దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థి అతడేనట

Update: 2020-09-07 05:30 GMT
ఏ పని చేసినా.. అన్ని చూసుకొని చేసే అలవాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాస్త ఎక్కువే. ఏ పనినైనా ఇలా మాత్రమే చేయాలనే పరిమితులు ఆయన అస్సలు పెట్టుకోరు. తాజాగా ఆయన చేయబోయే పని ఈ కోవకు చెందినదేనని చెబుతున్నారు. ఏదైనా ఉప ఎన్నిక సందర్భంగా తమ పార్టీ అభ్యర్థి ఎవరన్న విషయాన్ని అసెంబ్లీలో చెబుతారా? అలాంటి అవకాశం ఉంటుందా? అంటే.. లేదంటారు. కానీ.. కేసీఆర్ వీటన్నింటికి భిన్నమన్న విషయం తెలిసిందే.

త్వరలో జరిగే దుబ్బాక ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరన్న విషయాన్ని అసెంబ్లీ వేదికగా చేసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిస్తారని చెబుతున్నారు. అదెలా సాధ్యమంటే.. అదే గులాబీ బాస్ గొప్పతనంగా చెప్పాలి. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే.. కేసీఆర్ కు సన్నిహితుడు దివంగత సోలిపేట రామలింగారెడ్డి మరణం గురించి తెలిసిందే. అనారోగ్యంతో మరణించిన ఆయనకు అంతిమ వీడ్కోలు పలకటానికి కేసీఆర్ స్వయంగా వెళ్లటం తెలిసిందే.

త్వరలో దీనికి సంబంధించిన ఉప ఎన్నిక జరగనుంది. ఇక్కడ నుంచి పోటీ చేయటానికి పలువురు ఆశలు పెట్టుకున్నా.. టికెట్ రేసులో మాత్రం ఉన్నది ఇద్దరే. వారిలో ఒకరు రామలింగారెడ్డి కుటుంబ సభ్యుడు ఒకరైతే.. మరొకరు మాజీ మంత్రి ముత్యంరెడ్డి తనయుడు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థిగా అయితే రామలింగారెడ్డి సతీమణి సుజాత కానీ కొడుకు సతీష్ రెడ్డిల్లో ఎవరో ఒకరికి ఖాయంగా ఇస్తారని చెబుతున్నారు.

కొడుకుతో పోలిస్తే.. భార్య సుజాతకు ఇవ్వొచ్చని కొందరు చెబుతుంటే.. భవిష్యత్తు అవసరాలను చూస్తే..కొడుకును అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఇదిలా ఉంటే.. అభ్యర్థి ప్రకటనను సీఎం కేసీఆర్ సరికొత్త తీరులో ప్రకటిస్తారని చెబుతన్నారు. ఈ రోజు షురూ అయ్యే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సోలిపేట సంతాప తీర్మానం సందర్భంగా చేసే ప్రసంగంలోనే అభ్యర్థి ఎవరన్న విషయాన్ని తెలియజేసేలా కేసీఆర్ ప్రసంగం ఉందని చెబుతున్నారు. తన మాటతో దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరన్న విషయంపై క్లారిటీ ఇచ్చేస్తారని తెలుస్తోంది.
Tags:    

Similar News