అయ్యో ఎంత కష్టం.. ఎదురెదురు వార్డుల్లో భార్య.. భర్తలు

Update: 2020-10-22 04:15 GMT
తెలంగాణ రాష్ట్ర తొలి హోం మంత్రిగా వ్యవహరించిన సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి బుధవారం అర్థరాత్రి వేళ కన్నుమూయటం తెలిసిందే. కరోనా సోకిన ఆయన.. మహమ్మారి నుంచి కోలుకున్నట్లే కోలుకొని.. తీవ్రమైన ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ వెంటిలేటర్ మీదనే తుది శ్వాస విడిచారు. ఆయనకు ఒక కొడుకు.. కుమార్తె.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. నాయిని కుటుంబానికి వచ్చిన కష్టం వింటే అయ్యో అనుకోవాల్సిందే. అనారోగ్యంతో ఆసుపత్రి చేరి చికిత్స పొందుతున్న నాయిని ఆరోగ్య సమస్యలపై కుటుంబం టెన్షన్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ.. నాయిని సతీమణి కరోనాకు గురయ్యారు. ఆమె కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

భార్య భర్తలు.. ఇద్దరు ఒకే ఆసుపత్రి (జూబ్లీహిల్స్ అపోలో) లోని ఎదురెదురు వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. తన జీవిత భాగస్వామి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లుగా నాయినికి తెలీదని చెబుతున్నారు. క్రియాశీలక రాజకీయాల్లో కీలకంగా నాయిని వ్యవహరించినప్పటికి.. నాయిని సతీమణి మాత్రం రాజకీయాలకు దూరంగా ఉండేవారు. ఇంటికి వచ్చిన వారిని కుశల ప్రశ్నలు వేస్తూ పలుకరించి.. వారి యోగక్షేమాల గురించి ఆరా తీసేవారు.

అలాంటి ఆ ఇద్దరు దంపతులు..  కొద్ది రోజుల తేడాతో అనారోగ్యంతో ఒకే ఆసుపత్రిలో.. ఎదురెదురు వార్డుల్లో చికిత్స పొందుతున్న వైనంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. బంధువులు.. వారి శ్రేయోభిలాషులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. బుధవారం అర్థరాత్రిదాటిన తర్వాత నాయిని కన్నుమూశారు. ప్రస్తుతం నాయిని సతీమణి ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్లుగా అపోలో వైద్యులు చెబుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని పలువురు కోరుకుంటున్నారు.
Tags:    

Similar News