ఉద్యమ శిఖరం ఊపిరి ఆగింది.. నాయిని కన్నుమూత

Update: 2020-10-22 03:45 GMT
ఉద్యమనాయకుడు, తెలంగాణ తొలి హోమ్ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి ఇక లేరు. మంగళవారం అర్ధ రాత్రి 12:10 గంటలకు ఆయన అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్త విని  తెలంగాణ ప్రజా లోకం మూగబోయింది. టీఆర్ ఎస్ శ్రేణులు దుఃఖ సాగరంలో మునిగాయి. కరోనా నుంచి కోలుకున్నారు..ఇక మళ్లీ అందరి ముందుకు వస్తారని ఆశించిన ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలకు ఆవేదన మిగుల్చుతూ ఈ లోకాన్ని వీడారు.

గత నెల 28న కరోనా సోకడంతో నాయిని నర్సింహారెడ్డి చికిత్స కోసం  హైదరాబాద్ లోని సిటీ సెంటర్ హాస్పిటల్‌ లో చేరారు. కొద్ది రోజులు చికిత్స పొందిన అనంతరం ఆయన కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత ఆయనకు  శ్వాస సంబంధ సమస్యలు తలెత్తాయి.  వైద్య పరీక్షల్లో న్యూమోనియా అని తేలింది. కరోనా కారణంగా కలిగిన న్యూమోనియాతో ఆయన  ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి నాయిని   జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్‌ లో చేరి చికిత్స తీసుకుంటూ వచ్చారు. ఊపిరితిత్తులు, కిడ్నీల సమస్యల తీవ్రం కావడంతో ఆ తర్వాత వైద్యులు ఆయనకు వెంటిలేటర్‌ పై చికిత్స అందిస్తూ వచ్చారు.

 పది రోజులుగా నాయిని కళ్లు కూడా  తెరవలేదు.  బుధ‌వారం సాయంత్రం జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రికి వెళ్లిన సీఎం కేసీఆర్ అక్కడ నాయిని చికిత్స పొందుతున్న గదిలోకి వెళ్లి ఆయనను  చూసిన తర్వాత కుటుంబీకులను పరామ‌ర్శించి ధైర్యం చెప్పారు.  ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాల‌ని  సూచించారు. ఇంతలోనే నాయిని ఆరోగ్య స్థితి మరింత క్షీణించి తుది శ్వాస విడిచారు. ఆయన మృతిచెందినట్లు ఆస్పత్రి వర్గాలు కూడా ప్రకటించాయి. నాయిని నర్సింహారెడ్డికి భార్య అహల్యరెడ్డి కుమారుడు దేవేందర్ రెడ్డి, కుమార్తె వి.సమత రెడ్డి ఉన్నారు.

ఉద్యమంలో చురుకైన పాత్ర

నాయిని నర్సింహారెడ్డి 1944 మే 12న సుభద్రమ్మ, దేవయ్యరెడ్డి దంపతులకు జన్మించారు. ఆయన  స్వగ్రామం  నల్గొండ జిల్లా దేవరకొండ మండలం నేరేడుగొమ్ము.  తెలంగాణ ఉద్యమాల్లో నాయిని నర్సింహారెడ్డి ఎంతో కీలక పాత్ర పోషించాడు. తొలిగా ఉవ్వెత్తున జరిగిన ఉద్యమంలోనూ ఆ తర్వాత మలి దశ ఉద్యమంలోనూ ఆయనది కీలక పాత్ర.
 
కార్మిక నాయకుడు నాయిని

నాయిని ఉద్యమ కారుడే కాదు. కార్మిక సంఘాలకు నాయకుడు కూడా కార్మిక ఉద్యమాల్లోనూ ఆయన చురుకైన పాత్ర పోషించారు. ఎన్నో సంస్థలకు నాయకుడిగా ఉన్నారు.1970లలో హైదరాబాద్ కు చేరుకున్న నాయిని నర్సింహారెడ్డి వీఎస్‌టీ కార్మిక సంఘం నాయకుడిగా పలు సార్లు వ్యవహరించారు.

రాజకీయాల్లోనూ తనదైన ముద్ర

నాయిని నర్సింహారెడ్డి రాష్ట్ర రాజకీయాల్లోనే అత్యంత సీనియర్ నాయకుడు. మొదట్లో జనతా పార్టీ నాయకుడిగా  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  రాజకీయాల్లో  ప్రముఖ పాత్ర పోషించారు. నాయిని హైదరాబాద్ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక పేరు తెచ్చుకున్నారు. ముషీరాబాద్ ఎమ్మెల్యేగా   మూడుసార్లు గెలిచారు. ఆయన పోటీ చేసిన మొదటిసారే  1978లో ఏకంగా టి.అంజయ్యపై విజయకేతనం ఎగురవేశారు. 1985, 2004లో ఎమ్మెల్యేగా ఉన్నారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిలో   చేరిన ఆయన తెలంగాణ ఆవిర్భావం వరకు  ప్రతి  ఉద్యమంలోనూ కేసీఆర్ వెంట నిలిచారు.  2004లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ ఎస్ కాంగ్రెస్ తో పొత్తుతో బరిలోకి దిగింది. కాంగ్రెస్ గెలిచి వైఎస్ సీఎం కావడంతో ఆయన మంత్రి వర్గంలో నాయిని 2005 నుంచి 2008 వరకు సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా పని చేశారు. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో  టీఆర్ ఎస్ విజేతగా నిలవగా  నాయిని  నూతన రాష్ట్ర  తొలి హోంమంత్రిగా పనిచేశారు.  2014 నుంచి 2018 వరకు  ఆయన ఈ బాధ్యతలను నిర్వర్తించారు.

నాయినికి బుల్లెట్ అంటే క్రేజు

నాయిని నర్సింహారెడ్డి కార్మిక పక్షపాతిగా, ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారు. బుల్లెట్ బైక్ అంటే ఆయనకు ప్రీతి. నగరమంతా తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఆయన బుల్లెట్ పై తిరిగే వారు.  అందుకే ఆయనను బుల్లెట్ నర్సన్న అని పిలిచేవారు.
Tags:    

Similar News