ఇద్దరు అక్కల్ని చంపినోడు సూసైడ్ చేసుకున్నాడు

Update: 2020-07-02 04:00 GMT
రెండు రోజుల క్రితం హైదరాబాద్ పాతబస్తీలో సంచలన హత్యలు చోటు చేసుకోవటం తెలిసిందే. తల్లికి ఆరోగ్యం బాగోలేదని సొంత అక్కల్ని ఇంటికి పిలిచిన తమ్ముడు.. ఉన్మాదంతో ఇద్దరు అక్కల్ని మట్టుబెట్టటంతో పాటు.. మిగిలిన ఇద్దరు అక్కల్ని చంపే ప్రయత్నం చేయటం సంచలనంగా మారింది.ఇందులో మూడో అక్క తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆస్తి తగదాలతో పాటు.. గత ఏడాది తన భార్యను చంపటానికి కారణం తన అక్కల మాటల్ని వినటమేనని.. అందుకు ప్రతీకారం తీర్చుకున్నట్లుగా చెప్పిన ఉన్మాది తమ్ముడు తాజాగా ఫ్యాన్ కు ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.

హైదరాబాద్ మహానగరం పాతబస్తీలోని  బర్కస్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ వైనం హాట్ టాపిక్ గా మారింది. కుళ్లిపోయిన మృతదేహం దుర్వాసన రావటంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి చూడగా.. ఆత్మహత్య చేసుకున్న వైనం బయటకు వచ్చింది. రెండురోజుల క్రితమే సూసైడ్ చేసుకొని ఉంటారని భావిస్తున్నారు. పోస్టమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కల్ని చంపిన వేదనతో కానీ.. తన పగ తీరిందన్న ఉద్దేశంతో కానీ ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు.

చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని సలాల ప్రాంతంలో నివాసం ఉండే అహ్మద్ బిన్ ఇస్మాయిల్ తన ఇద్దరు అక్కల్ని గొంతు కోసి చంపేయటం.. మూడో అక్క ఇంటికి వెళ్లి దాడి చేయగా.. అడ్డుకున్న బావను గాయపర్చాడు. అనంతరం నాలుగో అక్క ఇంటికి వెళితే.. ఆమె ఆసుపత్రికి వెళ్లిందన్న విషయాన్ని తెలుసుకొని అక్కడకు వెళ్లారు. అయితే.. పోలీసులు ఉండటంతో వెనక్కి తిరిగి వచ్చేశాడు. గత ఏడాది ఇస్మాయిల్ కట్టుకున్న భార్యను చంపిన కేసులో జైలుకు వెళ్లి ఇటీవలే బయటకు వచ్చాడు. అంతలోనూ ఈ దారుణాలకు ఒడిగట్టిన అతగాడు.. చివరకు ఆత్మహత్య చేసుకోవటం గమనార్హం.
Tags:    

Similar News