నడ్డాతో భేటీకి ముందు ఈటలకు షాకింగ్ అనుభవం

Update: 2021-06-01 09:38 GMT
రాజకీయాలు మహా చిత్రంగా ఉంటాయి. పైకి కనిపించే దానికి లోపల జరిగే దానికి ఏ మాత్రం పోలిక ఉండదు. ఎవరి దాకానో ఎందుకు.. కేసీఆర్ - ఈటల ఎపిసోడ్ నే తీసుకుంటే.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన గంటల వ్యవధిలోనే ఈటలకు దిమ్మ తిరిగేలా షాకివ్వటం తెలిసిందే. అప్పటివరకు కేసీఆర్ ప్రభుత్వంలో కీలక మంత్రి పదవిలో ఉన్న ఈటల.. కొద్ది గంటల వ్యవధిలోనే ఆ పదవిని పోగొట్టుకోవటమే కాదు.. పలు కేసులు నమోదైన పరిస్థితి.

ఇదంతా తెలిసిన విషయాలే అయినా.. ఇక్కడ ప్రస్తావించటానికి కారణం లేకపోలేదు. కేసీఆర్ తీరుతో తీవ్రమైన మనస్తాపంతో ఉన్న ఈటల రాజేందర్ బీజేపీలో చేరేందుకు దాదాపుగాసిద్ధమైనట్లు చెబుతారు. తనతో పాటు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిని వెంట పెట్టుకొని ఢిల్లీకి వెళ్లటం తెలిసిందే. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన భేటీ ఉంది. సాధారణంగా తీవ్రమైన మనస్తాపంతో ఉన్న వారు.. రాజకీయంగా అనూహ్యంగా దెబ్బలు తిన్న వారికి సాంత్వన కలిగేలా వ్యవహరించి.. వారి మనసును దోచుకోవటం ఒక పద్దతి.

అవకాశం వచ్చినప్పుడే తామేమిటో చూపించే తీరు మరో పద్దతి. ఈటలకు ఈసారి రెండో అనుభవం ఎదురైందని చెబుతున్నారు. కేసీఆర్ ను కలిసేందుకు అవకాశం లేకపోవటం.. ఆయన కోసం ప్రగతి భవన్ కు వెళితే.. సారు బిజీగా ఉన్నారంటూ కలవకుండా వెనక్కి పంపటం లాంటి చేదు అనుభవాల్ని ఈ మధ్యన వెల్లడించటం తెలిసిందే. అలాంటి ఈటలకు ఢిల్లీలోనూ వెయిటింగ్ తప్పలేదంటున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో సమావేశం కావటానికి వెళ్లిన ఈటలతో పాటు.. ఏనుగు రవీందర్ రెడ్డి.. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. వివేక్ ఇతర నేతలు ఉన్నారు.

ఈటలతో భేటీ కావటానికి ముందు నడ్డా.. బండి సంజయ్.. వివేక్ తో భేటీ కావటం.. ఆ టైంలో ఈటల.. ఏనుగు రవీందర్ రెడ్డిని బయట వెయిట్ చేయించినట్లుగా తెలుస్తోంది. వారి మీటింగ్ అయ్యాక ఈటలను లోపలకు పిలిచినట్లుగా చెబుతున్నారు. నిజానికి బండి సంజయ్.. వివేక్ నుంచి బ్రీఫ్ చేయించుకోవాలంటే..ఈటలకు ఇచ్చిన అపాయింట్ మెంట్ కు ముందే.. తమ సమావేశాన్ని పూర్తి చేసుకొని ఉంటే బాగుండేది. ఈటల వచ్చినంతనే ఆయన్ను సాదరంగా ఆహ్వానించి ఉండి ఉంటే.. గాయపడి ఉన్న ఆయన మనసుకు అంతోఇంతో సాంత్వన లభించేది. అందుకు భిన్నంగా వ్యవహరించిన బీజేపీ అగ్రనేతల తీరు ఈటలకు షాకిచ్చినట్లుగా చెబుతున్నారు. లోగుట్టుగా జరిగిన ఈ విషయం ఎప్పుడో ఒకప్పుడు బయటకు రావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News