మనల్ని దెబ్బేస్తున్న ఇద్దరు సెనేటర్లు

Update: 2017-01-21 04:59 GMT
అమెరికాలో ట్రంప్ శకం మొదలైంది. దీనికి కాస్త ముందే..ఇద్దరు సెనేటర్ల పుణ్యమా అని భారత ఐటీ ఉద్యోగులకు షాక్ తగిలే దిశగా అడుగులు పడుతున్నాయి. హెచ్ 1బి వీసా నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తూ కీలక బిల్లును తెచ్చేందుకు ఇద్దరు సెనేటర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వారిద్దరి ప్రయత్నాలు ఫలిస్తే.. భారత ఐటీ ఉద్యోగులకు షాక్ తప్పదనే చెప్పాలి.

అమెరికాలో శక్తివంతమైన సెనేటర్లుగా పేరున్న చుక్ గ్రాస్లే.. డిక్ డర్బన్ లు ఒక కీలక బిల్లును తెర మీదకు తెస్తున్నారు. హెచ్ 1బి వీసాల జారీలో అమెరికా వర్సిటీల్లో చదువుకున్న వారికే తొలిప్రాధాన్యం ఇవ్వాలన్నది వారి వాదన. అదే జరిగితే.. అమెరికాకు వెళ్లే వేలాది మంది భారతీయ ఐటీ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

అమెరికాలో అత్యున్నత స్థాయి శ్రామిక శక్తిని నింపేందుకే తాము ప్రయత్నం చేస్తున్నట్లుగా ఈ ఇద్దరు సెనేటర్లు వాదిస్తున్నారు. అమెరికాలోని కంపెనీలు తక్కువ వేతనాలు ఇస్తూ.. చౌకగా వచ్చే విదేశీయుల్ని అమెరికాకు తీసుకొస్తొందని.. దీంతో స్థానిక అమెరికన్లకు ఉపాధి అవకాశాలు పోతున్నాయన్నది వారి వాదన.

అమెరికన్ల ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా కంపెనీలు అనుసరిస్తున్న తీరును అడ్డుకునేందుకు.. అమెరికాలో చదివిన పట్టభద్రులకు తొలుత అవకాశాలు ఇవ్వాలన్నది ఈ ఇద్దరి సెనేటర్ల వాదన. వీరి వాదన చట్టరూపం దాలిస్తే.. విదేశీ నిపుణుల కోసం బయట దేశాల నుంచి ఉద్యోగుల కంటే కూడా అమెరికాలో చదివిన వారికే మొదట అవకాశం లభిస్తుంది. అదే జరిగితే భారత ఐటీ ఉద్యోగులకు భారీగా దెబ్బ పడినట్లేనని చెప్పక తప్పదు. కీలకమైన ఈ బిల్లు విషయంలో విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్న ఇద్దరు సెనేటర్ల లక్ష్యం మీదనే భారత ఐటీ ఉద్యోగుల భవిత ఆధారపడి ఉంటుందని చెప్పక తప్పదు. భారతీయులుగా వీరి ప్రయత్నాలు ఫలించకూడదని మాత్రం కోరుకుందాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News