వాట్సాప్‌ నిఘా పెట్టిన ఫేస్‌బుక్‌ .. కాంట్రాక్ట్‌ ఉద్యోగులతో ఆ పని .. !

Update: 2021-09-09 06:43 GMT
అమెరికా ఇన్వెస్టిగేషన్‌ మీడియా సంస్థ ప్రొపబ్లికా ఇన్వెస్టిగేషన్‌ కథనం ప్రకారం.. కోట్లలో యూజర్ల వాట్సాప్‌ అకౌంట్లపై ఫేస్‌ బుక్‌ కన్నేసిందని, ఆస్టిన్‌, టెక్సాస్‌, డబ్లిన్‌, సింగపూర్‌ లలో వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులతో ఈ వ్యవహారం నడిపిస్తోందని ఆరోపణలు చేసింది. వాట్సాప్‌ నిఘాపై కన్నేయడంతో పాటు ఈ వ్యవహారం కోసం ఫేస్‌ బుక్‌ తన సొంత ఆల్గారిథంనే ఉపయోగిస్తోందని ఈ కథనం వెల్లడించింది.

అయితే దొంగచాటుగా మెసేజ్‌ లు చదువుతోందన్న ఆరోపణల్ని ఫేస్‌ బుక్‌ ఖండించింది. కథనంలో ఆరోపిస్తున్న టీం , వాట్సాప్‌ యూజర్ల ప్రైవసీని పరిరక్షించడమే పనిగా పెట్టుకుందని, యూజర్లు పంపించే రిపోర్ట్‌ అబ్యూజ్‌.. ఇతరత్ర ఫిర్యాదుల్ని సమీక్షించడం కోసమేనని చెప్పింది. ఎన్క్రిప్షన్ కారణంగా వాట్సాప్‌ కాల్స్‌, వ్యక్తిగత మెసేజ్‌ లను ఫేస్‌ బుక్‌ ఎట్టిపరిస్థితుల్లో చదవలేదని స్పష్టం చేసింది ఫేస్‌ బుక్‌. అంతేకాదు ఫేస్‌ బుక్‌ యూజర్ల విషయంలోనూ తాము భద్రతకు కట్టుబడి ఉన్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది.

2014లో నాస్‌సెంట్‌ నుంచి వాట్సాప్‌ మెసేజింగ్‌ యాప్‌ను 19 బిలియన్ల డాలర్లకు కొనుగోలు చేసింది ఫేస్‌ బుక్‌. ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మందికి పైగా వాడుతున్న వాట్సాప్‌ లో మొత్తంగా రోజుకి వెయ్యి కోట్లకి పైగా మెసేజ్‌ లు పంపించుకుంటున్నారని అంచనా. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా యూజర్ల మధ్య సురక్షితమైన ఛాటింగ్‌ ఉంటుందని, యూజర్‌ ప్రైవసీకి ఎలాంటి భంగం కలగబోదని ఫేస్‌ బుక్‌-వాట్సాప్‌ ఎప్పటి నుంచో చెప్తోంది.

భారత్‌ తోపాటు ఐరోపాయేతర దేశాల్లో తమ ప్రైవసీ పాలసీలో ఇటీవల వాట్సాప్ మార్పులు చేసింది, మీరు వాట్సాప్ ఉపయోగించాలి అనుకుంటే.. కచ్చితంగా కొత్త విధానానికి అనుమతి తెలపాల్సిందే. ఆండ్రాయిడ్, ఐవోఎస్ వినియోగదారులకు నోటిఫికేషన్ రూపంలో వాట్సాప్ ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ విధానానికి మీరు అనుమతి తెలపకపోతే.. ఫిబ్రవరి 8, 2021 తర్వాత మీ అకౌంట్ డిలీట్ అవుతుందని దీనిలో స్పష్టంగా తెలియజేశారు.అంటే ఈ కొత్త విధానాలకు సరేనని అనుమతి ఇవ్వకపోతే ఫిబ్రవరి 8 తర్వాత మీరు వాట్సాప్ ఉపయోగించలేరు.

బలవంతంగా వాట్సాప్ అనుమతి తీసుకుంటోందని చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ‘‘అంగీకరించం’’ అనే ఆప్షన్ కూడా లేదని అంటున్నారు.సాధారణంగా వాట్సాప్ లాంటి సోషల్ మీడియా సైట్లు ఇలాంటి కఠినమైన విధానాలు తీసుకురావని సైబర్ నిపుణులు అంటున్నారు.యాక్సెప్ట్ లేదా డినై అప్‌ డేట్ లాంటి రెండు ఆప్షన్‌ లూ అందుబాటులో ఉంటాయని వివరిస్తున్నారు.వాట్సాప్ తాజా విధానాలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. చాలామంది సైబర్ నిపుణులు ఈ విధానాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.




Tags:    

Similar News