బీజేపీకి షాక్‌.. కాంగ్రెస్‌ లోకి మాజీ ప్ర‌ధాని త‌న‌యుడు

Update: 2021-12-30 11:30 GMT
దేశ‌మంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు మ‌రికొన్ని నెల‌ల్లో జ‌ర‌గ‌నున్నాయి. అధికారం కాపాడుకోవ‌డం కోసం బీజేపీ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. మ‌రోవైపు బీజేపీని గ‌ద్దె దించి అధికారం దక్కించుకోవ‌డం కోసం విప‌క్షాలు వ్యూహ ర‌చ‌న‌ల్లో మునిగిపోయాయి. ఈ ద‌శ‌లో అక్క‌డ బీజేపీకి పెద్ద షాక్ త‌గిలింది.

భార‌త దివంగ‌త ప్ర‌ధాని లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి త‌న‌యుడు సునీల్ శాస్త్రి బీజేపీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. యూపీలో పార్టీని గెలిపించే బాధ్య‌త‌లు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ స‌మ‌క్షంలో ఆయ‌న హ‌స్తం గూటికి చేరారు.

వ‌చ్చే ఏడాది మార్చి- ఏప్రిల్‌లో యూపీలో ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టి నుంచే అధికార బీజేపీతో పాటు కాంగ్రెస్‌, స‌మాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ (బీఎస్పీ), తృణ‌మూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కూడా ఎన్నిక‌ల వేడిని అమాంతం పెంచేశాయి. హోరాహోరీ ప్ర‌చారాలు, చేరిక‌లు, విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల‌తో యూపీ పొలిటిక‌ల్ ఫైట్ జోరందుకుంది.

ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున ప్రియాంక అక్క‌డే మ‌కాం వేసి పార్టీ గెలుపు కోసం తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. మ‌రోవైపు ఎస్పీ అధినేత అఖిలేష్ యాద‌వ్ యాత్ర పేరుతో ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో సునీల్ శాస్త్రి కాంగ్రెస్‌లో చేర‌డం ఆ పార్టీకి బూస్ట్ ఇచ్చేదేన‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ సైనికుడు దివంగ‌త ప్ర‌ధాని లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి కుమారుడు సునీల్ పార్టీ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వం రోజు పార్టీలో చేర‌డం సంతోషంగా ఉంద‌ని ఈ సంద‌ర్భంగా ప్రియాంక తెలిపారు. గ‌తంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మంత్రిగా ప‌ని చేసిన సునీల్ అనుభ‌వం పార్టీకి ప‌నికొస్తుంద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు అంటున్నాయి.

సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న శాస్త్రి కుటుంబం తిరిగి కాంగ్రెస్‌లో చేర‌డం పార్టీకి మ‌రింత లాభాన్ని చేకూరుస్తుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ ప‌రిణామంతో యూపీలో బీజేపీకి మ‌రింత న‌ష్టం జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ట్లు నిపుణులు అంటున్నారు. ఇప్ప‌టికే అక్క‌డి ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరుగుతోంది. ముఖ్యంగా ల‌ఖింపూర్ ఖేరీ ఘ‌ట‌న త‌ర్వాత అక్క‌డ బీజేపీ గ్రాఫ్ ప‌డిపోయింద‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు.




Tags:    

Similar News