పున‌ర్జ‌న్మ ఇప్పుడు క‌ల‌కానే కాదు

Update: 2017-08-26 17:30 GMT
మ‌నిషి చ‌నిపోయిన త‌ర్వాత మ‌రో జ‌న్మ ఎత్త‌డం గురించి ఎవ‌రి మ‌త‌విశ్వాసాలు వారికి ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే చ‌నిపోయిన మ‌నిషికి తిరిగి ప్రాణం పోసే విష‌యంలో మాత్రం అంద‌రిలోనూ ఆకాంక్ష‌లు ఉన‌నాయి. దీన్నినిజం చేసే మొద‌టి ముంద‌డుగు ప‌డింది. చైనాలోని యిన్‌ ఫెంగ్ బయలాజికల్ గ్రూప్ - షండాంగ్ వర్సిటీ అమెరికా ఆల్కోర్ లైఫ్ ఎక్స్‌ టెన్షన్ ఫౌండేషన్ సభ్యుల బృందం ఈ పరిశోధన చేపట్టింది. పురాణ గాథలు - కథలు - ఊహలు - సినిమాలకు మాత్రమే పరిమితమైన పునర్జన్మ భావన త్వరలోనే వాస్తవరూపం దాల్చేందుకు తాము మొద‌టి అడుగు వేసిన‌ట్లు ఈ బృంద స‌భ్యులు బ‌లంగా చెప్తున్నారు.

ఇంత‌కీ పున‌ర్జ‌న్మ‌ను వీరెలా ఆచ‌ర‌ణ సాధ్యం చేస్తున్నారు అంటే క్ర‌యోనిక్స్ అనే ప్ర‌క్రియ ద్వారా. క్ర‌యోనిక్స్ అంటే..వ్యక్తి గుండెకొట్టుకోవడం ఆగిపోయిన సెకన్ల‌ వ్యవధిలోనే రసాయనాలతో శరీరాన్ని గడ్డకట్టించడాన్ని క్రయోనిక్స్ అంటారు. గుండె కొట్టుకోవడం ఆగిపోయిన వెంటనే మరణ ప్రక్రియ పూర్తి కాదని, శరీరంలోని కణజాలాలు - కండరాలు - అవయవాలన్నీ పూర్తి అచేతనంగా మారడానికి కొంత సమయం పడుతుందని శాస్త్రవేత్త‌లు తెలిపారు. ఈ ప్ర‌క్రియ ద్వారా తాజాగా చేసిన పున‌ర్జ‌న్మ ప్ర‌యోగంలో మొద‌టి అడుగు ప‌డింద‌ని చెప్తున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ తో మరణించిన జెన్ వెన్లియాన్(49) అనే మహిళ విష‌యంలో ఈ ప్ర‌క్రియ‌ను మొద‌ట‌గా ప్యోగం రూపంలో చేశారు. ఐస్ - ఫ్రీజర్ కంటే ద్రవరూప నైట్రోజన్‌ లో ముంచితే శరీరం కొన్ని సెకన్ల‌లోనే పూర్తిగా గడ్డకడుతుంది. ఇందులో గ్లిజరాల్ - ప్రొపండియోల్ వంటి రసాయనాలను కలిపితే శరీర కణాలు పాడుకావు. దీంతో మృతదేహాన్ని తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తే ఏళ్ల‌పాటు కాపాడొచ్చు. స‌రిగ్గా ఈ ప్ర‌క్రియ‌ను ఉప‌యోగించే జినాన్ లోని యిన్‌ ఫెంగ్ బయలాజికల్ గ్రూప్ ల్యాబ్ లో క్రయోనిక్స్ విధానంలో భద్రపరిచేందుకు 2000 లీటర్ల ద్రవరూప నైట్రోజన్ వాడారు. క్రయోనిక్స్ విధానంలో జెన్ వెన్లియాన్ మరణ ప్రక్రియను వాయిదా వేశామన్నారు. జెన్ గుండె మాత్రమే కొట్టుకోవడం మానేసిందని, మిగతా అవయవాలు అచేతనంగా మారకముందే గడ్డకట్టించామని వివ‌రించారు.

అయితే ఇంత‌కీ పున‌ర్జ‌న్మ ఎలా ప్ర‌స్తాదిస్తారు అనేదానిపై మాత్రం స్ప‌ష్ట‌మైన స‌మాధానం ఈ శాస్త్రవేత్త‌లు ఇవ్వ‌లేదు. పున‌ర్జ‌న్మ కోసం ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని పేర్కొంటూ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం  అది సాధ్యం కాద‌ని చెప్పారు. ప్ర‌స్తుత ప‌రిజ్ఞానం ప్ర‌కారం ఆగిపోయిన గుండెను తిరిగి పనిచేయించలేమని.. అంగీకరించారు. అయితే భవిష్యత్‌ లో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన‌ ఆగిపోయిన గుండెను తిరిగి కొట్టుకునేలా చేయగలుగుతామని ధీమా వ్య‌క్తం చేశారు. అప్పుడు జెన్ వెన్లియాన్‌ కు పునర్జన్మ ప్రసాదిస్తామని ప్ర‌క‌టించారు.
Tags:    

Similar News