ముగిసిన నామినేషన్ల పర్వం.. 68 తిరస్కరణ..!

Update: 2020-11-22 08:10 GMT
జీహెచ్​ఎంసీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ పర్వం ముగిసింది. మొత్తం 1825 నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. 68 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అయితే ఈ సారి అత్యధికంగా టీఆర్​ఎస్​, బీజేపీ నుంచే నామినేషన్లు వచ్చాయి. వివేకానంద నగర్​లో అత్యధికంగా  ఐదు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.  పలు చోట్ల ముగ్గురు పిల్లలున్నారన్న వివాదం, ఫిర్యాదులు కనిపించాయి. ముగ్గురు పిల్లల కారణంగా గాజుల రామారం కాంగ్రెస్‌ అభ్యర్థి కూన శ్రీనివాసగౌడ్‌ నామినేషన్‌ను తిరస్కరించారు.

 జూబ్లీహిల్స్‌ బీజేపీ అభ్యర్థి వెల్దండ వెంకటేశ్‌కు నలుగురు పిల్లలున్నారని, కానీ అఫిడవిట్‌లో తప్పుగా చూపారని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాజా సూర్యనారాయణ రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు. తనకు 1995 తరువాత ముగ్గురు సంతానం ఉందని, మొదటి కాన్పులో ఒకరు, రెండో సారి కవలలు పుట్టారని వివరాలు ఆర్‌ఓకు చూపెట్టారు. నాలుగో సంతానంగా చెబుతోన్న పాప తన తమ్ముడి కూతురని, ఆమె జనన ధ్రువీకరణ పత్రం సమర్పించారు. దీంతో వెంకటేష్‌ నామినేషన్‌ను రిటర్నింగ్‌ ఆఫీసర్‌ ఆమోదించారు.

జంగంమెట్‌లో 25, మల్లాపూర్‌లో 23 నామినేషన్లు దాఖలయ్యాయి. బార్కస్​లో కేవలం ముగ్గురు మాత్రమే నామినేషన్లు వేశారు.  మొఘల్‌పుర, అహ్మద్‌నగర్‌లలో నలుగురు చొప్పున బరిలో నిలిచారు.

ఆదివారం సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు  గడువు ఉన్నది. ఒక్క డివిజన్​ నుంచి ఎంతమంది బరిలో ఉన్నారన్న విషయం ఈ రోజు సాయంత్రం కల్లా  క్లారిటీ వస్తుంది. పలు చోట్ల రెబల్స్ ఇండిపెండెంట్​గా నామినేషన్లు వేశారు. పార్టీలు ప్రస్తుతం వారిని బుజ్జగించే పనిలో పడ్డాయి.

సాయంత్రం వరకు ఈ విషయంపై క్లారిటీ రానున్నది. అయితే వివిధ రాజకీయ పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా ఈ లోగానే బీఫారం సమర్పించారు. కాంగ్రెస్​ పార్టీ ఇంకా 34 చోట్ల అభ్యర్థులను ప్రకటించలేదు. అక్కడ చాలామంది ఆశావహులు పోటీలోకి దిగారు. అయితే బీఫాం ఎవరిస్తారన్న విషయం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న హడావుడి గమనిస్తే బీజేపీ, టీఆర్​ఎస్​ మధ్యే ప్రధాన పోటీ ఉన్నట్టు కనిపిస్తున్నది. ఇప్పటికే ప్రచారం ప్రారంభించిన కేటీఆర్​.. బీజేపీపైనే ఫోకస్​ చేశారు. బీజేపీ అగ్రనేతలు టార్గెట్​గా ఆయన ఆరోపణలు గుప్పిస్తున్నారు.
Tags:    

Similar News