాడు

Update: 2018-08-26 04:50 GMT
అవును.. ఒక తెలుగోడు.. అందునా ఆంధ్రోడు దేశ ప‌రిశోధ‌క రంగానికి గుండెకాయ లాంటి ర‌క్ష‌ణ ప‌రిశోధ‌న సంస్థ ఇంగిలిపీసులో ఒక్కమాట‌లో చెప్పాలంటే డీఆర్ డీవోకు అధిప‌తి అయ్యాడు. మ‌రింత ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమంటే.. సీనియ‌ర్ శాస్త్ర‌వేత్త క‌మ్ క్షిప‌ణి రంగంలో నేవిగేష‌న్ నిపుణుడు అయిన 55 ఏళ్ల డాక్ట‌ర్ జి. స‌తీశ్ రెడ్డికి కీల‌క‌ప‌ద‌వి ల‌భించ‌టం విశేషం. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని నెల్లూరు జిల్లాకు చెందిన స‌తీశ్ రెడ్డి ఇప్ప‌టికే ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి శాస్త్రీయ స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఆయ‌నకు కీల‌క ప‌ద‌వి అప్ప‌చెబుతూ కేంద్ర నియామ‌కాల మంత్రివ‌ర్గ ఉప‌సంఘం తాజాగా నిర్ణ‌యం తీసుకుంది. ఈ ప‌ద‌విలో క‌నీసం రెండేళ్లు లేదంటే.. త‌దుప‌రి ఉత్త‌ర్వులు వెలువ‌డే వ‌ర‌కూ కొన‌సాగే వీలుంది. వ్య‌వ‌సాయ కుటుంబంలో పుట్టిన స‌తీశ్ రెడ్డి త‌న‌కు తానుగా ఎదిగాడు. అనంత‌పురం జేఎన్ టీయు నుంచి ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్స్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆయ‌న హైద‌రాబాద్ జేఎన్ టీయూ నుంచి ఎంఎస్.. పీహెచ్ డీ పొందారు. విద్యార్హ‌త‌ల్ని ప‌క్క‌న పెడితే స‌తీశ్ రెడ్డిలో ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమంటే.. ఆయ‌న త‌న తోటి బ్యాచ్ మేట్స్ అంతా విదేశాల‌కు వెళ్లి సెటిల్ అవ్వాల‌న్న ఆలోచ‌న చేస్తే.. ఆయ‌న మాత్రం దేశం విడిచి వెళ్ల‌టానికి అస్సలు ఇష్ట‌ప‌డ‌లేదు. 1985లో డీఆర్ డీవోలో శాస్త్ర‌వేత్త‌గా చేరిన ఆయ‌న చివ‌ర‌కు అదే సంస్థ‌కు అధిప‌తి కావ‌టం గ‌మ‌నార్హం.

డీఆర్ డీవోలో శిక్ష‌ణ పూర్తి అయ్యాక హైదరాబాద్‌లోని ర‌క్ష‌ణ ప‌రిశోధ‌న‌.. అభివృద్ధి ప్ర‌యోగ‌శాల అయిన డీఆర్ డీఎల్ లో చేరారు. స‌తీశ్ రెడ్డిలోని ప‌ని త‌నాన్ని గుర్తించిన భార‌త క్షిప‌ణి పితామ‌హుడు అబ్దుల్ క‌లాం ఆయ‌న్ను నేవిగేష‌న్ విభాగంలో నియ‌మించారు. క‌లాం స్వ‌ప్న‌మైన ఆర్ సీఐ అలియాస్ రీసెర్చ్ సెంట‌ర్ ఇమార‌త్ లో చేరిన ఆయ‌న‌.. కీల‌క క్షిప‌ణి ప్ర‌యోగాల్లో పాలు పంచుకున్నారు. అగ్ని 1 టు 5.. పృథ్వి.. ధ‌నుష్‌.. అస్త్ర‌.. ఆకాశ్‌.. బ్ర‌హ్మోస్.. నిర్బ‌య్.. హెలీనా.. నాగ్.. ఎంఆర్ శామ్ లాంటి క్షిప‌ణుల్లో కీల‌క వ్య‌వ‌స్థ‌ల్ని అభివృద్ధి చేసిన ఆయ‌న‌.. త‌న మార్క్ ను ప్ర‌ద‌ర్శించారు. డీఆర్ డీవో అధిప‌తి ప‌ద‌విని పొంద‌టం అంత తేలికైన విష‌యం కాదు. భారీ పోటీ ఉంటుంది. అందునా ద‌క్షిణాదికి చెందిన వ్య‌క్తికి ఆ ప‌ద‌వి ల‌భించ‌టం.. అందునా ఏపీకి చెందినోడికి ఇవ్వ‌టం అంటే.. మామూలు విష‌యం కాదు. స్వ‌త‌హాగా ఉన్న టాలెంట్ తో పాటు.. త‌న‌కు అప్ప‌గించిన ప‌నిని సిన్సియ‌ర్ గా పూర్తి చేయ‌టంలో పేరున్న స‌తీశ్ రెడ్డి హ‌యాంలో డీఆర్ డీవో మ‌రింత అభివృద్ధి చెంద‌టం ఖాయ‌మ‌న‌టంలో సందేహం లేదు. ఆల్ ద బెస్ట్ స‌తీశ్ రెడ్డి.
Tags:    

Similar News