ఓటమికి ఐపీఎల్ కారణమట..!

Update: 2019-06-24 07:55 GMT
దక్షిణాఫ్రికా పేస్ సంచలనం రబాడా.. ఈ ఫాస్ట్ బౌలర్ ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరుఫున అద్భుత ప్రదర్శన చేశాడు. ఆ టీం సెమీస్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఆడిన 12 మ్యాచ్ ల్లో 25 వికెట్లు తీశాడు. కానీ ప్రపంచకప్ వచ్చేసరికి తేలిపోయాడు. 6 మ్యాచ్ ల్లో 50.83 సగటుతో కేవలం 6 వికెట్లు తీశాడు. ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఇక ఐపీఎల్ లో ఆడి సౌతాఫ్రికా ప్రధాన బౌలర్ డేల్ స్టెయిన్ కూడా గాయాలతో ప్రపంచకప్ కు దూరమయ్యాడు.  దక్షిణాఫ్రికా ఇప్పుడు పాకిస్తాన్ తో ఓడి ప్రపంచకప్ నుంచి నిష్ర్కమించిన వేళ ఐపీఎల్ పై సౌతాఫ్రికా కెప్టెన్ ఆడిపోసుకుంటున్నాడు.

ఆదివారం పాకిస్తాన్ తో మ్యాచ్ లో దక్షిణాఫ్రికాకు డూ ఆర్ డై మ్యాచ్. గెలిస్తేనే ప్రపంచకప్ లో ముందడుగు వేసేది. కానీ ఓడిపోయి లీగ్ దశలోనే దక్షిణాఫ్రికా ఇంటిదారి పట్టింది. పాకిస్తాన్ గెలిచి  తన సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే కీలకమైన ఈ మ్యాచ్ లో ఓటమిపై దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఐపీఎల్ లో ఆడడమే తమ కొంప ముంచిందని.. ప్రపంచకప్ లో ఓటమికి ఐపీఎల్ లే కారణమని దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ ఆరోపించారు. ఆటగాళ్లు ఐపీఎల్ లో మెరుగ్గా ఆడారని.. అక్కడ ఆడి అలిసిపోయి పనిభారంతో ఈ ప్రపంచకప్ లో సరైన ప్రదర్శన చేయలేకపోతున్నారని వాపోయాడు.

ఐపీఎల్ ఆడటం వల్లే ఈ పరిస్థితి దక్షిణాఫ్రికాకు వచ్చిందని ఆ జట్టు కెప్టెన్ డుప్లెసిస్ వాపోయాడు. కొంత మంది ఆటగాళ్లకు విశ్రాంతినిస్తే.. పని ఒత్తిడి తగ్గి ఉపశమనం కలిగేదని అన్నారు. విశ్రాంతి లేకుండా ఆడడమే ఈ ఓటమికి కారణమన్నారు. గాయాలు కూడా తమపై ప్రభావం చూపాయని చెప్పుకొచ్చాడు.

   


Tags:    

Similar News